మంచిమార్పు మన చేతుల్లోనే

అన్నీ అనుకూలంగా ఉంటేనే సాఫీగా జీవితం సాగుతుందనుకోవడం సర్వసాధారణం. కానీ ప్రతికూలతలో అనుకూలాన్ని చూడటం, అనుకూలంగా మలచుకోవడం మనిషికి సాధ్యమే.స్వేచ్ఛగా సంచరించే వీలులేని కలికాలం దాపురించడం వేదనే. కానీ అందులోనే మానవమేధ ఆవిష్కరించిన సాంకేతిక సమాచార విజ్ఞానం, వైద్య విజ్ఞానం మరిన్ని వినూత్న అద్భుతాలను ప్రత్యక్షం చేశాయి.

Published : 01 Jan 2022 00:01 IST

న్నీ అనుకూలంగా ఉంటేనే సాఫీగా జీవితం సాగుతుందనుకోవడం సర్వసాధారణం. కానీ ప్రతికూలతలో అనుకూలాన్ని చూడటం, అనుకూలంగా మలచుకోవడం మనిషికి సాధ్యమే.
స్వేచ్ఛగా సంచరించే వీలులేని కలికాలం దాపురించడం వేదనే. కానీ అందులోనే మానవమేధ ఆవిష్కరించిన సాంకేతిక సమాచార విజ్ఞానం, వైద్య విజ్ఞానం మరిన్ని వినూత్న అద్భుతాలను ప్రత్యక్షం చేశాయి.
అందుకే మారుతున్న కాలం శుభాలను ప్రసాదించాలని కాంక్షిస్తూనే, కాలం కల్పించే శుభాశుభాలను సాహసంగా ఎదుర్కొనే- మనోబలాన్ని, సమస్యలను పరిష్కరించుకొనే బుద్ధిశక్తిని అనుగ్రహించాలని(ప్రసాదించాలని) పరమాత్మను ప్రార్థించాలి.
మార్పుల్లో కొన్ని నష్టాలు దుఃఖాన్ని మిగిల్చినా, వాటిని ప్రవాహగతిలో సమసిపోయేలా చేసే శక్తి కాలానికే ఉంది. ప్రకృతి క్షేమాన్ని, సమూహ సౌఖ్యాన్ని కోరుకొనే శుభాకాంక్ష మన స్వభావంగా మారితే, దానికి తగిన ప్రయత్న శక్తి తోడైతే- కాలం అనుకూలమే అవుతుంది.

మహాభారత గాథలో రాజ్యాన్ని పోగొట్టుకొని అడవులపాలైన ధర్మమూర్తులు ఆ ప్రతికూల కాలాన్ని వేదనతో గడపలేదు. ఆలోచనతో, తపస్సుతో, ప్రణాళికతో బలాన్ని, జ్ఞానాన్ని కూడగట్టుకున్నారు. ఏమరుపాటు లేకుండా, చతికిలపడకుండా తగిన సాధన చేశారు. వాటి బలంతోనే తగిన తరుణంలో అధర్మాన్ని ఎదుర్కొన్నారు. ధర్మానికి విజయాన్ని చేకూర్చగలిగారు.
మానవ వ్యవహార సౌలభ్యం కోసం ఏ దేశంవారు, ఏ సంస్కృతివారు తమకు అనుకూలంగా కాలగణన చేసినా ‘సంవత్సర’ రూపంలోనే చేశారు. కేలండర్‌లో సంవత్సరం మారగానే గతించిన కాలంలోని మార్పుల్ని నెమరువేసుకోవడం, రానున్నకాలం ఆనందదాయకంగా ఉండాలని కోరు కోవడం- మానవులందరి స్వభావం.
ఎవరి కాలగణన వారిదే అయినా, ఈ స్వభావం మాత్రం మానవాళి అందరిదీ. సువిశాల వైవిధ్య భారతదేశంలో భిన్న ప్రాంతాల్లో భిన్న కాలగణన ఉంది. వాటిని ఆ ప్రాంతాల వారంతా తమ సంస్కృతిగా అనుసరిస్తూనే ఉన్నారు. దానితోపాటు ప్రపంచమంతా వ్యవహరించే సాధారణ సంవత్సరాన్ని మంచి ఆకాంక్షలకు మరో అవకాశంగా భావిస్తూనే ఉన్నారు. వ్యవహార సౌలభ్యం కోసం అనంతకాలంలో కొన్ని విభాగాలు చేసుకున్నాం. ఆ విభాగాల సంధి బిందువుల వద్ద నిలబడి, ఒక కొత్త ఆశను ఆశయాన్ని గుండెనిండా నింపుకొని ముందుకు కదలడం మధురానుభూతి.
మత్తులోపడి తూలితూగే వేడుకగా కాక, శుభాలను కోరే సద్భావాల వ్యక్తీకరణగా- కొత్త ఏడాది ఆరంభోత్సవాన్ని జరుపుకోవడం మానవీయత. క్షణాలు, నిమిషాలు, ఘడియలు, గంటలు, పగళ్లు, రాత్రులు, పక్షాలు, మాసాలు- ఈ వత్సరమంతా ప్రపంచ మానవాళికి సామరస్య సౌమనస్య శాంతసౌభాగ్యాలను ఇవ్వాలని మనసారా కోరుకుందాం.
తమ ప్రాధాన్యాల ప్రాబల్యాలకోసం ఇతరులను ఆక్రమించే, హింసించే, వంచించే ప్రవృత్తులు- వ్యక్తులకు, దేశాలకు, వర్గాలకు ఉండరాదు. ఒకరి క్షేమం ఇంకొకరు కోరుకుంటామని చెప్పుకొనే, ఈ శుభాకాంక్షల నూతన సంవత్సరాహ్వాన పర్వదినంలో మాధుర్యం- ఒకరికోసం ఇంకొకరున్నారనే భరోసాతో కూడిన తోడును ప్రకటించడమే.
ఒక బాధాకర విషం ప్రపంచమంతా వ్యాపించి, అతలాకుతలం చేసిందని తెలుసుకున్నాక- అదే వేగంతో ఒక క్షేమంకర ప్రయోజనదాయకమైన సద్భావం, పరిజ్ఞానం కూడా వ్యాపించి శాంతిని ఆనందాన్ని విస్తరింపజేయగలవనే నమ్మికా కలగాలి. వ్యాపించిన చెడును, విస్తరించిన మంచితో ఎదుర్కోవాలంటే- అందరి మేలు కోరుకొనే లక్షణం పరస్పరం మేల్కొనాలి. ఆ మేల్కొలుపే కొత్త ఏడాది మునివాకిట్లో నిజమైన వేడుక... అచ్చమైన ఆనందహేల!

- సామవేదం షణ్ముఖశర్మ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని