Guntur: దుగ్గిరాలలో రణరంగం... నారా లోకేశ్‌పై దాడికి యత్నం

వైకాపా శ్రేణుల రాళ్ల దాడితో గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి రణరంగమైంది. హత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు తెదేపా జాతీయ ప్రధాన

Updated : 28 Apr 2022 23:01 IST

దుగ్గిరాల: వైకాపా శ్రేణుల రాళ్ల దాడితో గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి రణరంగమైంది. హత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ గురువారం సాయంత్రం తుమ్మపూడి చేరుకున్నారు. ఈ సందర్భంగా తెదేపా శ్రేణులతో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అనుచరులు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. వైకాపా శ్రేణుల రాళ్లదాడితో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. లోకేశ్‌ పైకి వైకాపా కార్యకర్తలు రాయి విసరడంతో ఆయన పక్కనే పడింది. వైకాపా శ్రేణులను పోలీసులు నిలువరించారు. ఎమ్మెల్యే ఆర్కే డ్రైవర్‌ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని తెదేపా నేతలు ఆరోపించారు.

ప్రభుత్వానికి 21 రోజుల సమయం ఇస్తున్నా: లోకేశ్‌ 
‘‘కొంత మంది పోలీసు అధికారుల వల్ల ఆ శాఖకు చెడ్డపేరు వస్తోంది. తెదేపా శ్రేణులపై రాళ్ల దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే రాళ్ల దాడి చేస్తారా. రాళ్లు విసిరితే భయపడి పారిపోతామనుకున్నారా?రాష్ట్రంలో జగన్‌ తాత రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందా? రాష్ట్రంలో మాఫియా రాజ్యం విచ్చలవిడిగా నడుస్తోంది. వైకాపా నేతలకు చట్టాలపై గౌరవం, భయం లేదు. మహిళలపై దాడులు జరిగితే బుల్లెట్‌ కన్నా వేగంగా వస్తానన్న జగన్‌ ఎక్కడ?రాష్ట్రంలో పెద్ద ఎత్తున మహిళలపై దాడులు జరుగుతున్నాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక 800మంది మహిళలపై దాడులు జరిగాయి. నిన్న కొందరు మద్యం సేవించి మహిళపై దాడి చేసి హత్యచేశారు. దాడిలో ముగ్గురి పాత్ర ఉందని మృతురాలి బంధువులు వెల్లడించారు. మృతురాలి బంధువులు ఫిర్యాదు చేసినా కేసులు పెట్టట్లేదు. రాష్ట్రంలో లేని దిశా చట్టం ఉందని చిత్రీకరిస్తున్నారు. ప్రభుత్వానికి 21 రోజుల గడువు ఇస్తున్నా. దిశా చట్టం కింద ముగ్గురు నిందితులపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముగ్గురు నిందితులకు ఉరిశిక్ష విధించాలి. పోస్టు మార్టం నివేదిక రాకముందే హత్యచారం జరగలేదని గుంటూరు అర్బన్‌ ఎస్పీ ఎలా చెప్పారు?తనపై ఎవరి ఒత్తిడి ఉందో ఎస్పీ సమాధానం చెప్పాలి. ఎస్పీతో ఎవరెవరు మాట్లాడారో కాల్‌డేటా రికార్డులు బయటపెట్టాలి. నాకు చీర పంపుతానని రోజా చెబుతున్నారు. రోజా పంపిన చీరను నా తల్లి, ఆడపడుచులకు ఇస్తా. కించపరిచేలా మాట్లాడిన రోజా మహిళలకు క్షమాపణ చెప్పాలి’’ అని నారా లోకేశ్‌ డిమాండ్‌ చేశారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని