Konaseema: ‘కోనసీమ’ జిల్లా పేరు మార్పు.. అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత

‘కోనసీమ’ జిల్లా పేరు మార్పు చేయొద్దంటూ ఆ ప్రాంత యువకులు చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. కోనసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో వందలాది మంది యువకులు అమలాపురంలోని గడియారం స్తంభం సెంటర్‌లో ఆందోళనకు దిగారు.

Updated : 24 May 2022 18:08 IST

అమలాపురం: ‘కోనసీమ’ జిల్లా పేరు మార్పు చేయొద్దంటూ ఆ ప్రాంత యువకులు చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కోనసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో వందలాది మంది యువకులు అమలాపురంలోని గడియారం స్తంభం సెంటర్‌లో ఆందోళనకు దిగారు. ‘కోనసీమ జిల్లా ముద్దు.. వేరే పేరు వద్దు’ అంటూ నినాదాలతో హోరెత్తించారు.

పోలీసులు రంగ ప్రవేశం చేసి కొంతమంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే వారి నుంచి కొందరు తప్పించుకుని కలెక్టరేట్‌ వైపు పరుగులు తీశారు. వారిని పోలీసులు వెంబడించారు. మరోవైపు జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఆందోళనకారులను ఆయన కూడా చెదరగొట్టారు. ఈ క్రమంలో అమలాపురం ఏరియా ఆస్పత్రి వద్ద పోలీసులపై ఆందోళకారులు రాళ్లతో దాడి చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఎస్పీ సుబ్బారెడ్డి రాళ్లదాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. పట్టణంలోని నల్ల వంతెన వద్ద ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. రాళ్లదాడిలో కొంతమంది పోలీసులు, యువకులకు గాయాలయ్యాయి. కలెక్టరేట్‌ వైపు దూసుకెళ్తున్న నిరసనకారులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులను తరలిస్తున్న బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. కలెక్టరేట్‌ వద్ద ఆందోళనకారులు బస్సును దగ్ధం చేశారు.

మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు..

ఆందోళనకారుల నిరసన సెగ మంత్రి విశ్వరూప్‌కు తగిలింది. అమలాపురంలోని బ్యాంకు కాలనీలోని మంత్రి విశ్వరూప్‌ ఇంటిపై ఆందోళనకారులు దాడి చేశారు. మంత్రి క్యాంపు కార్యాలయంలోని ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. మంత్రి ఇంటికి నిప్పంటించారు. అయితే దాడికి ముందే మంత్రి కుటుంబసభ్యులను పోలీసులు అక్కడనుంచి తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

విచారణ అనంతరం చర్యలు..: హోం మంత్రి

అంబేడ్కర్‌ పేరు జిల్లాకు పెడితే వ్యతిరేకించడం బాధాకరమని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. జిల్లా ప్రజల విజ్ఞప్తుల మేరకే జిల్లా పేరు అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మారడం జరిగిందన్నారు. ఆందోళనకారులను సంఘ విద్రోహ శక్తులు నడిపిస్తున్నాయని చెప్పారు. విచారణ అనంతరం నిందితులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

కోనసీమ జిల్లా పేరును ‘డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ’ జిల్లాగా మారుస్తూ రెవెన్యూశాఖ ఇటీవల ప్రాథమిక ప్రకటన జారీ చేసింది. దీనిపై అభ్యంతరాలు, సూచనలను 30 రోజుల్లోగా కలెక్టర్‌కు తెలియజేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో కోనసీమ పేరునే కొనసాగించాలంటూ యువకులు ఆందోళనకు దిగారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని