logo

‘బుసక’ మాయం

ప్రభుత్వ పరమైన నిర్మాణాలకు మండల స్థాయి అధికారుల అనుమతితో సమీప ప్రాంతాల నుంచి బుసక రవాణా తీసుకున్న అనుమతుల మాటున రోజూ పెద్ద మొత్తంలో నిబంధనలకు విరుద్ధంగా తరలిపోతోంది. అక్రమ రవాణా కారణంగా తలెత్తే ఇబ్బందులను భరించలేని స్థానికులు కృత్తివెన్ను, పెడన...

Updated : 27 Jun 2022 05:34 IST

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే

ప్రభుత్వ పరమైన నిర్మాణాలకు మండల స్థాయి అధికారుల అనుమతితో సమీప ప్రాంతాల నుంచి బుసక రవాణా తీసుకున్న అనుమతుల మాటున రోజూ పెద్ద మొత్తంలో నిబంధనలకు విరుద్ధంగా తరలిపోతోంది. అక్రమ రవాణా కారణంగా తలెత్తే ఇబ్బందులను భరించలేని స్థానికులు కృత్తివెన్ను, పెడన, మచిలీపట్నం, నడకుదురు, అవనిగడ్డ తదితర ఇసుక రవాణా చేసే వాహనాలను అడ్డగించడం, కొన్ని వాహనాలకు అధికారులు జరిమానా విధించడం వంటి ఉదంతాలున్నాయి. మచిలీపట్నం, పెడన పరిధిలో వాహనాలను అడ్డగించిన రెవెన్యూ సిబ్బందిపై దాడులకు సైతం వెనకాడని పరిస్థితిపై బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన సంఘటనలూ లేకపోలేదు. బందరు నియోజకవర్గ పరిధిలో మట్టి, బుసక రవాణా మొత్తం ముగ్గురు, నలుగురు వ్యక్తుల కనుసన్నల్లోనే నిర్వహిస్తున్నారు. సీఆర్‌జెడ్‌ పరిధితో పాటు దీర్ఘకాలంగా తీరప్రాంతానికి రక్షణగా ఉండే ఇసుక దిబ్బలను మటుమాయం చేసేశారు.

మైనింగ్‌ శాఖ పరిధిలోకి వచ్చే ఇసుక, మట్టి, బుసక తదితరాలను అధికారుల అనుమతి పర్యవేక్షణ లేకుండా తవ్వకాలు చేపట్టరాదనే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. నదీతీర ప్రాంతం, సీఆర్‌జెడ్‌ పరిధిలో తవ్వకాలు పూర్తిగా నిషిద్ధం.అయినా కొన్ని నెలలుగా సీఆర్‌జెడ్‌ పరిధిలోకి వచ్చే మచిలీపట్నం, కృత్తివెన్ను, కోడూరు, నాగాయలంక మండలాలతో పాటు పెడన, అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి, తదితర మండలాల్లో లక్షలాది క్యూసెక్కుల బుసక తరలిపోయింది. అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని నదీ తీరప్రాంతంలో స్థానికులు కలవరపడేలా అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలో కీలక నాయకునిగా చలామణి అవుతున్న ఓ నాయకుని పర్యవేక్షణలో నియోజకవర్గ వ్యాప్తంగా మట్టి మాఫియా చెలరేగిపోతుందన్న ఆరోపణలున్నాయి.చల్లపల్లి మండల పరిధిలోని ఏనుగులదిబ్బతో పాటు మచిలీపట్నం వెస్ట్‌, పోలాటితిప్ప, తపసిపూడి, కృత్తివెన్ను తదితర ప్రాంతాల్లోని ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణగా ఉండాల్సిన మెరకదిబ్బలను ఆనవాళ్లే లేకుండా చేసేశారు. కృతివెన్ను మండల పరిధిలోని సీఆర్‌జెడ్‌ భూముల్లో మట్టి తరలించి సొమ్ము చేసుకునే ప్రయత్నాలను స్థానికులు అడ్డుకున్నారు.

బుట్టదాఖలైన ఫిర్యాదులు

పెడన నియోజకవర్గ పరిధిలో కాల్వగట్టులతో పాటు గూడూరు మండలంలో జనావాసాల మధ్య, ఇతర ప్రాంతాల్లో చేపట్టిన అక్రమ తవ్వకాలపై స్థానికులు చేసిన ఫిర్యాదులు బుట్టదాఖలే అయ్యాయి. పెడన పైడమ్మ, పల్లోటి 1, 2 లేఔట్‌లకు సంబంధించి రూ.6 కోట్ల అంచానా వ్యయంతో చేపట్టిన పనుల్లో అవినీతితో పాటు మట్టి అక్రమ రవాణా చేశారన్న అభియోగాలున్నాయి. మెరక అవసరాలకు తగిన విధంగా మట్టి లభ్యత తగ్గిపోతుండంతో తాజాగా అక్రమార్కులు దృష్టి అసైన్డ్‌భూములపై పడింది. పట్టాదారులను చెరువుల లీజు పేరున తమదైన శైలిలో ఒప్పించి కొంత మట్టిని తరలించేస్తున్నారు. అధికారుల పర్యటనలకు సంబంధించిన సమాచారం ముందే తెలిసే ఏర్పాట్లు చేసుకుని వారు వచ్చే రోజు పనులు నిలిపివేస్తున్నారు. ఎవరైనా సొంత భూముల్లో మట్టిని తరలించుకోవాలన్నా అనుమతులు ఇవ్వనీయకుండా అడ్డుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా కోట్లాది రూపాయల ఆర్జన కల్పిస్తున్న మట్టి, బుసక అక్రమ వ్యాపారం బహిరంగ రహస్యమే అయినా నామమాత్రపు కేసులు కూడా లేకపోవడం గమనార్హం. ఇప్పటికైనా మట్టి మాఫియా దోపిడిని అరికట్టాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

అధికారులు ఏమంటున్నారంటే..

ఈ విషయమై అధికారులను ప్రశ్నిస్తే అభివృద్ధి పనులకు మాత్రమే అనుమతులు ఇస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా బుసక తరలిస్తున్న విషయం మా దృష్టికి రాలేదన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని