Vijayawada: ఆప్యాయత కరవై.. ఆవేదన బరువై..

ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన ఆమెకు భర్త నుంచి తాను కోరుకున్న ఆప్యాయత దొరకలేదు. ఇద్దరు పిల్లలు పుట్టినా అతనిలో మార్పు రాలేదు. దీనిని భరించలేక గతంలో ఓసారి ఆత్మహత్యకు ప్రయత్నించింది. తృటిలో ప్రాణాపాయం తప్పింది.

Updated : 24 Jun 2022 09:37 IST

పిల్లలకు విషమిచ్చి, తానూ ఆత్మహత్య చేసుకున్న వివాహిత

కృష్ణలంక, న్యూస్‌టుడే: ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన ఆమెకు భర్త నుంచి తాను కోరుకున్న ఆప్యాయత దొరకలేదు. ఇద్దరు పిల్లలు పుట్టినా అతనిలో మార్పు రాలేదు. దీనిని భరించలేక గతంలో ఓసారి ఆత్మహత్యకు ప్రయత్నించింది. తృటిలో ప్రాణాపాయం తప్పింది. తీవ్ర మనస్తాపంతో జీవనం సాగిస్తున్న ఆ మహిళ ఇక తట్టుకోలేక పిల్లలకు విషమిచ్చి, తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. లారీడ్రైవర్‌గా పనిచేసే చలమలశెట్టి గోపాలకృష్ణకు పాయకాపురానికి చెందిన చందన లక్ష్మి(27)తో 2012లో వివాహమైంది. వారికి నాగమణికంఠ(9), జయహర్ష(7) ఇద్దరు పిల్లలు. ఈ కుటుంబం కృష్ణలంక గీతానగర్‌కరకట్ట సమీపంలో ఉంటున్నారు. లారీడ్రైవర్‌గా పనిచేసే గోపాలకృష్ణ నిరంతరం విధుల్లో ఉండడం, మద్యం తాగడం తప్ప భార్య, పిల్లల పట్ల పెద్దగా ఆసక్తిని ప్రదర్శించే వాడు కాదు. అతని ప్రవర్తనతో అసంతృప్తి చెందిన చందన లక్ష్మి సుమారు నాలుగేళ కిందట ఆత్మహత్యకు యత్నించింది. ఆసుపత్రిలో చేర్చగా ప్రాణాపాయం తప్పింది. భర్త ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో పాటు, బంధువుల నుంచి కూడా ఓదార్పు లభించకపోవడం ఆమె ఒంటరితనానికి లోనై మనస్తాపం చెందింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం పిల్లలతో పుట్టింటికి వెళ్లిన చందనలక్ష్మి మధ్యాహ్నం 2గంటలకు ఇంటికి తిరిగొచ్చింది. వెంట తెచ్చుకున్న ద్రాక్ష జ్యూస్‌లో మొక్కల పెంపకానికి వాడే గుళికల మందును కలిపి ముందు తాను తాగి, అనంతరం పిల్లలతో తాగించింది. రాత్రి 10.30 గంటల సమయంలో ఇంటికి చేరుకున్న భర్త తలుపుకొట్టగా ఎంతసేపటికి తీయకపోవడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వారి సాయంతో పగలగొట్టి లోపలకు వెళ్లాడు. బెడ్‌రూమ్‌లోని మంచంపై భార్యా, పిల్లలు నోట్లోంచి నురుగ కారుతున్న స్థితిలో కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించాడు. వారు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించి, ముగ్గురూ మృతిచెందినట్లుగా నిర్ధారించారు. చందనలక్ష్మి రాసిన లేఖ,  గుళికలమందు ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. వివాహిత మనస్తాపానికి లోనై మృతి చెందినట్లుగా ప్రాథ]మికంగా నిర్ధారించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ ఎంవీ దుర్గారావు తెలిపారు.

నాగమణికంఠ, జయహర్ష (పాతచిత్రం)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని