logo

విధినే ఎదిరించే.. విజయ శిఖరమే తలవంచే!

ఒకప్పుడు కటిక పేదరికం. తినడానికి తిండి లేక ఇబ్బందులు పడిన రోజులెన్నో. కానీ, ఇప్పుడు మేఘాలయ రాష్ట్రంలో ఉన్నత హోదాలో ఉన్నారు. అట్టడుగు నుంచి అత్యున్నత స్థాయికి చేరిన జి. హరిప్రసాదరాజు జీవన ప్రస్థానంలో ప్రతి మలుపూ ఆసక్తికరమే.

Updated : 23 Jan 2022 05:11 IST

వెంటాడిన పేదరికం

అయినా.. సివిల్స్‌ సాధనే ధ్యేయంగా కృషి

మేఘాలయ అదనపు డీజీపీ జి.హెచ్‌.పి.రాజు ప్రస్థానం

ఈనాడు, విశాఖపట్నం

ఒకప్పుడు కటిక పేదరికం. తినడానికి తిండి లేక ఇబ్బందులు పడిన రోజులెన్నో. కానీ, ఇప్పుడు మేఘాలయ రాష్ట్రంలో ఉన్నత హోదాలో ఉన్నారు. అట్టడుగు నుంచి అత్యున్నత స్థాయికి చేరిన జి. హరిప్రసాదరాజు జీవన ప్రస్థానంలో ప్రతి మలుపూ ఆసక్తికరమే. అవేంటో.. విశాఖ వచ్చిన ఆయన మాటల్లోనే.

కారణం 1...

నాకు చదువులో బొటాబొటీ మార్కులే వచ్చేవి. ఇంటర్‌లో ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించా. ఆ రోజుల్లో బీఎస్సీలో సీటురావడం కూడా కష్టమైంది.

నేను పెద్దగా చదవనని చాలా మంది హేళన చేసేవారు. ఓ మిత్రుడు సివిల్స్‌ వైపు దృష్టిపెడితే ఎలా ఉంటుందో చెప్పారో.. ఆ రోజే ఆ దిశగా నా ఆలోచన ఆరంభమయింది.

కారణం 2...

ఎన్నో కష్టాలు దాటుకొని డీఎస్పీగా ఎంపికైన తరువాత క్షేత్రస్థాయి శిక్షణ నిమిత్తం విజయవాడ వెళ్లా.

ఓ కార్యక్రమానికి వెళ్లిన సమయంలో ఒక ఉన్నతాధికారి నాతోపాటు వచ్చిన ఇద్దరు శిక్షణ ఐ.పి.ఎస్‌.లను భోజనానికి పిలిచారు. నన్ను మాత్రం పిలవలేదు.

నాకు తలకొట్టేసినట్లైంది. ఆ రోజే సివిల్స్‌లో ర్యాంకు సాధించాలన్న పట్టుదల మరింత పెరిగింది.

ఏడుగురు బిడ్డలం..

పశ్చిమగోదావరి జిల్లా తణుకు మా స్వస్థలం. నా తండ్రి జి.వి.రాజు విజయవాడలో సంస్కృతం బోధిస్తూ, వయోలిన్‌ వాయిస్తూ కుటుంబాన్ని పోషించేవారు. మా తల్లి తులశమ్మ గృహిణి.

* మేం ఏడుగురు పిల్లలం (నలుగురు ఆడ, ముగ్గురు మగ) కావడంతో డబ్బులకు తీవ్ర ఇబ్బందులు ఉండేవి. నాన్న సంపాదన ఏమాత్రం సరిపోయేదికాదు. చేదోడుగా ఉండాలని అమ్మ చిన్న చిల్లరకొట్టు నిర్వహించేవారు. ఆర్థికంగా కష్టాలున్నా చదువువిలువ చెప్పి ముందుకు నడిపారు. పెద్దన్నయ్య జి.ఎస్‌.పి.రాజు ఎంబీబీఎస్‌, చిన్న అన్నయ్య జి.ఎస్‌.రాజు బీటెక్‌లో చేరడంతో..ఇంటర్‌లో నామీద తీవ్రమైన ఒత్తిడి ఉండేది. నేనేమో సగటు విద్యార్థిని.

విశాఖలో ట్యూషన్లు చెప్ఫా.

