మహోన్నతం అన్నదానం

ధర్మం ఆచరించాలంటే శరీరం శక్తిమంతమై ఉండాలి. శారీరకశక్తికి ఆహారం అవసరం. ఆహారంలోని ప్రధాన భాగమే అన్నం. వ్యవసాయ ప్రధానమైన మనదేశంలో అన్నానికి ఆధ్యాత్మిక అనుబంధం ఉన్నదని

Updated : 30 Dec 2021 05:11 IST

ధర్మం ఆచరించాలంటే శరీరం శక్తిమంతమై ఉండాలి. శారీరకశక్తికి ఆహారం అవసరం. ఆహారంలోని ప్రధాన భాగమే అన్నం. వ్యవసాయ ప్రధానమైన మనదేశంలో అన్నానికి ఆధ్యాత్మిక అనుబంధం ఉన్నదని వేదాలే చెబుతున్నాయి. అన్నమే బ్రహ్మగా, పరబ్రహ్మగా, ప్రాణంగా, ఆయువుగా, నీతినియమ జీవనవిధానానికి మూలంగా, మంచిచెడుల నిర్ణయాధికారిగా, బతుకుకు ఇంధనంగా భావిస్తున్నారు. ఆకలితో అలమటిస్తూ పిడికెడన్నం దొరక్క మరణించేవాళ్లూ ఉన్నారు, అకృత్యాలు చేసేవాళ్లూ ఉన్నారు. అన్నం దొరక్క మూడురోజులు ఆకలితో బాధపడి ‘కాశీ’నే వ్యాసుడు శపించాడు.

సకల ప్రాణులకూ ఆధారమైన అన్నాన్ని ఉత్కృష్టమైన హవిస్సని వేదాలు; యోగ్యమైన ఆహారం, విహారం, యుక్తమైన నిద్ర శ్రమ చేసే శక్తి అందజేసేదిగా గీత అభివర్ణిస్తున్నాయి. అన్నం వల్లనే శక్తి ప్రాప్తిస్తుందని కృష్ణయజుర్వేదం చెబుతోంది. అన్నదానం అన్ని దానాల్లోకీ శ్రేష్ఠమైందని కఠోపనిషత్‌ చాటుతోంది. పరమేశ్వర ప్రసాదితమైన అన్నాన్ని నిందించడం, వృథా చేయడం తగదని శ్రుతులు చెబుతున్నాయి. అన్నానికి అధిదేవత అన్నపూర్ణేశ్వరి. అన్నాన్ని పవిత్రంగా, పూజనీయంగా భావిస్తూ స్వీకరిస్తే ఆ తల్లిని ఆరాధించినట్లే. అన్నాన్ని ప్రసాదంగా సంభావించాలని ఆదిత్య పురాణం ప్రవచించింది. ఆకలిగొన్నవాడికి అన్నం రుచి, సమయం తెలియవట. అటువంటివాడికి అన్నదానం చేయడంకన్నా పుణ్యకార్యం మరేదీ లేదని విజ్ఞులు బోధిస్తున్నారు. పారలౌకిక పరమార్థ భావనతోనే రాజులు తమ కాలంలో అన్నసత్రాలు కట్టించేవారు. అన్నసంతర్పణ చేయించేవారు.

ఎంగిలి అన్నాన్ని తినకూడదని, మరొకరికి పెట్టరాదని, మితంగా తినాలని, అతిగా తింటే అదే మనల్ని తినేస్తుందని ఆయుర్వేదశాస్త్రం చెబుతోంది. యజ్ఞాగ్నిలో అర్పితమైన ఆహారం ఏ విధంగా పరమాత్మకు చేరుతుందో, అదే విధంగా జఠరాగ్నికి అర్పితమైన ఆహారం శక్తిరూపంలో మన ఆత్మకు చేరుతుందని కృష్ణపరమాత్మ ఉద్బోధిస్తాడు. రోజుకొకసారి భోజనం చేసేవాడు మహాయోగి, రెండుసార్లు చేసేవాడు మహాభోగి, అంతకుమించి ఎక్కువసార్లు తినేవాడు మహారోగి అవుతాడని ఆరోగ్య సూత్రం.

అన్నం ఒంటరిగా భుజించరాదని, అతిథికి వడ్డించి అతడితో కలిసి భుజించాలని, అదే పుణ్యప్రదమైన గృహస్థు వ్రతమని రుగ్వేదమంత్రం వినిపిస్తుంది. ఈ లోకంలో అన్నదానం చేసినవారు పరలోకంలో తమకోసం మంచి నిధిని సమకూర్చుకోగలరని మహాభారతంలో ఆనుశాసనిక పర్వం ఉల్లేఖించింది. మన ఇంట భోజనం చేసినవాడు ‘అన్నదాతా సుఖీభవ’ అని తృప్తిగా తేన్చి శుభాకాంక్ష తెలియజేస్తే అంతకన్నా మహాభాగ్యమే ఉండదు. న్యాయమార్గాన మాత్రమే అన్నసముపార్జన చేయాలని భృగుసంహిత ప్రబోధిస్తోంది. శ్రమ చేయలేకపోతే భిక్షమెత్తుకోవడం దోషం కాదని, అంతేకాని ఆత్మహత్య చేసుకోరాదని ఈశా వాస్య ఉపనిషత్‌ చెబుతోంది. మానవజన్మ సార్థకతకు అన్నదానం ప్రధాన సూత్రమని శాస్త్రం చెబుతున్నది. అందునా, గృహస్థు విస్మరించరాని ధర్మమని గుర్తు చేస్తున్నది. ప్రసన్నతతో, ప్రశాంతతతో సాత్వికాహారాన్నే స్వీకరించాలన్నది మనుస్మృతి కథ! ఏడాదికోసారి పితృయజ్ఞం చేసినప్పుడు అన్న సూక్తవడ్డనం, శ్రవణం చేసి పితృదేవతల్ని స్మరించుకోవాలని ‘ధర్మసింధు’ చెబుతోంది. సాత్వికాహార సేవనం వల్ల సత్త్వశుద్ధి, చిత్తశుద్ధి, జ్ఞానం, పారలౌకిక చింతనం, జిజ్ఞాస, మోక్షాసక్తి కలుగుతాయని పౌరాణికులు ప్రవచిస్తున్నారు.

- చిమ్మపూడి శ్రీరామమూర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని