logo

గురుకులాల్లో హాజరు.. అరకొర

సంక్రాంతి సెలవుల అనంతరం రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు సోమవారం పునః ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 2,026 మంది ఆయా గురుకులాలకు వచ్చారు. 2021-22 విద్యా ఏడాదిలో 18 గురుకులాల్లో మొత్తం 9,176 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు.

Updated : 18 Jan 2022 06:03 IST


వినుకొండ గురుకులంలో విద్యార్థులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తున్న సిబ్బంది

గుంటూరు, న్యూస్‌టుడే సంక్రాంతి సెలవుల అనంతరం రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు సోమవారం పునః ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 2,026 మంది ఆయా గురుకులాలకు వచ్చారు. 2021-22 విద్యా ఏడాదిలో 18 గురుకులాల్లో మొత్తం 9,176 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. సంక్రాంతి సెలవుల అనంతరం గురుకులాల్లో తరగతులకు హాజరైన వారి సంఖ్య తక్కువగా ఉండటం గమనార్హం. ఒమిక్రాన్‌ కేసులు విస్తరిస్తుండటంతో పిల్లల్ని గురుకులాలకు పంపేందుకు తల్లిదండ్రులు ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదు. దీనికి తోడు ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులను పొడిగిస్తుందనే ప్రచారం జరగడంతో వేచి చూసే ధోరణిలో పలువురు తల్లిదండ్రులు ఉన్నారు. ఆయా గురుకులాల ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను తరగతులకు తీసుకురావాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకురావడం లేదు. కొవిడ్‌ మూడో దశలో ఒమిక్రాన్‌ కేసులు ఎక్కువ నమోదు అవుతుండడంతో భయాందోళన చెందుతున్నారు. దీంతో ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినపుడే విద్యార్థులను పిలిపించాలనే భావనలో ఉన్నారు. సోమవారం సాయంత్రం 5 గంటల తర్వాత కూడా కొందరు గురుకులాలకు వస్తున్నారని సిబ్బంది తెలిపారు. గురుకులాల్లో భౌతిక దూరం పాటించేలా చూడడం, మాస్కులు పెట్టుకోవడం, శానిటేషన్‌ రాసుకునేలా చూడడం ఉపాధ్యాయులకు సవాల్‌గా మారింది. చిన్న తరగతుల విద్యార్థులకు కరోనా గురించి అవగాహన లేకపోవడంతో కొవిడ్‌ నిబంధనలు పాటించని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో తరగతి గదుల్లో పాఠ్యాంశాలు బోధించడం.. స్టడీ అవర్స్‌లో జాగ్రత్తలు తీసుకోవడం సమస్యగా మారింది. ఎక్కడ కొవిడ్‌ బారిన పడాల్సి వస్తుందేమోనని భయపడుతున్నారు. కొవిడ్‌-1, 2 దశల్లో కొందరు ఉపాధ్యాయులు తీవ్ర సమస్యలు ఎదుర్కొని ఉండటమే వారి భయానికి కారణంగా మారింది. 

విద్యాలయాల వారీగా..
కారంపూడిలో 429 మంది విద్యార్థులకు 33 మంది విద్యార్థులు హాజరయ్యారు. రామకృష్ణాపురం 651-70, అచ్చంపేటలో 537-142, చుండూరులో 449-65, వి.పి.సౌత్‌లో 737-33, బాపట్లలో 647-131, వినుకొండలో 473-418, నిజాంపట్నంలో 430-29, రేపల్లెలో 614-22, ఉప్పలపాడులో 621-100, అమరావతిలో 777-201, కాకుమానులో 406-118, తాడికొండలో 373-88, గురజాలలో 413-125, సత్తెనపల్లిలో 369-45, అడవితక్కెళ్లపాడులో 665-146, యడ్లపాడులో 365-181, నరసాయపాలెంలో 220 మందికి 79 మంది విద్యార్థులు హాజరయ్యారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని