
యాప్‌లో పరిచయం.. ఆపై దోపిడీ
పోలీసుల అదుపులో నిందుతుడు
తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: ఓ యాప్ ద్వారా పరిచయం చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్న వ్యక్తిని పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇన్‌ఛార్జి సీఐ వీరా రవికుమార్ ఆ వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు గ్రామానికి చెందిన పిట్టు రాము గ్రిండర్ గే అనే సోషల్ మీడియా యాప్ ద్వారా పరిచయం చేసుకుని, వారిని లాడ్జీకి రమ్మని దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇదే క్రమంలో తాడేపల్లిగూడెంకు చెందిన బోనం సత్యనారాయణను స్థానిక జగదాంబ లాడ్డీకి రమ్మని రాము పిలిచాడు. మద్యంలో మత్తు మందు కలిపి సత్యనారాయణను స్పృహ కోల్పోయేలా చేశాడు. అనంతరం అతని వద్ద నుంచి రెండు కాసుల బంగారు గొలుసు, చరవాణి దొంగిలించాడు. ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు శేషమహల్ రోడ్డులో ఉన్న రామును అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి మూడు కాసుల బంగారం, రెండు చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తిపై చేబ్రోలు స్టేషన్‌లో కూడా కేసులు ఉన్నాయని సీఐ పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.