PM Modi: అల్లూరి స్ఫూర్తితో ముందుకెళ్తే మనల్ని ఎవరూ ఆపలేరు: ప్రధాని మోదీ

యావత్‌ భారతావనికే మన్యం వీరుడు, తెలుగు జాతి యుగపురుషుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిదాయకమని 

Updated : 04 Jul 2022 15:00 IST

భీమవరం: యావత్‌ భారతావనికే మన్యం వీరుడు, తెలుగు జాతి యుగపురుషుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అల్లూరి జయంత్యుత్సవాల సందర్భంగా ఆయన పుట్టిన నేలపై మనమంతా కలుసుకోవడం అదృష్టమని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా పెద అమిరంలో 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రధాని పాల్గొన్నారు. 

భీమవరంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని పెద అమిరం వేదిక పైనుంచే వర్చువల్‌గా ఆయన ఆవిష్కరించారు. అనంతరం అల్లూరి కుటుంబసభ్యులను మోదీ సత్కరించారు. అల్లూరి శ్రీరామరాజుతో పాటు స్వాతంత్ర్యోద్యమ సమయంలో అల్లూరి సీతారామరాజుకి వెన్నంటే ఉన్న మల్లు దొర మనవడు బోడి దొరను ప్రధాని సన్మానించారు. ఆ తర్వాత స్వాతంత్ర్య సమరయోధులు పసల కృష్ణమూర్తి-అంజలక్ష్మి గార్ల కుమార్తె పసల కృష్ణభారతికి మోదీ పాదాభివందనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించిన మోదీ.. ‘తెలుగు వీర లేవరా.. దీక్షబూని సాగరా..’ అనే విప్లవ గీతాన్ని ప్రస్తావించారు.

ఆంధ్ర రాష్ట్రం పుణ్యభూమి.. వీరభూమి..

‘‘స్వాతంత్ర్య సాధనలో సమరయోధుల పోరాట పటిమ గురించి అందరికీ తెలియాలి. ఆ స్ఫూర్తి కోసమే ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలు జరుపుకొంటున్నాం. దేశ చరిత్రలో అనాదిగా ఒకే దేశం.. ఒకే భావన భాగమైంది. అల్లూరి జీవన ప్రస్థానం మనందరికీ స్ఫూర్తిదాయకం. మనదే రాజ్యం నినాదంతో ప్రజలకు ఒక్కతాటిపైకి తీసుకొచ్చారు. మన్యం వీరుడిగా ముందుకొచ్చి ఆంగ్లేయులతో వీరోచితంగా పోరాడారు. ఆంధ్ర రాష్ట్రం పుణ్యభూమి.. వీరభూమి. ఎందరో దేశభక్తులకు పురుడుపోసిన గడ్డ ఇది. పింగళి వెంకయ్య, కన్నెగంటి హనుమంతు, పొట్టి శ్రీరాములు, వీరేశలింగం పంతులు వంటి మహానుభావులు జన్మించిన గడ్డ ఆంధ్రప్రదేశ్‌. దేశం కోసం బలిదానం చేసిన స్వాతంత్ర్య సమరయోధుల కలలను సాకారం చేయాలి. పుణ్యభూమికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.

సమస్యలపై పోరాడేతత్వం అల్లూరి నుంచి నేర్చుకోవాలి

రంప ఆందోళన ప్రారంభించి నేటికి వందేళ్లు పూర్తయింది. మన్యం వీరుడి 125వ జయంత్యుత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉంది. యావత్‌ భారతదేశం తరఫున అల్లూరి పాదాలకు వందనం చేస్తున్నా. ఆదివాసీల శౌర్యం, ధైర్యానికి ప్రతీక ఆయన. అల్లూరి సీతారామరాజు కుటుంబసభ్యులతో వేదిక పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. అల్లూరి నడయాడిన అన్ని ప్రాంతాలను స్మరించుకుంటున్నాం. ఎందరో మహానుభావులు దేశం కోసం త్యాగం చేశారు. వారి త్యాగాలను నిరంతరం స్మరించుకుని ముందుకెళ్లాలి. దేశంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. సమస్యలపై పోరాడేతత్వం అల్లూరి నుంచి నేర్చుకోవాలి. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఆయన స్ఫూర్తితో ముందుకెళ్తే మనల్ని ఎవరూ ఆపలేరు. 

వెదురు కోత.. హక్కులు ఆదివాసీలకే..

గడిచిన 8 ఏళ్లలో అనేక కార్యక్రమాలు చేపట్టాం. యువకులు, మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నాం. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నాం. ఆదివాసీల బలిదానాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉంది. వారి వీరోచిత పోరాటాలు, త్యాగాలు భావితరాలకు తెలియజేయాలి. ‘స్కిల్‌ ఇండియా’ కింద యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. మన ఉత్పత్తులు అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లేలా దృష్టి సారించాలి. అటవీ ప్రాంతం పెరుగుతున్నందున వెదురు కోతకు అవకాశం కల్పించాం. వాటిపై ఆదివాసీలకే హక్కు కల్పించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించాం. వెనుకబడిన జిల్లాల అభివృద్ధిలో భాగంగా మన్యం జిల్లాలు అభివృద్ధి చేస్తున్నాం. అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. మాతృభాషలో విద్య కోసం 750 ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటయ్యాయి. అల్లూరి మెమోరియల్‌ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నాం’’ అని మోదీ చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని