logo

పారిశ్రామిక కేంద్రంగా తిరుపతి : మంత్రి అమర్నాథ్‌

తిరుపతి జిల్లాను పారిశ్రామిక హబ్‌గా అభివృద్ధి చేయాలన్నది ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పమని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ తెలిపారు.

Updated : 20 Jun 2022 06:33 IST

ఇలగనూరు వద్ద సీఎం భూమిపూజ చేయనున్న ప్రాంతాన్ని పరిశీలిస్తున్న మంత్రి, కలెక్టర్‌, ఎమ్మెల్యే

శ్రీకాళహస్తి, ఏర్పేడు, న్యూస్‌టుడే: తిరుపతి జిల్లాను పారిశ్రామిక హబ్‌గా అభివృద్ధి చేయాలన్నది ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పమని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ తెలిపారు. ఆదివారం శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న ఆయన.. ఈ నెల 23న శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలాల్లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్న  ప్రాంతాలను సందర్శించారు. మంత్రి మాట్లాడుతూ ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి చెందిన తిరుపతి జిల్లా రానున్న రోజుల్లో పారిశ్రామికంగా కూడా అభివృద్ధి కానుందని తెలిపారు. ఏర్పేడు మండలం టీసీఎల్‌ వద్ద వివిధ విభాగాల ప్రారంభోత్సవం, పరిశ్రమ ఏర్పాటుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. రూ.వెయ్యి కోట్లతో ఇక్కడి పరిశ్రమను అభివృద్ధి పరిచారని, తద్వారా పది వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశముందన్నారు. శ్రీకాళహస్తి మండలం ఇలగనూరు వద్ద 290 ఎకరాల్లో రూ.800 కోట్ల వ్యయంతో అపాచీ సంస్థ ఏర్పాటుకు ముఖ్యమంత్రి భూమిపూజ చేయనున్నట్లు వివరించారు. తిరుపతి జిల్లాలోని ఈఎంసీ క్లస్టర్ల పరిధిలో 700 ఎకరాలకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం, జిల్లా పాలనాధికారి వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వరరెడ్డి, జేసీ బాలాజీ, ఈఎంసీ సీఈవో గౌతమి, మంత్రి ఓఎస్‌డీ మధు, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజరు సోనసుహాన, డిప్యూటీ కలెక్టర్‌ శ్రీనివాసులు, అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని