Janasena: రేపల్లె సామూహిక అత్యాచారానికి ఏ తల్లి తప్పిదమో హోంమంత్రి చెప్పాలి?: నాదెండ్ల

రేపల్లె రైల్వే స్టేషన్‌లో మహిళా వలసకూలీపై సామూహిక అత్యాచార ఘటన అత్యంత బాధాకరమని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు.

Published : 02 May 2022 01:28 IST

అమరావతి: రేపల్లె రైల్వే స్టేషన్‌లో మహిళా వలసకూలీపై సామూహిక అత్యాచార ఘటన అత్యంత బాధాకరమని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. పొట్టకూటి కోసం వలస వచ్చిన కుటుంబానికి ఎదురైన ఈ దిగ్భ్రాంతికర ఘటన ఆంధ్రప్రదేశ్‌లో దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితిని తెలియజేస్తోందన్నారు. గత పది రోజులుగా రాష్ట్రంలో వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నా సీబీఐ దత్తపుత్రుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి స్పందించడం లేదని విమర్శించారు. బాధిత కుటుంబంపైనే నిందలు వేసి తప్పించుకోవాలని ప్రభుత్వం చూడటం గర్హనీయమని పేర్కొన్నారు.

‘‘తుమ్మపూడి ఘటనలో పోలీసు అధికారుల తీరు ఇలాగే ఉంది. రాష్ట్ర హోంశాఖా మంత్రి ప్రకటనలు కూడా ప్రభుత్వ వైఖరిని వెల్లడిస్తున్నాయి. ఇలాంటి ఘటనలకు తల్లులే కారణం, వాళ్లు సరిగా లేకపోవడమే కారణమని చెప్పడం విచిత్రంగా ఉంది. రేపల్లె సామూహిక అత్యాచారానికి ఏ తల్లి తప్పు ఉంది? విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాచారానికి ఏ తల్లి తప్పిదమో బాధ్యత కలిగిన రాష్ట్ర హోం మంత్రి స్పష్టం చేయాలి. విజయవాడ అత్యాచార ఘటనపై స్పందించిన తీరు చూశాక రాష్ట్ర హోం మంత్రి అవగాహనా రాహిత్యం వెల్లడైంది. హోం శాఖను, పోలీసులను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ఫలితమే రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకపోవడం. చిత్తశుద్ధి లేకుండా చట్టాలు చేసి... ప్రచారం చేసుకోవడం వల్ల ఏ ఒక్క ఆడబిడ్డకు భరోసా లభించదు. తాడేపల్లి నుంచి కదలని ముఖ్యమంత్రి.. ఒకసారి బయటకు వచ్చి బాధిత కుటుంబాలను పలకరిస్తే ఆడపిల్లల తల్లిదండ్రులలో ఉన్న భయాందోళనలు తెలుస్తాయి. రాష్ట్రంలోని కీచక పర్వాన్ని ఖండించే ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల వారిని కట్టడి చేసి అరెస్టులు చేయడం మాని మహిళల రక్షణపై చిత్తశుద్ధిగా పనిచేయండి. రేపల్లె ఘటనలో బాధితురాలు నాలుగు నెలల గర్భిణి అని తెలిసింది. ఆమె ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఉంచి మెరుగైన వైద్య సేవలు అందించాలి’’ అని నాదెండ్ల మనోహర్‌ ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని