logo

ఏడు గంటలు నరకం

 నాతవలస వద్ద జరిగిన ఘటన కలచివేసింది. ప్రమాద సమయంలో బస్సులో చిన్నారులు, వృద్ధులు కలిపి మరో 41 మంది ఉన్నారు. వీరంతా బయటకు రాలేక.. బిక్కుబిక్కుమంటూ ఏడు గంటల పాటు అందులోనే ఉండాల్సి వచ్చింది. తెల్లవారింది.. ఏ ఒక్కరైనా వచ్చి తమను బయటకు తీస్తారేమోనని

Updated : 22 Jan 2022 05:56 IST

ఆగిన లారీని ఢీకొన్న యాత్రికుల బస్సు

అందులోనే వృద్ధులు, పిల్లలు

9 మందికి గాయాలు


నాతవలస టోల్‌గేట్‌ వద్ద ప్రమాదానికి గురైన బస్సు

భోగాపురం, న్యూస్‌టుడే నాతవలస వద్ద జరిగిన ఘటన కలచివేసింది. ప్రమాద సమయంలో బస్సులో చిన్నారులు, వృద్ధులు కలిపి మరో 41 మంది ఉన్నారు. వీరంతా బయటకు రాలేక.. బిక్కుబిక్కుమంటూ ఏడు గంటల పాటు అందులోనే ఉండాల్సి వచ్చింది. తెల్లవారింది.. ఏ ఒక్కరైనా వచ్చి తమను బయటకు తీస్తారేమోనని ఆశతో ఎదురు చూశారు. ఉదయం 7, 8, 9 గంటలు అవుతున్నా.. ఏ ఒక్కరూ కన్నెత్తి చూడలేదు. ఈ విషయం తెలుసుకున్న ఈనాడు-ఈటీవీ బృందం అక్కడకు చేరుకుంది. అప్పటికే సమయం 11 కావస్తోంది. చిన్న పిల్లలు కిటికీల్లోంచి కిందకు దిగి దగ్గర్లో ఉన్న దుకాణానికి వెళ్లి బిస్కెట్లు తెచ్చి వారి కుటుంబ సభ్యులకు ఇచ్చిన పరిస్థితి కనిపించింది.


బాధితులకు శీతల పానీయాలు, బిస్కెట్లు అందిస్తున్న పోలీసులు

సమయం: శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలు

ఏం జరిగింది: డెంకాడ మండలం నాతవలస జాతీయ రహదారిపై ప్రమాదం.

ఎలా: మహారాష్ట్ర నుంచి తిరుపతి వెళ్తున్న యాత్రికుల బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.

ఏమైంది: ఈ ఘటనలో బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయింది. తొమ్మిది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. తలుపు లాక్‌ కావడంతో వారితో పాటు మిగిలిన వారు బయటకు రాలేకపోయారు. ఏడు గంటల పాటు అందులోనే ఉండిపోయారు. కొందరు వృద్ధులు బస్సులోనే కాలకృత్యాలు తీర్చుకోవాల్సి వచ్చింది.

‘ఈనాడు-ఈటీవీ’ చొరవతో స్పందించిన ఎస్పీ

విషయాన్ని ‘ఈనాడు-ఈటీవీ’ బృందం ఎస్పీ దీపిక ఎం.పాటిల్‌కు చరవాణిలో తెలపగా ఆమె వెంటనే స్పందించారు. 15 నిమిషాల్లో సంఘటనా స్థలానికి మూడు హైవే మొబైల్‌ వాహనాలతో పాటు పూసపాటిరేగ, డెంకాడ మండలాల ఎస్సైలు సిబ్బందితో వచ్చారు. సమీప టోల్‌గేట్‌ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. బస్సులో యాత్రికులు పడుతున్న ఇబ్బందులు చూసి చలించిపోయారు. ఎస్సై పద్మావతి సూచనలతో కానిస్టేబుల్‌ త్రినాథ్‌ బస్సు అత్యవసర ద్వారాన్ని తెరచి ఒక్కొక్కరిని కిందకు దింపారు. వారికి అప్పటికే తీసుకొచ్చిన శీతల పానీయాలు, బిస్కెట్లు అందించారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేశామని, వీరంతా మహారాష్ట్రకు చెందిన వారన్నారు. వీరు పూరీ, కోల్‌కతా చూసి రామేశ్వరం, తిరుమల దర్శనానికి వెళ్తున్నట్లు తెలిపారు. యాత్రికులను సురక్షితంగా తీసుకెళ్లేందుకు వాహనం మాట్లాడుతున్నామని చెప్పారు. క్షతగాత్రులను 108 వాహనంలో జిల్లా కేంద్రాసుపత్రికి తరలించామన్నారు.


లోపల నానాయాతన పడుతున్న ప్రయాణికులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని