CM Jagan: రైతుల చేయి పట్టుకుని నడిపించేలా ఆర్బీకే వ్యవస్థ: జగన్‌

రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందించడం

Updated : 26 Oct 2021 13:55 IST

వైఎస్‌ఆర్‌ రైతు భరోసా- పీఎం కిసాన్‌ నిధులు విడుదల చేసిన సీఎం

అమరావతి: రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందించడం సహా వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. వైఎస్ఆర్ రైతు భరోసా- పీఎం కిసాన్, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం నిధులను సీఎం విడుదల చేశారు. వరుసగా మూడో ఏడాది రెండో విడత వైఎస్‌ఆర్‌ రైతు భరోసా- పీఎం కిసాన్‌ పథకానికి సంబంధించి 50.37 లక్షల మంది రైతులకు  రూ.2,051.71 కోట్లు నిధులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద 2020 ఖరీఫ్‌లో రుణాలు తీసుకున్న 6.67 లక్షల రైతులకు  రూ.112.7 కోట్ల నిధులను సీఎం విడుదల చేశారు. వైఎస్‌ఆర్‌ యంత్ర సేవా పథకం కింద రాష్ట్రంలోని 1720 రైతు సంఘాలకు వ్యవసాయ పరికరాల కొనుగోలు కోసం రూ.25.55 కోట్ల రాయితీ నిధులు జగన్‌ విడుదల చేశారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు ఇచ్చిన హామీల్లో వంద శాతం నెరవేర్చినట్లు తెలిపారు. ఒకే రోజున మూడు పథకాలకు సంబంధించి మొత్తం రూ.2190 కోట్లను రైతులకు అందజేసినట్లు చెప్పారు. మూడేళ్లలో రైతుభరోసా కింద ఇప్పటి వరకు రూ.18,777 కోట్ల నిధులను ఇచ్చామన్నారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ- క్రాప్ డేటా ఆధారంగా రూ.లక్షలోపు పంట రుణం తీసుకుని సకాలంలో జమ చేసిన వారికి వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తున్నట్లు తెలిపారు. రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా 10,750 కమ్యూనిటీ హైరింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని.. నిర్దేశించిన రుసుములకే ఈ కేంద్రాల ద్వారా  రైతులకు సేవలు అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విత్తనం నుంచి పంట అమ్మకం వరకు అన్నింటా రైతులకు చేయి పట్టుకుని నడిపించేలా ఆర్బీకే వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. కల్తీ ఎరువులు, పురుగు మందులు అరికట్టడమే లక్ష్యమని చెప్పారు. వీటి నివారణకు విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని జిల్లా ఎస్పీలను ఆదేశించినట్లు సీఎం జగన్‌ తెలిపారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని