Viswarup: అమలాపురం ఆందోళనలో రౌడీషీటర్లు.. సంఘ విద్రోహశక్తులు: మంత్రి విశ్వరూప్

కోనసీమ ప్రాంతంలో గత 50 ఏళ్లలో ఏనాడూ ఇలాంటి ఘటనలు జరగలేదని మంత్రి పినిపే విశ్వరూప్‌ అన్నారు. అమలాపురంలో మంగళవారం

Updated : 25 May 2022 15:14 IST

అమలాపురం: కోనసీమ ప్రాంతంలో గత 50 ఏళ్లలో ఏనాడూ ఇలాంటి ఘటనలు జరగలేదని మంత్రి పినిపే విశ్వరూప్‌ అన్నారు. అమలాపురంలో మంగళవారం జరిగిన ఆందోళన విధ్వంసానికి దారి తీయడం.. మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లను ఆందోళనకారులను తగులబెట్టడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు తగులబెట్టిన తన ఇంటిని మంత్రి విశ్వరూప్‌ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘‘అమలాపురం ప్రజానీకం ఎప్పుడూ తప్పుడు ఆలోచనతో లేరు. మంగళవారం జరిగిన ఘటనలకు కోనసీమ సాధన సమితి బాధ్యత తీసుకోవాలి. శాంతియుతంగా జరుగుతున్న ఆందోళనలో కొన్ని సంఘ విద్రోహశక్తులు, కొంతమంది రౌడీషీటర్లు చేరి దశ, దిశ లేని ఉద్యమాన్ని పక్కదోవ పట్టించారు. నాతో పాటు, ఎమ్మెల్యే సతీశ్‌ ఇంటిని తగులబెట్టారు. గమ్యం లేని ఉద్యమాన్ని మా ఇళ్లవైపు మళ్లించారు. అక్కడికి సమీపంలోనే ఉన్న తెదేపా మాజీ ఎమ్మెల్యే ఆనందరావు ఇంటిపై ఎందుకు దాడి చేయలేదు? అమలాపురంలో జరిగిన ఘటనల వెనుక తెదేపా, జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారు. 

ప్రభుత్వం ముందు ‘కోనసీమ’ అనే నామకరణం చేసింది. జనసేన, భాజపా, తెదేపా.. అందరూ అంబేడ్కర్‌ పేరు పెట్టాలని కోరాయి. కోనసీమలోని దళిత సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరూ రోడ్లపైకి రావొద్దు..సంయమనం పాటించండి..రౌడీషీటర్ల ఉచ్చులో పడొద్దు’’ అని విశ్వరూప్‌ విజ్ఞప్తి చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు