Andhra News: చేతనైతే రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప దొంగదెబ్బ తీయొద్దు: అచ్చెన్నాయుడు

ఫ్యాక్షన్ దాహంతో వైకాపా నేతలు పచ్చని పొలాలనూ వదలడం లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. చిత్తూరు జిల్లా, దిగువ శితివారిపల్లెలో తెదేపా

Published : 18 Mar 2022 01:41 IST

అమరావతి: ఫ్యాక్షన్ దాహంతో వైకాపా నేతలు పచ్చని పొలాలనూ వదలడం లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. చిత్తూరు జిల్లా, దిగువ శితివారిపల్లెలో తెదేపా నేతలు భూమిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిల పొలాలను దగ్ధం చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. నేతల ఆర్థిక మూలాలు కుంగదీసి రాజకీయంగా దెబ్బకొట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్‌ తన ఫ్యాక్షన్ బుద్ధిని రాష్ట్రమంతా ఎక్కిస్తున్నారని దుయ్యబట్టారు. పచ్చని పొలాల్లో నిప్పు పెట్టడం వైకాపా రాక్షసత్వానికి అద్దం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘కష్టపడి పెట్టుబడి పెట్టి సాగు చేసుకున్న టమోట, మిరప పంటలను జగన్ రెడ్డి గూండాలు తగలబెట్టారు. మంటల్లో బిందు సేద్యం పరికరాలు, పైపులు సైతం కాలిపోయాయి. గతంలో కర్నూలు జిల్లాలోనూ తెదేపా సానుభూతిపరుల పొలాలను నాశనం ఇలానే నాశనం చేశారు. సీఎం జగన్‌ నేర్పించిన కుసంస్కారాన్ని నేడు రాష్ట్రంలో వైకాపా కార్యకర్తలు, నేతలు అమలు చేస్తున్నారు. చేతనైతే రాజకీయంగా నేరుగా ఎదుర్కోవాలి తప్ప దొంగదెబ్బ తీయడం సిగ్గుచేటు. వైకాపా నేతల పాపాలకు అడ్డుకట్ట పడే రోజు తొందర్లోనే వస్తుంది. వారు చేసే ప్రతి పనికి వడ్డీతో సహా చెల్లిస్తాం. పొలాలు తగలబెట్టిన వైకాపా కార్యకర్త శంకర్ రెడ్డిపై తక్షణమే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వమే పరిహారం అందించాలి. భూమిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది’’ అని అచ్చెన్నాయుడు భరోసా కల్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని