logo

కార్డులో బ్యాలెన్స్‌ ఉంటే కరెంట్‌!

ప్రతి నెలా చరవాణికి రీఛార్జి చేసుకున్నట్లు.. డిష్‌ టీవీకి ఏ  నెలకానెల డబ్బులు వేసుకుంటున్నట్లు.. విద్యుత్తు ఛార్జీల చెల్లింపునకూ ‘రీఛార్జి‘ విధానం రానుంది. కార్డులో బ్యాలెన్స్‌ ఉన్నంత వరకే విద్యుత్తు సరఫరా అవుతుంది. బ్యాలెన్స్‌ అయిపోతే సరఫరా

Updated : 27 Jun 2022 05:47 IST

ప్రభుత్వ కార్యాలయాలకూ విద్యుత్తు ప్రీపెయిడ్‌ మీటర్లు

మొబైల్‌ రీఛార్జి తరహాలో చెల్లింపు

గంటస్తంభం, న్యూస్‌టుడే: ప్రతి నెలా చరవాణికి రీఛార్జి చేసుకున్నట్లు.. డిష్‌ టీవీకి ఏ  నెలకానెల డబ్బులు వేసుకుంటున్నట్లు.. విద్యుత్తు ఛార్జీల చెల్లింపునకూ ‘రీఛార్జి‘ విధానం రానుంది. కార్డులో బ్యాలెన్స్‌ ఉన్నంత వరకే విద్యుత్తు సరఫరా అవుతుంది. బ్యాలెన్స్‌ అయిపోతే సరఫరా నిలిచిపోతుంది. ఇందుకు ప్రీపెయిడ్‌ మీటర్లను బిగించేందుకు ఏపీఈపీడీసీఎల్‌ అధికారులు సిద్ధమవుతున్నారు. తొలుత ప్రభుత్వ కార్యాలయాలకు ఈ తరహా మీటర్లను అమర్చనున్నారు.

ఉమ్మడి జిల్లాలో గుర్తించిన 11 వేల సర్వీసులకు సంబంధించిన ప్రక్రియ టెండర్ల దశలో ఉంది. ఇది పూర్తవ్వగానే ఒకట్రెండు నెలల్లో ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు ప్రీపెయిడ్‌ మీటర్లను బిగించే యోచనలో ఉన్నారు. మీటర్లకు రూ.82.39 కోట్లు అవసరం అవుతుందని అధికారులు అంచనా వేశారు.  కేంద్ర ప్రభుత్వం ఆర్‌డీఎస్‌ఎస్‌ (రీవంపెడ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌ స్ట్రెంథనింగ్‌ నెట్‌వర్క్‌ ప్రపోజెడ్‌) పథకం కింద నిధులు వెచ్చించనున్నారు.

రూ.కోట్లలో బకాయిలు: జిల్లాలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ ప్రభుత్వ సంస్థలు విద్యుత్తు బకాయిలు చెల్లించడం లేదు. అత్యధికంగా పంచాయతీలు, రెవెన్యూ, సాంఘిక సంక్షేమం, పోలీస్‌ శాఖ ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు నోటీసులిస్తున్నా ఫలితం ఉండటం లేదు. ప్రీపెయిడ్‌ మీటర్లు వస్తే ఈ కష్టాలకు చెల్లుచీటీ పడుతుందని భావిస్తున్నారు.


ఉమ్మడి జిల్లాల్లో గుర్తించిన సర్వీసులు: 11 వేలు

మీటర్ల ఏర్పాటుకు ఎంత అవసరం: రూ.82.39 కోట్లు

ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్తు వాడకం: 31 లక్షల యూనిట్లు

కార్యాలయాలు చెల్లించాల్సిన బకాయిలు: రూ.1.86కోట్లు

వివిధ ప్రభుత్వ సంస్థలు చెల్లించాల్సినవి: రూ. 42 కోట్లు


దుబారా నివారణతో పాటు.. బకాయిలకు చెక్‌: ప్రభుత్వ కార్యాలయాల్లో దుబారా అధికంగా ఉంది. అధికారులు, సిబ్బంది సీట్లలో ఉన్నా, లేకపోయినా పంకాలు, లైట్లు, ఏసీలు వినియోగమవుతూనే ఉన్నాయి. వినియోగించిన విద్యుత్తుకు సంబంధించిన బిల్లుల్ని కూడా ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు సకాలంలో చెల్లించడం లేదు. బకాయిలు విద్యుత్తు సంస్థకు పెద్ద గుదిబండలా మారాయి. ఈ పరిస్థితుల్లో విద్యుత్తు దుబారా, బకాయిలకు చెక్‌ పెట్టేందుకు ప్రీపెయిడ్‌ మీటర్లు ఉపయుక్తంగా ఉంటాయని సంస్థ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న వాటి స్థానంలో స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్లను విద్యుత్తు శాఖ ఏర్పాటు చేయనుంది. వీటికి రీఛార్జి నచ్చిన విధంగా చేసుకోవచ్చు. గంటలు, నెలలు, ఏడాదికి.. ఎలా కావాలంటే ఆ విధంగా రీఛార్జి చేసుకునే వీలుంది. స్మార్ట్‌ మీటరు ఖరీదు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు ఉంటుందని ఆ శాఖాధికారులు చెబుతున్నారు.


త్వరలోనే అమలు

ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్‌ మీటర్లు బిగించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. టెండర్లు పిలుస్తున్నాం. ఇది పూర్తవ్వగానే ఒకట్రెండు నెలల్లో ఈ విధానం వినియోగంలోకి వస్తుంది. ఎంత మేర రీఛార్జి చేసుకుంటే ఆ మేరకు విద్యుత్తు సరఫరా అవుతుంది. దీనివల్ల బకాయిల బెడద తగ్గుతుంది.

- పి.నాగేశ్వరరావు, పర్యవేక్షక ఇంజినీరు, ఈపీడీసీఎల్‌


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని