Andhra News: దుగ్గిరాల ఎంపీపీగా వైకాపా అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక

ఉత్కంఠ రేపిన గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీగా వైకాపా అభ్యర్థి రూపవాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Updated : 05 May 2022 18:36 IST

దుగ్గిరాల: ఎంతో ఉత్కంఠ రేపిన గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక పూర్తయింది. వైకాపా అభ్యర్థి దానబోయిన రూపవాణి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఎంపీపీ పదవి బీసీ మహిళకు రిజర్వ్‌ అయింది. ఈ పదవికి ఒకే నామినేషన్‌ వచ్చిందని.. ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ధ్రువపత్రాన్ని రూపవాణికి అందజేశారు.

పరిషత్‌ ఎన్నికలు ముగిసిన తర్వాత వివిధ కారణాలతో దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక రెండుసార్లు వాయిదా పడింది. 18 ఎంపీటీసీ స్థానాలున్న దుగ్గిరాల ప్రజా పరిషత్‌లో 9 తెదేపా, 8 వైకాపా, 1 జనసేన గెలుపొందాయి. దీంతో ఎంపీపీ పదవి ఎవరికి దక్కుంతుందోననే ఉత్కంఠ  కొనసాగుతూ వచ్చింది. ఇప్పటికే రెండుసార్లు ఎంపీపీ ఎన్నిక వాయిదా పడటంతో మూడోసారి జరిగే పరిణామాలపై ఆసక్తి నెలకొంది.

ఈ క్రమంలో వైకాపాకు చెందిన రెబల్‌ అభ్యర్థి తాడిబోయిన పద్మావతిని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి (ఆర్కే) క్యాంప్‌నకు తరలించారు. ఈ ఉదయం ఎంపీడీవో కార్యాలయానికి వైకాపాకు చెందిన ఐదుగురు సభ్యులతోనే ఎమ్మెల్యే రావడం.. అందులో పద్మావతి లేకపోవడం చర్చనీయాంశమైంది. ఆ తర్వాత వైకాపాకు చెందిన మరో ఇద్దరు సభ్యులు అక్కడికి చేరుకున్నారు. మరోవైపు తెదేపా తరఫున బీసీ సామాజికవర్గం నుంచి గెలుపొందిన షేక్‌ జబీన్‌కు కుల ధ్రువీకరణ పత్రం రాకపోవడంతో ఆ పార్టీ నుంచి ఎవరూ ఎంపీపీ పదవికి నామినేషన్‌ వేయలేదు. దీంతో వైకాపా అభ్యర్థి రూపవాణి ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని