చెరువులో దూకిన గంజాయి స్మగ్లర్లు

గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు సినీ ఫక్కీలో వెంబడించి పట్టుకున్నారు. చివరికి తప్పించుకునేందుకు చెరువులో దూకిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం 8.30 గంటలకు విశాఖ

Updated : 26 Jan 2022 05:33 IST

పోలీసులు వెంటాడటంతో తప్పించుకునే యత్నం

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు సినీ ఫక్కీలో వెంబడించి పట్టుకున్నారు. చివరికి తప్పించుకునేందుకు చెరువులో దూకిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం 8.30 గంటలకు విశాఖ జిల్లా కొయ్యూరు మండలం డౌనూరు చెక్‌పోస్టు వద్ద విధుల్లో ఉన్న సిబ్బంది చింతపల్లి నుంచి వస్తున్న కారును ఆపేందుకు ప్రయత్నించారు. డ్రైవరు కారును ఆపకుండా వేగంగా నర్సీపట్నం వైపు పోనిచ్చాడు. వెంటనే చెక్‌పోస్టు సిబ్బంది నర్సీపట్నం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ట్రాఫిక్‌ ఎస్సై దివాకర్‌ సిబ్బందిని అప్రమత్తం చేశారు. అబీద్‌ కూడలిలో స్టాపర్‌ బోర్డును రోడ్డుకు అడ్డుగా పెట్టారు. కారును ఆపేందుకు పోలీసులు ప్రయత్నించగా... ఓ బైకును ఢీకొట్టి వెళ్లిపోయింది. శ్రీకన్య కూడలిలో రోడ్డుకు అడ్డుగా స్టాపరు బోర్డులను ఉంచినా.. వాటితో పాటు ఓ ఆటోను కారు ఢీకొట్టి వేగంగా దూసుకెళ్లింది. ఎస్సై దివాకర్‌, కానిస్టేబుళ్లతో కలిసి బైకుపై కారును వెంబడించారు. పెదబొడ్డేపల్లి మదుం దాటిన తర్వాత నివాస ప్రాంతంలోకి కారును మళ్లించారు. ఆ వెంటనే కారులో నుంచి దూకి పరిగెత్తారు. పోలీసులు వెంబడించడంతో ముగ్గురు యువకులు చెరువులోకి దూకేశారు. లొంగిపోవాలని పోలీసులు హెచ్చరించడంతో కొద్దిసేపటి తర్వాత ఇద్దరు యువకులు చెరువులో నుంచి ఈదుకుంటూ బయటకు వచ్చారు. కొత్తవీధి సమీపంలో మరో యువకుడిని గుర్తించి.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కారుతో పాటు 240 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని