CBN: నా గుండె బరువెక్కింది: చంద్రబాబు

మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు రవీంద్రనాథ్‌ మృతి బాధాకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రవీంద్ర మరణవార్త తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు...

Updated : 02 Jun 2021 11:25 IST

మాగంటి బాబు కుమారుడి మృతికి తెదేపా అధినేత సంతాపం

అమరావతి: మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు రవీంద్రనాథ్‌ మృతి బాధాకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు. రవీంద్ర మరణవార్త తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఒక కొడుకుని పోగొట్టుకుని పుత్రశోకంతో ఉన్న మాగంటి దంపతులు.. ఇప్పుడు మరో కుమారుడిని కోల్పోవడం చూసి బాధతో తన గుండె బరువెక్కిందన్నారు. పరిస్థితుల్ని తట్టుకుని నిలబడేలా ఆ కుటుంబానికి మనో ధైర్యం ఇవ్వాలని.. రవీంద్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.

రవీంద్రనాథ్‌ హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఓ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కోకాపేటలో నివసించే ఆయన గత నెల 28న బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 1లోని హయత్‌ ప్లేస్‌ హోటల్‌లో దిగారు. రవీంద్రకు లివర్‌ స్కిరోసిస్‌ సమస్య ఉండటంతో చికిత్స పొందడానికి నగరానికి వచ్చారు. మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో హోటల్‌ గది ఖాళీ చేయాల్సి ఉండగా సాయంత్రం 6.30 గంటలకూ బయటకు రాలేదు. హోటల్‌ సిబ్బంది గుర్తు చేయడానికి వెళ్తే ఎంతకూ తలుపు తీయలేదు. దీంతో హోటల్‌ మేనేజర్‌ మరో తాళం చెవితో తలుపు తెరిచారు. రవీంద్ర స్నానాల గదిలో పడిపోయి నిర్జీవంగా కనిపించారు. అతని నోట్లో నుంచి రక్తం వచ్చిన ఆనవాళ్లు ఉన్నాయి. బంజారాహిల్స్‌ పోలీసులు వచ్చి వివరాలు సేకరించి, మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మాగంటి బాబు  ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రాథమికంగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని