ఆంజనేయం... మహావీరం!

శ్రీరామ భక్తుడిగా రామకార్యాన్ని సఫలం చేసిన మహావీరుడు- ఆంజనేయుడు. హనుమను ‘సర్వదేవాత్మకుడు’ అని వానర గీత స్తుతించింది. శ్రీహరి జ్ఞానశక్తి, పరమేశ్వరుడి క్రియాశక్తి, బ్రహ్మ సంకల్పశక్తి ఏకోన్ముఖమై హనుమగా అభివ్యక్తమైందంటారు. విశ్వవ్యాపకమైన భగవత్‌ చైతన్యాన్ని ‘అంజన’గా వ్యవహరిస్తారు.  

Updated : 01 Jun 2024 05:30 IST

శ్రీరామ భక్తుడిగా రామకార్యాన్ని సఫలం చేసిన మహావీరుడు- ఆంజనేయుడు. హనుమను ‘సర్వదేవాత్మకుడు’ అని వానర గీత స్తుతించింది. శ్రీహరి జ్ఞానశక్తి, పరమేశ్వరుడి క్రియాశక్తి, బ్రహ్మ సంకల్పశక్తి ఏకోన్ముఖమై హనుమగా అభివ్యక్తమైందంటారు. విశ్వవ్యాపకమైన భగవత్‌ చైతన్యాన్ని ‘అంజన’గా వ్యవహరిస్తారు. ఆ అంజన వానరకాంతగా రూపాన్ని ధరించి అంజనాదేవిగా తపస్సు చేసి హనుమను వరపుత్రుడిగా పొందిందంటారు. వైశాఖ బహుళ దశమినాడు, వైధృతి యోగస్వరూపుడిగా కేసరీనందనుడు జన్మించాడు.

మంత్రశాస్త్ర రీత్యా పవనకుమారుడికి సుందరాత్మ అని పేరు. అంటే ఆత్మ సౌందర్యంతో శోభిల్లే దివ్యతేజోరూపుడు. అందరి ఆనందాలే, తన ఆహ్లాదంగా భావించిన ప్రసన్నమూర్తి. లంకాయానంలో హనుమకు సురస, సింహికలు ఎదురయ్యారు. వీరిద్దరూ విషయవాంఛలకు, భోగలాలసత్వానికి ప్రతిఫలనం. లక్ష్యసిద్ధికి ఈ రెండు అంశాలను అధిగమించడం ద్వారా కర్తవ్యదీక్షలో సాధకుడు పురోగమించవచ్చని కపివీరుడు నిరూపించాడు. ఆకాశమార్గంలో ధీరుడై హనుమ పయనించాడు. ఆకాశానికి విష్ణుపదం అని నామాం తరం. గగనసీమ పరమాత్మ స్థానం. ఆ దిశలో ప్రయాణించాలంటే బ్రహ్మ నిష్ఠ ఉండాలి. ఆ బ్రహ్మ యశస్సుతో అంజనీసుతుడు దైవపథాన కొనసాగి లక్ష్యాన్ని ఛేదించాడు. వీరహనుమగా ధైర్య  స్థైర్యాలతో లంకాదహనం చేశాడు. ‘లంకా’ అనే పదాల్ని తిరగేస్తే ‘కాలం’ అవుతుంది. కాలం తమోగుణాన్ని సూచిస్తుంది. రాక్ష సత్వం తమస్సుకు సూచిక. ఆ తమస్సును, వానర శ్రేష్ఠుడు తన దివ్య తేజస్సుతో దహించాడు. మహాశక్తి స్వరూపిణి మైథిలిని లలితా పరాభట్టారికగా, శ్రీవిద్యో పాసకుడిగా ఆంజనేయుడు దర్శించాడు. అందుకే శ్రీమద్రామాయణం హనుమను నందివిద్యా ప్రదాతగా నందీశ్వరుడిగా పేర్కొంది. 

శ్రీ చక్రపుర నివాసిని, సిరుల దేవేరి రూపమే సీతామహాలక్ష్మి. ఆమెను లంక అనే శ్రీపురంలో దర్శించి, హనుమ శక్తి సంపన్నుడయ్యాడు. ‘హనుమ’ అనే పేరులోని అ, ఉ, మ- ఈ మూడూ సమ్మిళితమైతే ఓంకారం ఆవిర్భవిస్తుంది. అంటే పవనాత్మజుడు ప్రణవస్వరూపుడు. ఆధ్యాత్మిక జగత్తులో సాధకుడి పరమలక్ష్యం- జీవాత్మను, పరమాత్మతో అనుసంధానించడం. ప్రకృతి శక్తుల సమాహారమే జీవాత్మగా అభివ్యక్తమవుతుంది. ప్రకృతికి జానకి సంకేతమైతే, శ్రీరాముడు పరబ్రహ్మ చైతన్యం. పరమాత్మతో, ప్రకృతిని సమ్మిళితం చేసి, అద్వైత స్థితిని సాధించడమే హనుమలక్ష్యం. జీవాత్మ, పరమాత్మ ఏకీకృతమయ్యాక, హనుమ బ్రహ్మానంద భరితుడయ్యాడు. మహాయోగ సాధకుడు అందుకునే అత్యున్నత స్థితి పరబ్రహ్మ సచ్చిదానందమే!
అష్టవిభూతుల శిష్ట జనరక్షకుడు ఆంజనేయుడు. దృష్టి, ధృతి, ధైర్యం, దార్శనికత- అనే ఈ నాలుగు లక్షణాలు కపివరేణ్యుడిలో భాసిల్లుతాయి. అనన్య సామాన్యమైన దాస్యభక్తి, అనిర్వచనీయమైన అద్భుత శక్తి, అనితరసాధ్యమైన కార్యసాఫల్య యుక్తి... ఇవన్నీ మూర్తీభవిస్తే- అది ఆంజనేయుడి స్వరూపమవుతుంది. ఆదర్శనీయ వ్యక్తిత్వ అంశాలతో, ఆరాధనీయ దైవత్వగుణ వైభవంతో సువర్చస్సు సంభరితంగా ఆంజనేయుడు ప్రభాదివ్యకాయుడై ప్రకాశిస్తుంటాడు! హనుమ ప్రకటించిన నిరుపమాన మహావిరాట్‌ మూర్తిమత్వం- సర్వే సర్వత్రా ఆచరణయోగ్యం! నవనవోన్మేషం!

డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని