logo

మూడేళ్లు.. మహా ప్రాజెక్టులేవీ?

రాష్ట్రంలోనే కీలకమైన విశాఖ నగరంపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వినవస్తున్నాయి. మహా విశాఖ నగరపాలక సంస్థ నుంచి వచ్చే ఆదాయాన్ని తీసుకోవడమే తప్ప తిరిగి నగరానికి నిధులు కేటాయింపులు చేయకపోవడం సమస్యగా

Updated : 27 Jun 2022 09:58 IST

ప్రతిపాదనలతోనే కాలం వెళ్లదీత


పైవంతెన ప్రతిపాదించిన హనుమంతువాక కూడలి

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలోనే కీలకమైన విశాఖ నగరంపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వినవస్తున్నాయి. మహా విశాఖ నగరపాలక సంస్థ నుంచి వచ్చే ఆదాయాన్ని తీసుకోవడమే తప్ప తిరిగి నగరానికి నిధులు కేటాయింపులు చేయకపోవడం సమస్యగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫలితంగా మూడేళ్లుగా విశాఖ నగరంలో అభివృద్ధి పనులు కానరావడంలేదు. సాధారణ పనులు చేయడానికి జీవీఎంసీˆ గుత్తేదారులు ముందుకు రావడం లేదు. పెద్ద ప్రాజెక్టులను నగరానికి తీసుకురావడంలో, ఇప్పటికే పరిశీలనలో ఉన్న ప్రాజెక్టులను ప్రారంభించడానికి జీవీఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టుదల ప్రదర్శించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

మూడేళ్లలో ఏమి సాధించారు..?

* 2007 నుంచి 2012 వరకు జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం (జవహర్‌లాల్‌ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ పథకం)లో భాగంగా చేపట్టిన శీఘ్ర బస్సు రవాణా వ్యవస్థ, పేదలకు ఇళ్లు, మంచినీటి ప్రాజెక్టులు, యూజీడీ, గెడ్డల ఆధునికీకరణ, కూడళ్ల అభివృద్ధి, పైవంతెన ప్రాజెక్టులు నగరానికి ఎంతో ఉపయోగపడ్డాయి. అనంతరం ఆకర్షణీయ నగరాల ప్రాజెక్టుకు విశాఖ ఎంపికైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయం రూ.1000 కోట్లతో పాటు, జీవీఎంసీˆ మరో రూ.2వేల కోట్ల భాగస్వామ్యంతో ఆయా పనులు చేపట్టింది. ఆయా ప్రాజెక్టులన్నీ మూడేళ్ల క్రితం ప్రారంభమయ్యాయి. ఆ తరువాత జీవీఎంసీ ఒక్క కొత్త ప్రాజెక్టును చేపట్టలేకపోయింది.

శీఘ్ర బస్సు రవాణా వ్యవస్థల అనుసంధానం, కొత్త ప్రాంతాలకు బీఆర్‌టీఎస్‌ విస్తరణ, కొండవాలు ప్రాంతాలకు మంచినీటి సరఫరా, గెడ్డల ఆధునికీకరణ వంటి ప్రధాన ప్రాజెక్టులపై దృష్టి కేంద్రీకరించకపోవడం గమనార్హం.


ఆస్తుల తనఖాతో పనులు...

పెందుర్తి, గాజువాకల్లో చేపట్టిన భూగర్భ మురుగునీటి వ్యవస్థ ప్రాజెక్టుల బిల్లులు చెల్లించడానికి జీవీఎంసీ ఆస్తులను తనఖా పెట్టాల్సిన పరిస్థితులు వచ్చాయి. గతంలో చేపట్టిన ప్రాజెక్టుల్లో కేంద్ర, రాష్ట్ర వాటాలతోపాటు, స్థానిక సంస్థలు 10శాతం నుంచి 20శాతం నిధులు సమకూర్చేవి. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. స్థానిక సంస్థలపైనే అధిక భారం వేస్తున్నారు. మరో పక్క ఆదాయం లాగేసుకుంటున్నారు. ఫలితంగా విశాఖలో అభివృద్ధి పడకేసిందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


పాతవీ కదలడం లేదు..

* ఏలేరు నుంచి నగరానికి మంచినీటిని తరలించడానికి ప్రతిపాదించిన రూ.3,106 కోట్ల పైపులైను ప్రాజెక్టుపై రెండు సార్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసినా నిధులు ఏ విధంగా సమకూర్చుకోవాలన్న అంశంపై ఎటూ తేల్చలేదు. దీంతో ప్రాజెక్టు పెండింగ్‌లోనే ఉంది. వర్షపాతం తక్కువగా నమోదైతే నగరంలో రెండు, మూడు రోజులకోసారి నీటిని సరఫరా చేసే పరిస్థితులు ఉన్నాయి.


* తీరం కోత నివారణ ప్రాజెక్టు కోసం 2014 నుంచి మహా విశాఖ నగరపాలక సంస్థ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. నీలం, పైలిన్‌, హుద్‌ హుద్‌ తుపానులు వచ్చినప్పుడు తీరం కోతకు గురైంది. దీంతో ప్రపంచబ్యాంకు నిధులు రూ.120 కోట్లతో తీరకోత నియంత్రణ పనులు చేపట్టాలని ప్రతిపాదించారు. ఆయా నిధుల కోసం ప్రయత్నాలు జరగడం లేదు.


* నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్‌ రద్దీ నియంత్రణకు నాలుగు పైవంతెనలు నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. రూ.600 కోట్ల వ్యయంతో కారుషెడ్డు, హనుమంతువాక, సత్యం కూడలి, గాజువాక ప్రాంతాలలో పైవంతెనలు నిర్మించడం ద్వారా రద్దీ తగ్గించడంతోపాటు ప్రమాదాలు నియంత్రించవచ్చని భావించారు. ఆయా ప్రతిపాదనలు ఇంకా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లోనే ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని