Panch Sarovar: పంచ సరోవరాలు.. తెలుసా?

spiritual lakes in india panch sarovar| పంచ సరోవరాలుగా ప్రసిద్ధమైన మానస, పంపా, పుష్కర్, నారాయణ, బిందు గురించి తెలుసా?

Updated : 18 Jun 2024 18:16 IST

మానస సరోవరం

తీర్థం అంటే నీరు. నది, సరస్సు అనే అర్థాలూ ఉన్నాయి. తీర్థ తీరాల్లో వెలసిన క్షేత్రాలకు చేసే యాత్రలనే తీర్థయాత్రలంటారు. మన దేశంలో ఎన్నో జల వనరులున్నాయి. వాటిలో పంచ సరోవరాలు ప్రసిద్ధమైనవని పురాణాలు చెబుతున్నాయి. అవి మానస (Manasarovar), పంపా (Pampa Sarovar), పుష్కర్ (Pushkar Sarovar), నారాయణ (Narayan Sarovar), బిందు (Bindu Sarovar) అనే అయిదు. త్రిమూర్తులు, మునీశ్వరుల ద్వారా వెలశాయి కాబట్టి వాటికి వీటికీ అంతటి పవిత్రత చేకూరిందంటారు. మానస సరోవరాన్నే బ్రహ్మ సరోవరమనీ అంటారు. ఇది హిమాలయాల్లో కైలాస పర్వతం దగ్గర ఉందంటారు. బ్రహ్మదేవుడి మనసులోని ఆలోచనల నుంచి ఏర్పడిందని దీనికీ పేరు. దీన్ని బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభంలో ఆది దంపతుల అవసరాల కోసం సృష్టించాడట. ఈ సరస్సును ఎన్నో పవిత్ర నదులకు పుట్టినిల్లుగా చెబుతారు. గంగను భువికి రప్పించడానికి భగీరథుడు దీని ఒడ్డునే ఘోరమైన తపస్సు చేశాడని ఐతిహ్యం. జ్ఞానానికి, అందానికి ప్రతీకలైన హంసలు ఈ సరోవరంలోనే విహరిస్తుంటాయని ప్రతీతి.

కర్ణాటకలోని హంపీలో ఉన్న పంపాసరోవరం రామాయణ కాలం నాటిదని ప్రసిద్ధం. అక్కడున్న పంపా తీరంలో శబరి మతంగ మహర్షి శిష్యులకు సేవలు చేస్తుండేదట. సీతాన్వేషణ చేస్తూ అక్కడకు వెళ్ళిన రామలక్ష్మణులకు ఆతిథ్యమిస్తూ శబరి ఆ సరోవర గొప్పతనాన్ని వారికి వివరించింది. అక్కడ ఆశ్రమాలు ఏర్పరచుకుని తపస్సు చేసుకునే మునులు సప్తసాగరాల జలాలూ ఒక చోట నిలిచేట్లుగా ఒక మహిమాన్వితమైన సరస్సును సృష్టించుకున్నారని, దానికే ‘పంపాసరోవరం’ అని పేరు పెట్టారని ఆ వివరణ సారాంశం.

పద్మపురాణంలో పుష్కర సరోవరం గురించి వివరంగా ఉంది. పుష్కరం అంటే పోషణ చేసేది అని అర్థం. ఒకసారి బ్రహ్మదేవుడు భూలోకానికి రాగా, ఇక్కడి చెట్లన్నీ తమకు పోషకుడిగా ఆయనను ఇక్కడే ఉండమని అభ్యర్థించాయట. వాటి కోరిక మేరకు బ్రహ్మదేవుడు తన ఆలయాన్ని, ఒక సరస్సును సృష్టించి దానికి పుష్కర(వనాన్ని పోషించే) సరోవరం అని పేరు పెట్టాడట. రాజస్థాన్‌లో అజ్మీరుకు ఏడు మైళ్ల దూరంలో ఉన్న ఈ సరస్సు నీటికి రోగాలను నయం చేసే శక్తి ఉందని నమ్ముతారు.

నారాయణ సరోవరం గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలో ఉంది. విష్ణువు దాల్చిన ఇరవైఒక్క అవతారాల్లో నరనారాయణ అవతారం ఒకటి. ఆ నరనారాయణుల పాదాలు భూమిని తాకగా ఈ సరస్సు ఏర్పడిందంటారు. లోకులకు సత్యాన్ని ఎరుక పరచడానికి విష్ణుతేజం నరనారాయణులనే అంశావతారం(తాత్కాలిక ప్రయోజనాల కోసం భగవదంశ రూపుదాల్చడం)గా అవతరించింది. రెండు రూపాలుగా ఉన్న ఒకే అవతారం నరనారాయణులు. రావణుడి తపస్సుకు మెచ్చి శివుడు ఆత్మ లింగాన్ని ఇక్కడే ఇచ్చాడని ఒక కథనం. ఇలా శివకేశవుల పాద స్పర్శతో పునీతమైన ఈ స్థలం పవిత్రమైనదిగా భావిస్తారు.
బిందు సరోవరం గుజరాత్‌లో పఠాన్‌ జిల్లా, సిద్ధ్‌పుర్‌లో ఉంది. స్వాయంభువు మనువు- శతరూప దంపతుల ముగ్గురు కుమార్తెల్లో దేవహుతికి తగిన వరుణ్ని వెదికే ప్రయత్నంలో స్వాయంభువు దేశదేశాలూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. ఇక్కడకు రాగానే కర్దముడు అతడి కంటబడ్డాడట. శివుడు ప్రత్యక్షమై నీ కూతురికి తగిన వరుడు అతడేనని చెప్పాడట. ఆ సంతోషంతో స్వాయంభువు మనువు కళ్ల నుంచి ఆనందబాష్పాలు వెలువడి ఆ బిందువులతో ఏర్పడిన సరోవరానికే బిందు సరోవరమని పేరు వచ్చిందని కథనం. ఈ సరోవరం ఒడ్డున ఉన్న రావిచెట్టు కింద దేశంలో మరెక్కడా లేని విధంగా స్త్రీ మూర్తులకు మాత్రమే తర్పణాలను విడవడం విశేషం.

పితృదేవతలకు తర్పణాలను అర్పించాలనుకునేవారు ఈ పంచసరోవర యాత్ర చేస్తుంటారు. తద్వారా-తీర్థయాత్ర చేసిన అనుభూతి, పితృదేవతలకు తర్పణాలను విడిచి, వారికి ఉత్తమలోక గతులను ఏర్పరచిన తృప్తి అనే రెండు ఫలితాలు వారికి అందుతాయంటారు.

అయ్యగారి శ్రీనివాసరావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని