AP PRC: ఏ లెక్కల ప్రకారం పీఆర్సీ ఇచ్చారు?: బండి శ్రీనివాసరావు

 పీఆర్సీ ఉద్యమం మరింత ఉద్ధృతం చేస్తామని పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు తెలిపారు. 

Updated : 29 Jan 2022 12:55 IST

నెల్లూరు: పీఆర్సీ ఉద్యమం మరింత ఉద్ధృతం చేస్తామని పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఫిట్‌మెంట్‌ ఇంత తగ్గిస్తారనుకోలేదన్నారు. హెచ్‌ఆర్‌ఏలోనూ అన్యాయం జరిగిందని ఆయన మండిపడ్డారు. ఏ లెక్కల ప్రకారం పీఆర్సీ ఇచ్చారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా నెల్లూరు కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల రిలే దీక్షలు జరుగుతున్నాయి. దీక్షల్లో బండి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. పీఆర్సీ నివేదికను బయటపెట్టాలని కోరుతున్నామన్నారు. పన్నెండు సార్లు చర్చలకు వెళ్లినా ఫలితం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఉద్యమానికి అన్నిసంఘాలు మద్దతిస్తున్నాయని శ్రీనివాసరావు తెలిపారు. ఇచ్చిన హామీలన్నింటిపై మాట తప్పారని ఆరోపించారు. మరోవైపు పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.

అప్పటి దాకా నిరసనలు కొనసాగుతాయి: ఉద్యోగులు

విజయవాడలోని ధర్నాచౌక్‌ రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్న పీఆర్సీ సాధన సమితి నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిమాండ్లు నెరవేరిస్తేనే చర్చలకు సిద్ధమని స్పష్టం చేశారు. చర్చల పేరిట ప్రభుత్వం కాలయాపన చేయడం మంచిదికాదని ఉద్యోగులు హచ్చరించారు. పీఆర్సీ జీవోల్ని వెనక్కి తీసుకునే దాకా నిరసనలు కొనసాగుతాయని చెప్పారు. రిలే నిరాహార దీక్షలో వామపక్ష కార్మిక సంఘం నేతలు పాల్గొన్నారు.

ఇష్టమొచ్చినట్లు ఫిట్‌మెంట్‌ ప్రకటించారు: బొప్పరాజు వెంకటేశ్వర్లు

విశాఖలో పీఆర్సీ సాధన సమితి మహిళా ఐకాస దీక్షలు నిర్వహిస్తోంది. దీక్షా శిబిరంలో పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. ‘‘నల్ల బ్యాడ్జీలతో వస్తే సీఎంతో చర్చలు కుదరవన్నారు. ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా ఫిట్‌మెంట్‌ ఎక్కువ ఇవ్వలేమన్నారు. ఫిట్‌మెంట్‌ వారికి ఇష్టమొచ్చినట్లు ప్రకటించారు. మేం ఒప్పుకున్నామంటూ ప్రచారం చేస్తున్నారు. మూడేళ్లుగా ప్రభుత్వం వద్ద మోసపోయాం’’ అని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని