అదే ముఖ్యాంశం

అన్ని మతాలకు సమ్మతమైనది దైవ ప్రార్థన. అది సర్వమత సారం, సర్వ ఆత్మతత్త్వం అంటారు గాంధీజీ. ఈ ప్రపంచం ఊహించలేని మహత్తరమైన విషయాలను ప్రార్థన ద్వారా సాధించవచ్చని పాశ్చాత్య కవి లార్డ్‌ ఆల్ఫ్రెడ్‌ డెనిసన్‌ వ్యాఖ్యానించారు.

Updated : 29 Dec 2021 04:41 IST

న్ని మతాలకు సమ్మతమైనది దైవ ప్రార్థన. అది సర్వమత సారం, సర్వ ఆత్మతత్త్వం అంటారు గాంధీజీ. ఈ ప్రపంచం ఊహించలేని మహత్తరమైన విషయాలను ప్రార్థన ద్వారా సాధించవచ్చని పాశ్చాత్య కవి లార్డ్‌ ఆల్ఫ్రెడ్‌ డెనిసన్‌ వ్యాఖ్యానించారు. మతంలేనిదే మనిషికి మనుగడ సాగదంటారు. ప్రార్థన మేలుకొన్న ఆత్మ స్వగతంలాంటిది. అది ఒక రకమైన ధ్యానయోగం. ధ్యానం (ధీ-యానం) అంటే భగవంతుడి దిశగా బుద్ధి పయనం. ప్రార్థన... ఆ పయనం విజయవంతం చేయడానికి పనికొచ్చే ఉపాయం, ఉపకరణం.

మామూలుగా మనిషి చేసే విన్నపాలు తన గురించి, తన బాధల గురించి, కోరికల గురించి ఎక్కువగా ఉంటాయి. భక్తులు నాలుగు రకాలని భగవానుడే గీతోపనిషత్తులో స్పష్టంగా చెప్పాడు. ఆర్తి, జిజ్ఞాసువు, అర్థార్థి, జ్ఞాని తన భక్తులేనని, అందరిలో జ్ఞాని తనకు మిక్కిలి ఇష్టమైన వాడని కూడా కృష్ణపరమాత్మ చెప్పాడు. ఆర్తి జ్ఞానిగా మారేదాకా వారిని భరించక తప్పదు. నాకు అది కావాలి, ఇది కావాలి అంటూ చిన్న కుర్రాడిలా మారాం చేసేవాడు ఆర్తి. అందమైన సుందరాంగి సోయగాన్ని చాటుమాటుగా ఆస్వాదిస్తూ, అర్రులు చాచే కోడెగాడి వంటివాడు జిజ్ఞాసువు. ఇహపరాల నడుమ కొట్టుమిట్టాడుతూ, పరమార్థం సాధించేది ఎలాగా అని తపన పడే మధ్య వయస్కుడు అర్థార్థి. ఏ కోరికా లేక, భగవంతుడి పట్ల విశ్వాసం కలిగి, సదా భజిస్తూ (సేవిస్తూ) శరణార్థి అయిన భక్తుడు జ్ఞాని. మిగతా భక్తులు ముగ్గురూ ఆ స్థాయికి ఎదిగి రావాలన్నదే భగవంతుడి కోరిక, ఉద్దేశం. జ్ఞాని మాత్రమే తనవాడు, మిగతా వాళ్లు కాదన్న అర్థంతో విమర్శించకూడదు. పాపులు, పుణ్యాత్ములు, మంచివాళ్లు, చెడ్డవాళ్లు, ఆస్తికులు, నాస్తికులు... అందరూ భగవంతుడి బిడ్డలే. 

వేడికోలు అంటే అన్వేషణ. ‘స్వామీ! ఎక్కడున్నావు? మమ్మల్ని ఉద్ధరించు... సరైన దారి చూపించు’ అని అందరి కోసం ప్రతిదినం, వీలైతే ప్రతి  క్షణం ఆ భగవంతుడిని ప్రార్థించాలి. అందరి బాగులో మన బాగూ ఉన్నది. ‘సర్వే జనా స్సుఖినోభవంతు’. అలాంటి వేడికోలు మనకు శక్తిని, యుక్తిని, ముక్తిని ప్రసాదిస్తుంది. ముల్లోకాలను వెలిగించే ఆ పరమాత్మను గురించిన గాయత్రీ మంత్రోపాసన పరమ పవిత్రమైన విశ్వజనీనమైన ప్రార్థన. ‘లోకాస్సమస్తా స్సుఖినోభవంతు’. ఇది కుల, జాతి, మతాతీతమైన మంత్రజపం. ముప్పొద్దులా మంత్రాన్ని నిష్ఠాగరిష్ఠంగా అనుష్ఠించగల వ్యక్తి లోకకల్యాణ చక్రవర్తి!

శ్రీ శంకరుల ‘శివాపరాధ శమాపన స్తోత్రం’ (13) ‘అందరికీ అండగా నిలిచే నువ్వే మాకు దిక్కు. నిన్ను శరణు కోరినవారిని రక్షించు’ అంటున్నది. మహాపాపి అయినా దైవనామ స్మరణ ద్వారా (అజామీలుడిలాగా) పునీతుడై పుణ్యలోకాలు చేరుకోవచ్చునని గీతామాత చెబుతున్నది. ప్రార్థన రోజూ రెండు పూటలా చేయాలి. వీలైనప్పుడో, వారానికో రోజో మొక్కుబడిగా చెల్లిస్తే ఉపయోగం లేదు. అవన్నీ తావిలేని పూలతో సమానం. రెండు పూటలా శుభ్రంగా స్నానం చేయకపోతే శరీరం మకిలి పట్టి మనతోపాటు అందరినీ వేధిస్తుంది. ప్రార్థనతో ప్రక్షాళనం చేయకపోతే మనసుకూ మాలిన్యం పడుతుంది. ఉదయం నిద్ర లేవగానే తలుపు తాళం తీసినట్టుగా, మనసు తెరిచి ఆ భగవంతుణ్ని ప్రార్థించాలి. చీకటి పడగానే తలుపు గొళ్లెం భద్రంగా పెట్టినట్టు, నిద్రకు ఉపక్రమించే ముందూ భగవంతుణ్ని ప్రార్థించాలి. ఏ దేవుడిని ప్రార్థిస్తున్నామన్నది ముఖ్యం కాదు. ఎలా ప్రార్థిస్తున్నాం అన్నదే ముఖ్యాంశం!

- ఉప్పు రాఘవేంద్రరావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని