logo

గురువులకు కరోనా బెంగ

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల్లో రోజుకు 40 నుంచి 50మంది వరకు కరోనా బారినపడుతున్నారు. కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో గత రెండు రోజుల్లోనే 91మంది ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. 

Updated : 23 Jan 2022 05:08 IST

గత రెండు రోజుల్లో 91 మందికి పాజిటివ్‌

విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలోనే 40మంది

ఈనాడు, అమరావతి

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల్లో రోజుకు 40 నుంచి 50మంది వరకు కరోనా బారినపడుతున్నారు. కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో గత రెండు రోజుల్లోనే 91మంది ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. శుక్రవారం 49, శనిఆరం 42మంది వైరస్‌ బారినపడ్డారు. విజయవాడ నగరపాలక సంస్థ పాఠశాలల్లోనే ఇప్పటివరకు 40మంది ఉపాధ్యాయులు వైరస్‌ బారినపడ్డారు. ప్రైవేటు పాఠశాలల్లో కూడా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. విజయవాడ నగరంలోని పాఠశాలల్లో ప్రతిరోజు పాజిటివ్‌ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. వీటికి సంబంధించిన అధికారిక లెక్కలు బయటకు రావడం లేదు. గత ఆరు రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో అధికారికంగా 171 పాటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో 152 మంది ఉపాధ్యాయులే ఉన్నారు. 19మంది మాత్రమే విద్యార్థులున్నారు. ఉపాధ్యాయులు పరీక్షలు ఎక్కువగా చేయించుకుంటుండడంతో వారికి పాజిటివ్‌లు బయటపడుతున్నాయి. విజయవాడ నగరంలో పాజిటివ్‌ వచ్చిన పాఠశాలల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే పరిస్థితి ప్రస్తుతం లేదు. పాజిటివ్‌ వస్తే పాఠశాలకు ఒక రోజు సెలవు ఇచ్చి వదిలేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో సెలవులు కూడా ఇవ్వడం లేదు. పాజిటివ్‌ వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులను ఇంటికి పంపించేసి.. తరగతులను కొనసాగిస్తున్నారు. దీనివల్లే నగరంలోని కొన్ని పాఠశాలల్లో ఒకేసారి ఎక్కువ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదువుతున్నాయి.

తరగతి గదుల్లో కిక్కిరిసిపోయి..

విజయవాడ నగరపాలక సంస్థ పాఠశాలల్లో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు వస్తున్నా.. ఇప్పటికీ నిబంధనలు మాత్రం పాటించడం లేదు. ఒకే బెంచీపై ముగ్గురు నుంచి నలుగురు విద్యార్థులను కూర్చోబెడుతున్నారు. ఎక్కడా భౌతికదూరం పాటించడం లేదు. విజయవాడలో 105 నగర పాలక సంస్థ పాఠశాలలుండగా.. 750మంది ఉపాధ్యాయులున్నారు. వీరిలో 40మందికి పైగా ఇప్పటికే వైరస్‌ బారినపడ్డారు. వీరంతా ప్రస్తుతం ఇళ్ల వద్ద హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. దీంతో మిగిలిన ఉపాధ్యాయులే అన్ని తరగతులను చూసుకుంటున్నారు.

పరిమితంగానే నిర్థరణ పరీక్షలు..

ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో కరోనా నిర్థరణ పరీక్షలను ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4వరకు నిర్వహిస్తున్నట్టు అధికారులు ప్రకటిస్తున్నప్పటికి వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. విజయవాడ నగరంలోని ప్రకాష్‌నగర్‌, సింగ్‌నగర్‌, కృష్ణలంక, పటమటలోని అంబేద్కర్‌నగర్‌ సహా పలు కేంద్రాల్లో ఉదయం వేళ మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం నుంచి ఆపేస్తున్నారు. మధ్యాహ్నం నుంచి ఎవరైనా వచ్చినా.. మరుసటి రోజు రమ్మంటూ పంపేస్తున్నారు. దీంతో వాళ్లంతా ప్రైవేటు ల్యాబ్‌లకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు. విజయవాడలోని తుమ్మలపల్లిలో గత రెండు రోజులుగా పరీక్షలను ఆపేశారు. వచ్చినవాళ్లు వచ్చినట్టే వెనక్కి తిరిగి వెళ్లిపోతున్నారు. విజయవాడ నగరంలోని ప్రైవేటు ల్యాబ్‌లలో భారీసంఖ్యలో కొవిడ్‌ నిర్థరణ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఒక్కో ల్యాబ్‌లో రోజుకు కనీసం వంద నుంచి వెయ్యి వరకు చేస్తున్నారు. కొన్ని ప్రముఖ ల్యాబ్‌లలో రోజుకు రెండు వేల వరకు పరీక్షలు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని