Teachers: ఉపాధ్యాయులు ఆలస్యంగా వచ్చారని నిరసన

పీఆర్సీ విషయంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని అసభ్యకర పాటలతో దూషించి ఎద్దేవా చేసిన ఉపాధ్యాయులను వెంటనే విధుల్లోంచి తప్పించాలని గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం పెదమక్కెన ఎంపీటీసీ సభ్యురాలు వేంపాటి విజయకుమారి (వైకాపా),

Updated : 25 Jan 2022 03:41 IST

స్కూలు గేటు వేసిన వైకాపా ఎంపీటీసీ సభ్యురాలు, వాలంటీర్లు

సత్తెనపల్లి గ్రామీణం, గుంటూరు విద్య, న్యూస్‌టుడే: పీఆర్సీ విషయంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని అసభ్యకర పాటలతో దూషించి ఎద్దేవా చేసిన ఉపాధ్యాయులను వెంటనే విధుల్లోంచి తప్పించాలని గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం పెదమక్కెన ఎంపీటీసీ సభ్యురాలు వేంపాటి విజయకుమారి (వైకాపా), ఆమె భర్త కోటిరెడ్డి డిమాండ్‌ చేశారు. గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాల ముందు సోమవారం పాఠశాల కమిటీ ఛైర్మన్‌ సానికొమ్ము సుధాకర్‌రెడ్డి, గ్రామ వాలంటీర్లతో కలిసి నిరసన తెలిపారు. ఉదయం ఏడుగురు టీచర్లు ఆలస్యంగా రాగా, అప్పటికే పాఠశాల ప్రధాన ద్వారానికి తాళం వేసి బైఠాయించారు. ‘సమయపాలన పాటించని, నూరుశాతం ఫలితాలు సాధించని, ప్రైవేటు పాఠశాలలకు పిల్లల్ని పంపే ఉపాధ్యాయులు మాకొద్దు. లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు పాడి నృత్యాలు చేసేవారు మాకొద్దు’ అంటూ నినదించారు. అరగంట పాటు ముగ్గురు ఉపాధ్యాయులు ప్రధాన ద్వారం బయటే ఉండిపోయారు. ఎమ్మెల్యే అంబటి రాంబాబు నాయకులతో ఫోన్లో మాట్లాడటంతో నిరసన విరమించారు. ఆనక, తాళం తీయడంతో తరగతులు ప్రారంభమయ్యాయి.

ఉపాధ్యాయులకు తాఖీదులు: సకాలంలో విధులకు హాజరు కాకపోవడం, గ్రామస్థులు నిరసన తెలపడంపై గుంటూరు డీఈవో గంగాభవాని స్పందించారు. ఆలస్యానికి కారణాలేంటో మూడు రోజుల్లో వివరణ తెలపాలని ఏగుగురు టీచర్లకు తాఖీదులు జారీచేశారు. పీఆర్సీపై ఉద్యమిస్తున్న ఉపాధ్యాయులను ఇలా ఆలస్యం నెపంతో అధికార పార్టీ వారు అడ్డుకోవడం తగదని ఏపీటీఎఫ్‌, యూటీఎఫ్‌ నాయకులు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని