Kodali Nani: చర్యకు ప్రతిచర్య ఉంటుంది

‘తెదేపా కార్యాలయంలో కొంతమందిని కూర్చోబెట్టి, ఆడవాళ్లతో చంద్రబాబు నన్ను, ముఖ్యమంత్రి జగన్‌ను తిట్టిస్తున్నారు. వారితో తిట్టించడాన్ని చంద్రబాబు ఆపితే నేనూ ఆయన్ను తిట్టడం ఆపుతా. లేదంటే చర్యకు ప్రతిచర్య ఉంటుంద’ని మంత్రి కొడాలి నాని అన్నారు.

Updated : 25 Jan 2022 03:40 IST

చంద్రబాబు బృందానిది నాపై దుష్ప్రచారం
మంత్రి కొడాలి నాని

ఈనాడు, అమరావతి: ‘తెదేపా కార్యాలయంలో కొంతమందిని కూర్చోబెట్టి, ఆడవాళ్లతో చంద్రబాబు నన్ను, ముఖ్యమంత్రి జగన్‌ను తిట్టిస్తున్నారు. వారితో తిట్టించడాన్ని చంద్రబాబు ఆపితే నేనూ ఆయన్ను తిట్టడం ఆపుతా. లేదంటే చర్యకు ప్రతిచర్య ఉంటుంద’ని మంత్రి కొడాలి నాని అన్నారు. సోమవారం ఆయన ముఖ్యమంత్రి జగన్‌ను క్యాంపు కార్యాలయంలో కలిశారు. తర్వాత అక్కడే విలేకరులతో మాట్లాడారు. ‘నా మంత్రి పదవిని తీయించేయాలని, ముఖ్యమంత్రి నన్ను రాష్ట్రం నుంచి తరిమికొట్టేలా చేయాలని నాపై చంద్రబాబు, ఆయన మనుషులు క్యాసినో నిర్వహించానంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. నిరూపిస్తే పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని సవాల్‌ చేశాను. ఆరోజు నుంచి చంద్రబాబు, ఆయన బృందం మాటమార్చారు. కె.కన్వెన్షన్‌లో కాదు, దానికి సమీపంలో అని ఓసారి, గుడివాడలో అని మరోసారి అంటున్నారు. కరోనా సోకి, జనవరి 6 నుంచి 16వరకు నేను హైదరబాద్‌లో ఉంటే, ఇక్కడ ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేశారు. గుడివాడలో క్యాసినో ఉంది, రావచ్చంటూ తెదేపా వెబ్‌సైట్‌లో వారి మనుషులే పెట్టారు. దాన్ని పట్టుకుని మళ్లీ వాళ్లే ఇలా ప్రచారం చేస్తున్నారు. నిజనిర్ధారణ కమిటీ అంటూ తన మనుషులను చంద్రబాబు గుడివాడకు పంపార’ని నాని విమర్శించారు. తెదేపా నేత బుద్దా వెంకన్నను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై అడగ్గా ‘మంత్రి కొడాలి నానిని హత్య చేస్తా, డీజీపీ రెండేళ్లలో పదవీ విరమణ తర్వాత ఎక్కడికి వెళ్తావ్‌? అని మాట్లాడితే పోలీసులు కచ్చితంగా కేసులు పెట్టి శిక్షిస్తారు. మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలి’ అని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని