ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు నిరాకరిస్తే మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేయాలి

ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు పోలీసులు నిరాకరిస్తే సీఆర్‌పీసీ సెక్షన్‌ 200 కింద సంబంధిత మెజిస్ట్రేట్‌ ముందు ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేసుకోవాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం

Updated : 06 Feb 2022 05:44 IST

అధికరణం 226 కింద రిట్‌ సరికాదు: హైకోర్టు ధర్మాసనం

ఈనాడు, అమరావతి: ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు పోలీసులు నిరాకరిస్తే సీఆర్‌పీసీ సెక్షన్‌ 200 కింద సంబంధిత మెజిస్ట్రేట్‌ ముందు ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేసుకోవాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అధికరణ 226కింద హైకోర్టులో రిట్‌ వేయడానికి వీల్లేదని పేర్కొంది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోతే రిట్‌ దాఖలుకు వీల్లేదంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఇటీవల ఈమేరకు ఉత్తర్వులిచ్చింది. తమ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం లేదని పలువురు హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. వీటిపై విచారించిన సింగిల్‌ జడ్జి.. కాగ్నిజబుల్‌ నేరాల విషయంలో ఫిర్యాదు అందితే ఎఫ్‌ఐఆర్‌ నమోదు తప్పనిసరని పేర్కొన్నారు. ఒకవేళ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోతే మెజిస్ట్రేట్‌ వద్ద ఫిర్యాదుకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని వివరించారు. హైకోర్టుకంటే మెజిస్ట్రేట్‌ కోర్టును ఆశ్రయించడం మరింత ప్రయోజనకరమైన ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకొని వ్యాజ్యాలను తోసిపుచ్చారు. తన వ్యాజ్యాన్ని కొట్టేయడాన్ని సవాలు చేస్తూ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎం.నాగమణి.. ధర్మాసనం ముందు అప్పీల్‌ చేశారు. వాదనలు విన్న ధర్మాసనం సింగిల్‌జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమంటూ అప్పీల్‌ను కొట్టివేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని