logo

ఉక్కు మగువదే పైచేయి..!

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో పని చేసే మహిళా అధికారుల్లో ఆలోచన విధానం, మేథస్సు మరింత అభివృద్ధి చెందే దిశగా ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌(ఎయిమా) ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో వివిధ పోటీలు నిర్వహిస్తుంటారు. గతేడాది నిర్వహించిన పోటీల్లో విశాఖ ఉక్కు ఉద్యోగినిలు ప్రథమస్థానంలో నిలిచి శెభాష్‌

Updated : 20 May 2022 06:11 IST

జాతీయస్థాయి పోటీల్లో సత్తా
న్యూస్‌టుడే, ఉక్కునగరం(గాజువాక)

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో పని చేసే మహిళా అధికారుల్లో ఆలోచన విధానం, మేథస్సు మరింత అభివృద్ధి చెందే దిశగా ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌(ఎయిమా) ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో వివిధ పోటీలు నిర్వహిస్తుంటారు. గతేడాది నిర్వహించిన పోటీల్లో విశాఖ ఉక్కు ఉద్యోగినిలు ప్రథమస్థానంలో నిలిచి శెభాష్‌ అనిపించుకున్నారు. ఈ ఏడాది పోటీల్లో ద్వితీయస్థానంలో నిలిచారు.

2021 ప్రథమస్థానం విజేతలను అభినందిస్తున్న ఉక్కు డైరెక్టర్‌ డి.కె.మొహంతి(పాతచిత్రం)

* 2019లో బొకారో స్టీల్‌ప్లాంట్‌ బృందం జాతీయస్థాయిలో ఛాంపియన్‌గా నిలవగా, 2021లో విశాఖ ఉక్కు కర్మాగారం బృందం విజేతగా నిలిచింది. ఇప్పుడు 2022లో విశాఖ ఉక్కు మహిళలు ద్వితీయస్థానంలో నిలిచారు.


2022 ద్వితీయస్థానంలో నిలిచిన ఉద్యోగులను అభినందిస్తూ..

* 2022 జరిగిన పోటీల్లో ఉక్కు స్పెషల్‌ బార్‌ మిల్‌లో డిప్యూటీ మేనేజర్‌(మెకానికల్‌) గా పని చేస్తున్న ప్రియాంక పాల్‌, ఈఆర్‌ఎస్‌ విభాగంలో డిప్యూటీ మేనేజర్‌(ఎలక్ట్రికల్‌)గా పని చేస్తున్న శ్వేతమొహంతి జట్టుగా పాల్గొని రన్నరప్‌గా నిలిచారు.


దేశంలో వివిధ సంస్థల మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌లో పని చేసే మహిళల్లో వినూత్న ఆలోచనలు, విశేషమైన పరిజ్ఞానం, నూతన ఆలోచనలు రేకెత్తించేలా పోటీల నిర్వహణ ఉంటుంది.

* కోర్‌ మేనేజ్‌మెంట్‌ సమస్యలపై మహిళా ఉద్యోగుల అవగాహన స్థాయి అంచనా వేయడం, సమీక్షించడం మేనేజ్‌మెంట్‌లో కొత్త విధానాల అమలు, నూతన పరిణామాలు తదితర అంశాలపై క్విజ్‌ నిర్వహిస్తారు. జనరల్‌ మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌, ప్రకటనలు, మానవ వనరుల వినియోగం, ఆర్థికం, వ్యాపారం, ప్రముఖ వ్యక్తులు-హోదాపై ప్రశ్నలు ఉంటాయి.
* తొలుత ప్రాంతీయ స్థాయిలో పోటీలు నిర్వహించి, విజేతలకు దిల్లీలో జాతీయస్థాయిలో నిర్వహించే తుది పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. ఏటా దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగ పరిశ్రమల నుంచి దాదాపు 110 బృందాలు పాల్గొంటున్నాయి.
* 2021 డిసెంబర్‌ 16న ఆన్‌లైన్‌లో జరిగిన పోటీల్లో ఉక్కు ఎస్‌ఎంఎస్‌-2లో మేనేజర్‌(మెకానికల్‌) కె.సుమాంజలి, క్యూఏటీడీ విభాగంలో సీనియర్‌ మేనేజర్‌ హన్సిక హోతియల్‌ జట్టుగా పాల్గొని విజేతలుగా నిలిచారు. వారిని అప్పట్లో ఉక్కు డైరెక్టర్‌(కమర్షియల్‌), డైరెక్టర్‌(పర్సనల్‌) అదనపు ఇంఛార్జి డికే.మొహంతి అభినందించారు.
కృషి తగిన ఫలితం
-కె.సుమాంజలి

జాతీయస్థాయి క్విజ్‌లో పాల్గొనేందుకు నాలుగేళ్లుగా కృషి చేస్తున్నాం. గత పోటీల్లో అడిగిన ప్రశ్నలు, పోటీదారులు ఎదుర్కొన్న సవాళ్లను పరిశీలించి... పోటీలకు సిద్ధమయ్యాం. నాలుగేళ్లలో మూడుసార్లు ప్రాంతీయ స్థాయి వరకు వెళ్లినా... ఎట్టకేలకు గతేడాది విజేతలుగా నిలిచాం.
ఎంతో ఆనందంగా ఉంది..
-ప్రియాంక పాల్‌

పోటీల్లో పాల్గొనేందుకు రెండేళ్లుగా కృషి చేస్తున్నా. ప్రాంతీయ స్థాయి దాటి జాతీయ పోటీలకు అర్హత సాధించాం. నిత్యం రెండు నుంచి మూడు గంటల పాటు సాధన చేశా. దేశంలో మహిళలు సాధించిన విజయాలు, రాజకీయ, వ్యాపార ప్రస్థానాలు, సాహిత్యం, నృత్యం, తదితర రంగాల్లో మహిళల ప్రతిభకు సంబంధించిన అంశాలపై పట్టు సాధించాం. క్విజ్‌లో పోటీపడి ద్వితీయస్థానం సాధించడం ఆనందంగా ఉంది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని