AP News: ఆ నివేదికను బహిర్గతం చేయకపోవడం అత్యంత దుర్మార్గం: ఎమ్మెల్సీ లక్ష్మణరావు

పీఆర్సీ జీవోలను రద్దు చేయాలనే డిమాండ్‌తో పీఆర్సీ సాధన సమితి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తోంది.

Updated : 23 Jan 2022 13:54 IST

విజయవాడ: రాష్ట్రంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రభుత్వం నడుస్తోందని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ లక్ష్మణరావు విమర్శించారు. ఉద్యోగులూ రాజ్యాంగంలో భాగమేనని.. వారితో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని కోరారు. విజయవాడ ఎన్జీవో కార్యాలయంలో పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అన్ని జిల్లాలకు చెందిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల నేతలు పాల్గొన్నారు. పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని నేతలు పునరుద్ఘాటించారు. రేపు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వనున్న నేపథ్యంలో ఉద్యమ కార్యాచరణపై రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో చర్చించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ  పీడీఎఫ్‌ తరఫున ఉద్యోగ సంఘాల ఆందోళనకు మద్దతిస్తున్నట్లు చెప్పారు. అశుతోష్‌ మిశ్రా నివేదికను బహిర్గతం చేయకపోవడం అత్యంత దుర్మార్గమని ఆక్షేపించారు. పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయకుండా ఫిట్‌మెంట్‌ ప్రకటించడం చరిత్రలో ఎప్పుడూ లేదన్నారు. ఉద్యమాన్ని నీరుగార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఉద్యోగులకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో ప్రచారం చేయిస్తోందని.. వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి ఉద్యోగుల సత్తా చూపి డిమాండ్లు పరిష్కరించుకోవాలన్నారు. ఉద్యోగులను అణగదొక్కాలని చూసిన వారంతా భ్రష్టుపట్టారని ఆయన వ్యాఖ్యానించారు. అప్రజాస్వామిక విధానాలు అవలంభించిన ప్రభుత్వాలు కూలిపోక తప్పదన్నారు.

వేయికళ్లతో ఎదురుచూశాం: ఆర్టీసీ ఎన్‌ఎంయూ నేత సుజాత

ఆర్టీసీ ఎన్ఎంయూ రాష్ట్ర కార్యదర్శి సుజాత మాట్లాడుతూ ప్రభుత్వంలో విలీనం చేసినా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు తీరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పీఆర్సీ ఇస్తారని ఆర్టీసీ ఉద్యోగులంతా ఆశించారని.. తమకు మంచి స్థానం ఇస్తారని వేయికళ్లతో ఎదురు చూశామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఐఆర్‌ ఇస్తారని ఆశించామని.. కానీ 19 శాతం తేడా ఉందన్నారు. ఆర్టీసీలో నాలుగేళ్లకోసారి వేతన సవరణ ఉండేదని.. ఇప్పుడు పదేళ్లకోసారి అనడంతో ఆర్టీసీ ఉద్యోగులంతా అవాక్కయ్యారని సుజాత చెప్పారు. ఉద్యోగుల సమ్మెలో ఆర్టీసీ సిబ్బంది కూడా పాల్గొని రవాణా వ్యవస్థను స్తంభింపజేస్తామన్నారు. ఉద్యోగుల పోరాటానికి ఆర్టీసీ సిబ్బంది నుంచి వందశాతం మద్దతు ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.

ఉద్యోగులకు కహానీలు చెబితే కుదరదు: ఎన్జీవో సంఘం నేత విద్యాసాగర్‌

కరోనా పరిస్థితుల సమయంలోనూ తెలంగాణ కంటే ఏపీకి ఆదాయం ఎక్కువగా వచ్చిందని.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తక్కువ ఆదాయమంటూ ప్రచారం చేస్తోందని ఎన్జీవో సంఘం నేత విద్యాసాగర్‌ ఆరోపించారు. ఉద్యోగులకు కహానీలు చెబితే కుదరదని ఆయన వ్యాఖ్యానించారు. సోషల్‌ మీడియాలో ఉద్యోగులకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంపై సాంకేతిక నిపుణులను ఏర్పాటు చేసి దాన్ని తిప్పికొడతామన్నారు. వెంటనే ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలని కోరారు.

ప్రభుత్వ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి: ఏపీటీఎఫ్‌ నేత పాండురంగ ప్రసాద్‌

ఉద్యోగులు సమ్మె చేసినా ఏ రాష్ట్రంలోనూ ఆయా ప్రభుత్వాలు ఎన్నికల్లో గెలవలేదని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర నేత పాండురంగ ప్రసాద్‌ అన్నారు. ఉద్యోగుల సమస్యలు తీరాలంటే నవరత్నాల్లో ఓ పథకాన్ని ఆపేయాలని సీఎం అంటున్నారని.. ప్రభుత్వం చేస్తోన్న అసత్య ప్రచారాన్ని అందరూ తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.  ఏ ప్రభుత్వమూ తమకు ఉత్తినే పీఆర్సీలు ఇవ్వలేదని.. పోరాడి సాధించుకున్నామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వారంలోపు సీపీఎస్‌ను రద్దు చేస్తానని చెప్పిన సీఎం.. ఇప్పటి వరకు మాట్లాడలేదని ఆక్షేపించారు. ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తామంటే ఉద్యోగులు ఊరుకోరని హెచ్చరించారు. ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. జాతీయ స్థాయిలో రైతుల పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఉద్యోగులు పోరాడాలని పిలుపునిచ్చారు. నల్లజీవోలను వెనక్కి తీసుకునే వరకు ఉద్యోగులంతా కలసికట్టుగా పోరాడాలన్నారు.

చావు ఖర్చుల్లోనూ మిగుల్చుకోవాలనుకుంటున్నారు: పెన్షనర్ల సంఘం నేత విష్ణువర్ధన్‌

ఉద్యోగుల చావు ఖర్చుల్లోనూ ప్రభుత్వం మిగుల్చుకోవాలని చూస్తోందని పెన్షనర్ల సంఘం నేత విష్ణువర్ధన్‌ ఆరోపించారు. పెన్షనర్లు 70 ఏళ్లకు 10 శాతం.. 75 ఏళ్లకు 15 శాతం పింఛన్‌ ఎప్పటి నుంచో తీసుకుంటున్నారని.. ప్రభుత్వం పీఆర్సీలో వీటన్నింటినీ తీసివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. డెత్‌ రిలీఫ్‌ ఒక నెల జీతం ఇస్తుండగా రూ.20వేలకు పరిమితం చేసిందని ఆక్షేపించారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలు దుర్మార్గమని మండిపడ్డారు. ఉద్యోగుల ఉద్యమానికి పెన్షనర్ల సంఘం తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు.
 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని