AP New Districts: రాజంపేటలో భారీ ర్యాలీ.. హిందూపురంలో అఖిలపక్షం బంద్‌

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్న అన్నమయ్య జిల్లాకు కేంద్రంగా రాయచోటిని ప్రకటించడంపై

Updated : 29 Jan 2022 16:52 IST

రాజంపేట: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్న అన్నమయ్య జిల్లాకు కేంద్రంగా రాయచోటిని ప్రకటించడంపై రాజంపేటలో నిరసనల హోరు కొనసాగుతూనే ఉంది. ఇవాళ రాజంపేట ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి ఎన్టీఆర్‌ సర్కిల్‌ వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు భారీ ర్యాలీ చేపట్టారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్‌ చేశారు. పాత బస్టాండ్‌ వద్ద మానవహారం నిర్వహించిన విద్యార్థులు నినాదాలు చేశారు. వీరితో పాటు న్యాయవాదుల ర్యాలీ, నిరసన ప్రదర్శన చేపట్టారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని అన్నమయ్య జన్మస్థలం తాళ్లపాకలో ప్రజలు ఆందోళనకు దిగారు. ర్యాలీగా తరలివెళ్లి అన్నమయ్య విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. 

మరోవైపు హిందూపురం కేంద్రంగా జిల్లా ప్రకటించాలని అఖిలపక్షం బంద్‌కు పిలుపునిచ్చింది. స్థానిక బస్టాండ్‌లో అఖిలపక్ష నాయకులు బస్సులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో భజరంగ్‌దళ్‌ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశారు. ఒంటిపై పెట్రోల్‌ పొసుకొని నిప్పంటించుకునేందుకు యత్నించారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు.

మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించాలి

మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు,దర్శి, కనిగిరి నియోజవర్గాలను కలిపి జిల్లాగా చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా సాధన కోసం అన్ని పార్టీల నేతలు గళం విప్పాలని కోరుతూ.. ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు.
విజయవాడకు వంగవీటి రంగా పేరు : జనసేన
విజయవాడకు వంగవీటి రంగా పేరు పెట్టాలని జనసేన డిమాండ్‌ చేసింది. ఈ మేరకు గుడివాడలో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. వంగవీటి రంగా విగ్రహం వద్ద  పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని