Updated : 26/09/2021 13:36 IST

Cyclone Gulab: శ్రీకాకుళం జిల్లాలో అధికారులకు సెలవు రద్దు

కవిటి గ్రామీణం, శ్రీకాకుళం: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘గులాబ్‌’ తుపాను తీరంవైపు కదులుతోంది. ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 140కి.మీ, ఏపీలోని కళింగపట్నానికి 190కి.మీ దూరంలో కేంద్రీకృతమై పశ్చిమ దిశగా ముందుకెళ్తోంది. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. జిల్లా అంతటా మేఘావృతం కావడంతో పాటు పలుచోట్ల తేలికపాటి వర్షం పడుతోంది. ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, పలాస తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. ఈరోజు రాత్రికి కళింగపట్నం-గోపాల్‌పూర్‌ మధ్య తుపాను తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో 75-90 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశముంది. 

కవిటి, గార చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు

తుపాను హెచ్చరికల నేపథ్యంలో క్షేత్రస్థాయి అధికారులను జిల్లా కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ అప్రమత్తం చేశారు. జాతీయ విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధం చేశారు. జిల్లా పరిధిలోనే తుపాను తీరం దాటే పరిస్థితి ఉండటంతో గార, కవిటి తీర ప్రాంతాలకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు చేరుకున్నాయి. కవిటి మండలంలో తీర ప్రాంతాలను డీఎస్పీ శివరామిరెడ్డి, తహసీల్దార్‌ అప్పలరాజు, సీఐ వినోద్‌బాబు, ఎస్సై అప్పారావు సందర్శించారు. ఇద్దివానిపాలెం, పెద్దకర్రివానిపాలెం గ్రామాలను పరిశీలించారు. జిల్లా పరిధిలోనే తుపాను తీరం దాటే అవకాశమున్నందున మత్స్యకారులంతా అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. తుపాను పరిస్థితి బట్టి పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాల్సి ఉంటుందని.. సిద్ధంగా ఉండాలని సూచించారు. 

అన్ని మండలాల్లో కంట్రోల్‌ రూంలు..

మరోవైపు తుపాను పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో రెవెన్యూ, పోలీసు, మెరైన్‌ పోలీసు, విద్యుత్‌, ఆర్‌అండ్‌బీ, అగ్నిమాపక, వైద్య-ఆరోగ్యశాఖ అధికారులకు ఈరోజు సెలవు రద్దు చేశారు. జిల్లాలోని అన్ని మండలాలతో పాటు కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూం ఏర్పాటు చేశారు. తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.

Read latest Andhra pradesh News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని