KRMB: తెలంగాణ డిమాండ్‌ సహేతుకం కాదు: కేఆర్‌ఎంబీకి ఏపీ ఈఎన్‌సీ లేఖ

కృష్ణా జల వివాదాల రెండో ట్రైబ్యునల్ ఆదేశాల ప్రకారం 2021-22 నీటి సంవత్సరానికి  70-30 నిష్పత్తిలోనే నీటి పంపకాలు జరగాలని

Published : 30 Aug 2021 13:25 IST

అమరావతి: కృష్ణా జల వివాదాల రెండో ట్రైబ్యునల్ ఆదేశాల ప్రకారం 2021-22 నీటి సంవత్సరానికి  70-30 నిష్పత్తిలోనే నీటి పంపకాలు జరగాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)కు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. 50:50 శాతం నిష్పత్తిలో నీటి పంపకాలకు సంబంధించి కేఆర్ఎంబీ లేఖపై స్పందిస్తూ ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) నారాయణ రెడ్డి ప్రత్యుత్తరం పంపారు. ట్రైబ్యునల్ అవార్డు వచ్చేంత వరకూ తాత్కాలికంగా కృష్ణా జలాల్లో 50-50 నిష్పత్తిలో నీటి పంపకాలు చేయాలంటూ తెలంగాణ చేసిన డిమాండ్‌పై ఏపీ అభిప్రాయాన్ని కేఆర్‌ఎంబీ కోరింది. దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వం.. నీటి పంపకాల్లో ఆ వాటా సహేతుకం కాదని తేల్చి చెప్పింది. ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి పంపకాలను ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయలేదని ఈఎన్‌సీ ఆ లేఖలో స్పష్టం చేశారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శ్రీశైలం, నాగార్జున సాగర్  ప్రాజెక్టుల నుంచి చెన్నై, హైదరాబాద్ నగరానికి తాగునీటి సరఫరా విషయంలో మాత్రమే కొన్ని నిబంధనల్ని ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. నాగార్జున సాగర్‌లో విద్యుత్ ఉత్పత్తి, సాగునీటి అవసరాల కోసం ప్రకాశం బ్యారేజీకి నీటి సరఫరా విషయంలో మాత్రమే ఉమ్మడి ఏపీలో ప్రాజెక్టుల వారీగా కొన్ని నిర్ణయాలు చేసినట్టు చెప్పారు. ఏపీ పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ కూడా రాష్ట్ర అవసరాల కోసం 1059 టీఎంసీలు కావాలని ట్రైబ్యునల్‌కు విజ్ఞప్తి చేసినట్టు గుర్తుచేశారు. ఈ దశలో 50-50 నిష్పత్తిలో నీటి పంపకాల కోసం తెలంగాణ డిమాండ్ సహేతుకం కాదని లేఖలో ఏపీ ప్రభుత్వం తరఫున ఈఎన్‌సీ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని