
CM Jagan: కృష్ణా బ్యారేజ్‌ల నిర్మాణంపై దృష్టిపెట్టాలి: జగన్
అమరావతి: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జలవనరులశాఖపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టుపై సమీక్షించిన సీఎం.. కేంద్రం ఇవ్వాల్సిన నిధులు వెంటనే వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రం చేస్తున్న ఖర్చు ఎప్పటికప్పుడు రీయంబర్స్ అయ్యేలా చూడాలన్నారు. కాఫర్‌డ్యాం పనులు పూర్తి చేసి వచ్చే ఖరీఫ్ నాటికి నీళ్లిస్తామని అధికారులు సీఎంకు వివరించారు. నెల్లూరు బ్యారేజీ పనులు పూర్తయ్యాయని, నవంబర్‌లో ప్రారంభానికి సిద్ధమని అధికారులు తెలిపారు. వచ్చే ఆగస్టు నాటికి అవుకు టన్నెల్ పూర్తి చేసి నీరందిస్తామని వివరించారు. అవుకు టన్నెల్ పనులు వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ పనుల్లో వేగం పెంచాలని సూచించారు.
వంశధార స్టేజ్-2 రెండో దశ పనులు మే నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. నిర్దేశిత సమయానికి ప్రాజెక్టును అందుబాటులోకి తేవాలని సీఎం అన్నారు. ఒడిశాతో చర్చల కోసం తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. తోటపల్లి కింద వచ్చే ఖరీఫ్ నాటికి పూర్తి స్థాయిలో నీరివ్వాలని సూచించారు. మహేంద్రతనయ పనులను ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేయాలన్నారు. తుఫాను, వర్షాల వల్ల దెబ్బతిన్న సాగునీటి కాల్వలను బాగు చేయాలని సీఎం ఆదేశించారు. కొల్లేరు డెల్టాల్లో రెగ్యులేటర్ పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని సూచించారు. తాండవ విస్తరణ, కృష్ణా నదిపై బ్యారేజ్‌ల నిర్మాణంపై దృష్టిపెట్టాలని అధికారులను కోరారు.