Andhra news: వైకాపా నాయకులు రాష్ట్ర ఖజానాను దోచేశారు: అయ్యన్న పాత్రుడు

జగన్  మూడేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా దివాలా తీసిందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు ఆరోపించారు.

Published : 27 Mar 2022 15:18 IST

విశాఖపట్నం: జగన్  మూడేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా దివాలా తీసిందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. మద్యం అమ్మగా వచ్చే ఆదాయంతో రాష్ట్రాన్ని పాలిస్తామని స్వయంగా సీఎం జగన్‌ అసెంబ్లీలో అనడం సిగ్గు చేటని ఆయన అన్నారు. విశాఖ తెదేపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవుల కోసం శాసనసభ్యులంతా అసెంబ్లీలో జగన్‌ భజనలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ఖజానాలోని డబ్బులు కూడా దోచేశారని, రూ.48 వేల కోట్లకు సంబంధించిన లెక్కలు లేవని కాగ్‌ నివేదికలో చెప్పినట్లు అయ్యన్న గుర్తు చేశారు. ఇంత జరుగుతున్నా కేంద్రం ఎందుకు చూస్తూ ఊరుకుంటోందని ప్రశ్నించారు.

కాగ్‌ నివేదికలో పేర్కొన్న రూ.48వేల కోట్ల పైన సీబీఐ విచారణ వేయాలని అయ్యన్న డిమాండ్‌ చేశారు. దాదాపు రూ.7లక్షల కోట్లు అప్పు చేశారని, ఆ సొమ్మును ఎవరు తీరుస్తారని ప్రశ్నించారు. కల్తీ మద్యం తాగి చనిపోయినవారి కుటుంబీకులు ఏడవడంలేదని,  సీఎం జగన్‌ అనడం ఆయన అవివేకానికి నిదర్శనమని దుయ్యబట్టారు. ఇంకా వైకాపా ప్రభుత్వానికి రెండేళ్ల సమయముందని, ఇప్పటికైనా కళ్లు తెరవాలని హితవు పలికారు. ఈనెల 29 నాటికి తెదేపా ఆవిర్భవించి 40 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. విజయవాడలో వచ్చే నెల 3న మహానాడు నిర్వహిస్తున్నట్లు అయ్యన్న తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని