Updated : 04/10/2021 17:37 IST

Cm Jagan: డ్రగ్స్‌ ఆనవాళ్లు ఉండకూడదు.. అధికారులకు సీఎం జగన్‌ ఆదేశం

అమరావతి: రాష్ట్రంలో ఎక్కడా మాదక ద్రవ్యాల సరఫరా లేకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. కాలేజీలు, యూనివర్సిటీల్లో మాదక ద్రవ్యాల ఆనవాళ్లే ఉండకూడదన్నారు. ఆ దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పర్యవేక్షణ ఉండాలన్నారు. ఎవరు పంపిణీ చేస్తున్నారు? ఎక్కడ నుంచి వస్తున్నాయ్‌.. అనే విషయాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. దీన్ని ఒక సవాల్‌గా తీసుకోవాలని సీఎం అన్నారు. అక్రమ మద్యం తయారీ, రవాణా సహా ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై సీఎం జగన్ సమీక్షించారు. ‘దిశ’ అమలు, మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రత్యేక కోర్టులు, పోలీసు బలగాల బలోపేతం, మాదకద్రవ్యాల నిరోధం తదితర అంశాలపై సీఎం ప్రధానంగా చర్చించారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్, డీజీపీ ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు.

‘దిశ’ను సమర్థంగా అమలు చేయాలి..

రాష్ట్రంలో ఇప్పటివరకు 74,13,562 మంది ‘దిశ’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని అధికారులు సీఎంకు వెల్లడించారు. దిశ యాప్‌ ద్వారా 5,238 మందికి సహాయం చేశామని.. 2021లో 684 ఎఫ్‌ఐఆర్‌లు రిజిస్టర్ చేసినట్లు చెప్పారు. మహిళలపై నేరాలకు సంబంధించి దర్యాప్తునకు 2017లో 189 రోజులు పడితే.. 2021లో కేవలం 42 రోజుల్లోనే ఛార్జిషీట్‌ దాఖలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. సీఎం మాట్లాడుతూ.. ‘దిశ చట్టాన్ని చాలా సమర్థంగా అమలు చేయాలి. రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ ఫోన్‌లో దిశ యాప్‌ ఉండాలి. దీనిపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ప్రత్యేక దృష్టి పెట్టాలి. వాలంటీర్లు, మహిళా పోలీసుల సాయంతో యాప్‌పై విస్తృత ప్రచారం నిర్వహించాలి. శాసనసభలో బిల్లును ఆమోదించి ఇన్ని రోజులైన తర్వాత కూడా పెండింగ్‌లో ఉండడం సరికాదు. వెంటనే దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలి. పోక్సో కేసుల విచారణకు ప్రస్తుతం 10 కోర్టులు ఆపరేషన్‌లో ఉన్నాయి. డిసెంబర్‌ నాటికి మొత్తం 16 కోర్టులు అందుబాటులోకి వస్తాయి. మహిళలపై నేరాలకు సంబంధించి 12 కోర్టులు నడుస్తున్నాయి. కడపలో మరో కోర్టు అందుబాటులోకి వస్తుంది. ఈ కోర్టుల్లో ప్రభుత్వ ప్లీడర్లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలి. దురదృష్టకర ఘటనలు జరిగినప్పుడు అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. శరవేగంగా బాధితులను ఆదుకోవాలి. ఘటన జరిగిన నెలరోజుల్లోగా బాధితులకు అందించాల్సిన పరిహారాన్ని సత్వరమే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా అలసత్వం జరిగితే వెంటనే సీఎంఓ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలి’’ అని సీఎం అన్నారు.

లేని అంశాన్ని ఉన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు..

‘‘సైబర్‌ క్రైం నిరోధంపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి. సమర్థులైన అధికారులను, న్యాయవాదులను వీటిలో నియమించాలి. రాష్ట్రానికి సంబంధం లేని డ్రగ్‌ వ్యవహారంపై గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు. లేని అంశాన్ని ఉన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. వ్యక్తులపై తప్పుడు ఆరోపణలు, ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్షం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి దుష్ప్రచారం చేస్తోంది. రాష్ట్ర పోలీసు వ్యవస్థ ప్రతిష్టను, ప్రభుత్వంతో పాటు వ్యక్తుల ప్రతిష్టలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి అంశాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది’’ అని జగన్‌ పేర్కొన్నారు.


Read latest Andhra pradesh News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని