
AP news : అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి.. వైకాపా నేతల ఆగ్రహం !
కడప: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో కొత్త జిల్లాల పేర్లు, జిల్లా కేంద్రాల అంశంపై అక్కడక్కడా విమర్శలు చెలరేగుతున్నాయి. కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్న అన్నమయ్య జిల్లాకు రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడంపై వైకాపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ వైఖరిని రాజంపేట మున్సిపల్ వైస్ ఛైర్మన్ మర్రి రవి తప్పుబట్టారు. రాజంపేట ప్రజలను సంప్రదించకుండా రాయచోటిని జిల్లా కేంద్రంగా చేయాలనుకోవడం సరికాదన్నారు. ఈ మేరకు ఆయన ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు.
‘‘అన్నమయ్య పేరును ఆయన పుట్టిన చోటుకు కాకుండా మరో ప్రాంతానికి పెట్టారు. రాయచోటిని మదనపల్లిలో కలుపుకొని మరో జిల్లా ఏర్పాటు చేసుకోండి. రాజంపేట వాసులను అనాథల్లా రాయచోటిలో కలిపారు. ఇలా చేస్తే మేము ప్రజల్లో తిరిగే పరిస్థితి ఉండదు. రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో వైకాపా పరాజయం పాలవుతుంది. నా వైస్ ఛైర్మన్ పదవికి కూడా రాజీనామా చేస్తాను. రాజంపేటను కడప జిల్లాలో కొనసాగించాలి. లేదంటే రాజపేటను జిల్లా కేంద్రం చేయాలి’ అని మర్రి రవి డిమాండ్ చేశారు. మరోవైపు కొత్తబోయినపల్లె అన్నమయ్య విగ్రహం వద్ద తెదేపా నేతలు నిరసనకు దిగారు. అన్నమయ్య నడిచిన రాజంపేటను కాదని రాయచోటిని జిల్లా కేంద్రంగా చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రాజంపేట ఎంపీ,ఎమ్మెల్యే,జడ్పీ ఛైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.