ఉద్యోగం వద్దనుకున్న తరువాత విశాఖలోనే ట్యూషన్లు చెబుతూ వచ్చే కొద్దిపాటి మొత్తంతో గడిపాను. అదే సమయంలో సివిల్స్‌కు సిద్ధమయ్యా. 1988లో తొలి ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లినా విజయం సాధించలేకపోయా. తీవ్ర నిరాశ ఆవహించింది. ఆ మరుసటి సంవత్సరం ఏపీపీఎస్సీ పరీక్షలో డీఎస్పీ ఉద్యోగాన్ని సాధించా. అప్పటికే ఒక ఉద్యోగం వదిలేసిన నన్ను.. ఇందులో చేరాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారు. ఇదీ కీలకమైనదే కావడంతో చేరా.

ఉద్యోగాన్ని కాదనుకున్నా..
పీజీ పూర్తికాగానే ప్రభుత్వ ‘అటామిక్‌ మినరల్స్‌’ డివిజన్‌లో ఉద్యోగమిస్తామని పిలిచి.. ఇంటర్వ్యూలో నా లక్ష్యం ఏమిటని అడగ్గా... సివిల్స్‌కు సాధన చేస్తున్నానని చెప్ఫా ‘ఉద్యోగం తప్పకుండా ఇస్తాం. కానీ, సివిల్స్‌ సాధనకు అవకాశం ఉండదు. క్యాంపులకు వెళ్లాల్సి ఉంటుంది. నీ లక్ష్యాన్ని మరచిపోవాలి. ఆలోచించుకుని చెప్పు’ అన్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నాకు ఆ ఉద్యోగం చాలా అవసరం. కానీ సివిల్స్‌ లక్ష్యం గుర్తొచ్చి ఉద్యోగం వద్దని చెప్ఫా

అలా సీటొచ్చింది...

ఇంటర్‌ తరువాత చాలా కాలేజీలకు దరఖాస్తు చేశా. గుంటూరు హిందూ కళాశాలలో బీఎస్సీ జియాలజీలో సీటు వచ్చింది. అప్పట్లో ఆ కోర్సు కొత్తగా పెట్టారు. సీట్లు మిగిలి నాకు అవకాశం వచ్చింది. ఆ రోజుల్లో నా మిత్రుడు మన్నవ నాగేశ్వరరావు సివిల్స్‌లో ర్యాంకు సాధిస్తే జీవితానికి తిరుగుండదని చెప్పేవారు. డిగ్రీలో సీటు రావడమే కష్టమైన నాకు సివిల్స్‌ గురించి ఆలోచించడం అతిశయోక్తిగా అనిపించింది. కానీ, నన్ను హేళన చేసిన వారికి నేనేంటో నిరూపించాలన్న పట్టుదల పెరిగింది. డిగ్రీలో 80.8 శాతం మార్కులు సాధించా.
అలా.. ఏయూలో...

డిగ్రీ తరువాత ఏయూ జియాలజీ విభాగంలో ఎమ్మెస్సీ (టెక్‌) పూర్తి చేశా. అత్యుత్తమ మార్కులతో బంగారుపతకం కూడా సాధించా. పెద్దన్నయ్య ఎండీ, చిన్నన్నయ్య ఎంటెక్‌ చేస్తూ వారికి వచ్చే ఉపకారవేతనం నుంచి కొంత నాకు పంపేవారు. మిత్రులు కూడా ఆర్థిక సాయం చేస్తుండేవారు. అలా ఆర్థికంగా అండగా నిలిచారు.

అస్వస్థత నేపథ్యంలో..

డీఎస్పీగా శిక్షణ పొందుతున్న సమయంలో అస్వస్థతకు గురయ్యా. ఇంటి వద్దే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో సివిల్స్‌కు సాధన చేశా. జాతీయస్థాయిలో 65వ ర్యాంకు వచ్చింది. ఐ.ఎ.ఎస్‌. వచ్చే అవకాశం ఉన్నా ఐ.పి.ఎస్‌.నే ఎంచుకున్నా. అసోం, మేఘాలయ కేడర్‌ వచ్చింది. 1993 బ్యాచ్‌ ఐ.పి.ఎస్‌.గా వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించి, పదోన్నతులు పొంది ప్రస్తుతం అదనపు డీజీ హోదాలో ఉన్నా. ప్రజలకు మరింతగా సేవ చేయాలన్న ఉద్దేశంతో మా రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమతితో డిప్యుటేషన్‌పై పశుసంవర్థక, కార్మిక, సహకారశాఖల ముఖ్యకార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నా. నా భార్య అనిత స్వస్థలం విశాఖే. నా కుటుంబసభ్యులతోపాటు ఆమె ఇచ్చిన సహకారం మరువలేను.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు