Ap News: అందరి లక్ష్యం ఒకటే.. కలిసి పోరాడితేనే సాధిస్తాం: సూర్యనారాయణ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోల వ్యవహారంలో అన్ని ఉద్యోగ సంఘాలు ఐక్యంగా ఉండాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.సూర్యనారాయణ

Updated : 19 Jan 2022 13:06 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోల వ్యవహారంలో అన్ని ఉద్యోగ సంఘాలు ఐక్యంగా ఉండాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.సూర్యనారాయణ అన్నారు. అందరి లక్ష్యం ఒకటే అయినందున కలిసి పోరాడితేనే లక్ష్యాన్ని సాధించగలమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంతానికి పోకుండా జీవోలపై పునఃసమీక్ష చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ సంఘాల పేర్లు వేరైనప్పటికీ వారంతా ఉద్యోగులేనని స్పష్టం చేశారు. అసుతోష్ మిశ్రా కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోవాలి తప్ప అధికారుల కమిటీ సిఫార్సులు కాదని చెప్పారు. చట్ట ప్రకారం ఉన్న వేతనాలను తగ్గించేందుకు అవకాశం లేనప్పుడు.. పీఆర్సీ జీవోలు ఇచ్చి వేతనాలు ఎలా తగ్గిస్తారని ప్రశ్నించారు. హెచ్‌ఆర్‌ఏ తగ్గించిన ప్రభుత్వం మండల స్థాయిలో రూ. 1,600కు ఒక గది ఎక్కడైనా అద్దెకు ఇప్పిస్తారా? అని నిలదీశారు. ఈ అంశంపై కొందరు మంత్రులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడకూడదని సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులంతా ఒక నిర్ణయానికి రావాలని.. అన్ని ఉద్యోగ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడతామని సూర్యనారాయణ వెల్లడించారు.

సీఎం జగన్‌ చొరవ తీసుకోవాలి: వెంకట్రామిరెడ్డి

‘‘ఉద్యోగులంతా చర్చించుకొని ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. హెచ్‌ఆర్‌ఏపై చర్చించకుండా నిర్ణయం తీసుకోవడం బాధాకరం. కేంద్ర పీఆర్సీ కంటే నష్టం జరిగేలా ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే జీవోలను వెనక్కి తీసుకోవాలి. ఉద్యోగుల ఆలోచనలకు అనుగుణంగా.. ఉద్యోగుల అభిప్రాయాలను తీసుకొని కొత్త జీవోలు ఇవ్వాలి. ఏకపక్షంగా ఇచ్చిన జీవోలను రద్దు చేసుకోవాలి. ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా సీఎం జగన్‌ చొరవ తీసుకోవాలి’’ అని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.

పీఆర్సీ జీవోలపై ఉద్యోగులు వరుసగా నిరసనలకు దిగుతున్నారు. అన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వ్యతిరేకిస్తున్నాయి. ఇవాళ్టి నుంచి నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరుకావాలని వారు నిర్ణయించారు. ఏపీజేఏసీ, ఏపీజేఏసీ అమరావతి, సచివాలయ ఉద్యోగుల సంఘాల ఉద్యోగుల నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్నారు. జీవోల వ్యవహారంపై ఇవాళ ఉద్యోగ సంఘాలు అంతర్గత సమావేశం నిర్వహించి ఉద్యమ కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని