logo

‘పోలీస్‌ అధికారులు వేధింపులకు పాల్పడ్డారు’

కృష్ణలంకలో మంగళవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఏఆర్‌ హోంగార్డు తిమ్మసత్తి వెంకటేశ్వరరావు(40).. ఇందుకు కొంతమంది పోలీస్‌ అధికారుల

Updated : 26 Jan 2022 04:44 IST

వెలుగులోకి వచ్చిన హోంగార్డు సెల్ఫీ వీడియో

సెల్పీ వీడియోలో వెంకటేశ్వరరావు

కృష్ణలంక, న్యూస్‌టుడే: కృష్ణలంకలో మంగళవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఏఆర్‌ హోంగార్డు తిమ్మసత్తి వెంకటేశ్వరరావు(40).. ఇందుకు కొంతమంది పోలీస్‌ అధికారుల వేధింపులే కారణమని ఆరోపిస్తూ చేసిన సెల్ఫీ వీడియో ఆలస్యంగా బయటపడింది. తన హెచ్‌జీ నంబరు 766గా పేర్కొన్న వెంకటేశ్వరరావు 2021 ఆగస్టులో హోంగార్డుగా విధుల్లో చేరి మొదట ఎస్సీ, ఎస్టీ సెల్‌ విభాగంలో పని చేసినట్లు తెలిపారు. నెల రోజులకు కిందపడి తలకు ఎనిమిది కుట్లుపడడంతో సెలవు పెట్టాల్సి వచ్చిందని.. అనంతరం హోంగార్డు కార్యాలయానికి వెళ్లి విధుల గురించి ఆర్‌ఐను అడగ్గా గతంలో తాను పనిచేసిన విభాగం కాకుండా వేరొక చోటుకు పంపనున్నట్లు చెప్పగా.. ఏదైనా లా అండ్‌ ఆర్డర్‌ విభాగానికి కేటాయించాల్సిందిగా తాను కోరినట్లు చెప్పారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన ఓ ఎస్‌ఐ టాస్క్‌ఫోర్స్‌లో ఖాళీ ఉన్నందున అక్కడకు పంపించాల్సిందిగా ఆర్‌ఐకు సూచించడంతో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ టాస్క్‌ఫోర్స్‌కు వెళ్లనని అడ్డం తిరగడంతో వెళ్లాల్సిందేనంటూ పట్టుబట్టిన ఎస్‌ఐ నెల రోజుల తరువాత అక్కడి నుంచి లా అండ్‌ ఆర్డర్‌కు మార్చనున్నట్లు హామీనివ్వడంతో కాదనలేక చేరినట్లు వెల్లడించారు. టాస్క్‌ ఫోర్స్‌ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు తాను నిలుచునే ఉండాల్సి వచ్చేదని.. మధ్యాహ్నం భోజనానికి వెళతానంటే ఆఫీసును వదిలి ఎక్కడకు వెళతావని వేధించే వారని.. స్టేషన్‌లో ఒక్కరు కూడా ఉండని కారణంగా తాను ఉండాల్సి వచ్చేదన్నారు. 24 గంటలు డ్యూటీ.. 24 గంటలు రెస్ట్‌ అయినప్పటికీ అర్ధరాత్రి రాత్రి ఒంటి గంటకు విధులు ముంగించుకుని బ్లేడ్‌ బ్యాచ్‌ టీం వచ్చిన తరువాతే తనకు నిద్రించడం సాధ్యమయ్యేదన్నారు. నేలపై నిద్రించాల్సి రావడంతో ఎలుకలు, దోమల బెడద అధికంగా ఉండేదని దాని వల్ల తాను రెండు పర్యాయాలు టైఫాయిడ్‌ బారిన పడినట్లు చెప్పారు. టాస్క్‌ ఫోర్స్‌ విభాగంలో పనిచేసిన ముగ్గురు పోలీసుల అధికారులు వేధింపులకు పాల్పడినట్లు వెంకటేశ్వరరావు ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని