logo

ఆ శివలింగం 12వ శతాబ్దానిది

పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే అప్రోచ్‌ ఛానల్‌ తవ్వకాల్లో బుధవారం బయటపడిన శివలింగం 12వ శతాబ్దానికి చెందినదిగా గుర్తించినట్లు కాకినాడ పురావస్తు శాఖ సహాయ సంచాలకుడు కె.తిమ్మరాజు పేర్కొన్నారు. తహశీల్దార్‌ సుమతితో కలిసి గురువారం ఆయన శివలింగాన్ని పరిశీలించారు.

Updated : 20 May 2022 06:12 IST

పురావస్తు శాఖ సహాయ సంచాలకుడు తిమ్మరాజు


  తహశీల్దార్‌తో కలిసి శివలింగాన్ని పరిశీలిస్తున్న తిమ్మరాజు తదితరులు

పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే అప్రోచ్‌ ఛానల్‌ తవ్వకాల్లో బుధవారం బయటపడిన శివలింగం 12వ శతాబ్దానికి చెందినదిగా గుర్తించినట్లు కాకినాడ పురావస్తు శాఖ సహాయ సంచాలకుడు కె.తిమ్మరాజు పేర్కొన్నారు. తహశీల్దార్‌ సుమతితో కలిసి గురువారం ఆయన శివలింగాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ పట్టిసీమ ఆలయంలోని శివలింగం, ఇప్పుడు బయటపడింది ఒకే విధంగా ఉన్నాయన్నారు. చాళుక్యుల పాలన కాలంలో గోదావరి వెంబడి శివాలయాలు నిర్మించి ఉంటారని తెలిపారు. 1996 నుంచి 2002 వరకు ప్రాజెక్టు ముంపు మండలాల్లో పురావస్తు శాఖ విస్తృత సర్వే చేసిందన్నారు.  అందులో భాగంగా పోలవరం మండలం పాత పైడిపాక సమీపంలో జరిపిన తవ్వకాల్లో రెండో శతాబ్దం నాటి ఇటుకలు, దేవాలయాల ఆనవాళ్లు, అవశేషాలు గుర్తించామని చెప్పారు. 375 ముంపు గ్రామాల్లో లభ్యమైన పురాతన విగ్రహాలు, అవశేషాలను భద్రపర్చేందుకు పోలవరం వద్ద మ్యూజియం ఏర్పాటుకు ఐదెకరాల స్థలం కేటాయించాలని జల వనరుల శాఖాధికారులను కోరినట్లు తెలిపారు. మ్యూజియంలో గిరిజనుల సంస్కృతికి సంబంధించిన వస్తువులతో పాటు ఆలయాలకు సంబంధించినవి భద్రపరుస్తామన్నారు. దీని నిర్మాణానికి రూ.40 - 50 కోట్లు ఖర్చవుతుందని, ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉందన్నారు. అప్రోచ్‌ ఛానల్‌లో శివలింగం దొరికిన ప్రాంతంలో మరింత లోతుగా తవ్వితే ఆలయానికి సంబంధించి మరిన్ని ఆధారాలు లభ్యమయ్యే అవకాశం ఉందని, ఈ విషయాన్ని కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం రాయనిపేట వద్ద తవ్వకాల్లో బయటపడిన ఆదిమానవుడి అవశేషాలను రాజమహేంద్రవరంలో, ఏలూరు జిల్లా రుద్రంకోట వద్ద లభ్యమైన పూసలు, మరికొన్ని వస్తువులను ఏలూరు మ్యూజియంలో భద్రపర్చామన్నారు. పోలవరం వద్ద మ్యూజియం నిర్మిస్తే వాటన్నిటిని ఇక్కడికి తరలిస్తామని వివరించారు. మండలంలోని తూటిగుంట, చీడూరు, శివగిరి వద్ద బయటపడిన శివలింగాల విషయమై ‘న్యూస్‌టుడే’ ప్రస్తావించగా వాటిని రాజమహేంద్రవరంలోని మ్యూజియానికి తరలిస్తామని తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని