దేహమే గేహం

ప్రతి జీవికీ కూడు, గూడు కనీస అవసరాలు. పక్షులు గూళ్లు నిర్మించుకుంటాయి. గిజిగాడి గూడు సొగసు చెప్పతరం కాదు. ఇక మనుషుల సంగతి వేరే చెప్పేదేముంది? ఎవరి స్తోమతను బట్టి వారు పూరిగుడిసె నుంచి రాజమహలు దాకా గృహ నిర్మాణాలు చేసుకుంటారు. అసలు జన్మతోనే జీవికి ఒక గృహం స్వతస్సిద్ధంగా ఉంటుంది- అదే దేహం.

Published : 07 Jan 2022 00:20 IST

ప్రతి జీవికీ కూడు, గూడు కనీస అవసరాలు. పక్షులు గూళ్లు నిర్మించుకుంటాయి. గిజిగాడి గూడు సొగసు చెప్పతరం కాదు. ఇక మనుషుల సంగతి వేరే చెప్పేదేముంది? ఎవరి స్తోమతను బట్టి వారు పూరిగుడిసె నుంచి రాజమహలు దాకా గృహ నిర్మాణాలు చేసుకుంటారు. అసలు జన్మతోనే జీవికి ఒక గృహం స్వతస్సిద్ధంగా ఉంటుంది- అదే దేహం. ఆ దేహమే జీవికి గేహం(ఇల్లు). జీవుడు ఆత్మతో కలిసినప్పుడు జీవాత్మ అవుతున్నాడు. ఆ జీవాత్మ నిత్యనివాసమే దేహం.
ఈ ఎరుక కలగడమన్నది ఏమంత తేలిక కాదు. సర్వమూ తానే అన్నంతగా దేహభ్రాంతి మనిషిని మోహితుణ్ని చేస్తూంటుంది. దేహం కోసం, గేహం కోసం మనిషి పడే శ్రమ ఇంతింత కాదు. ఒక్కోసారి స్తోమతకు మించి కూడా దేహానికి వస్త్ర, ఆభరణాల అలంకారాలు సమకూర్చుకుంటుంటారు. ఆనందం కోసం అప్పులు చేస్తారు. తిప్పలు పడతారు. గేహం కోసం కూడా అంతే. ఎంత చేసినా ఏదో ఒక పని మిగిలిపోయినట్లనిపిస్తుంది. కదిలిస్తే ఖర్చు అంచనాలను మించిపోతుంది. తీరిగ్గా పశ్చాత్తాప పడాల్సిన పరిస్థితీ ఎదురవుతుంది. వయసు ముదిరిన కొద్దీ దేహం సడలిపోతుంటుంది. శక్తి సన్నగిల్లుతుంటుంది. యౌవనం మధురస్మృతిగా మిగిలిపోతుంది. కటిక వాస్తవం లాగా వార్ధక్యం ఆలింగనం చేసుకుంటుంది. కాలగమనంలో గేహం కూడా తొలి అందాలు, ఆకర్షణలు కోల్పోతుంది. ఏ పండుగకో, పబ్బానికో గేహానికి నవీకరణలు చేయాల్సి ఉంటుంది. ఎన్ని చేసినా గేహ వార్ధక్యం ప్రచ్ఛన్నంగా తొంగిచూస్తూనే ఉంటుంది. కాలప్రభావాలను ఎవరు తప్పించుకోగలరు?

ప్రాపంచిక బంధాలకు బందీ అయి ఉన్నంతకాలం ప్రభావాలు తప్పవు. రాగం ఉన్నంతకాలం వెలుగు వెంట నీడలా ద్వేషమూ ఉంటుంది. రాగద్వేషాలను త్యాగం చేయడమే వైరాగ్యం. కాని, చెప్పినంత తేలిగ్గా వైరాగ్యం అబ్బదు. అబ్బురంగా అగుపించినవన్నీ మనవి కావాలనుకుంటాం. అనుకున్నవన్నీ జరగవు. అనుకోకపోయినా జరగాల్సినవి జరిగిపోతూనే ఉంటాయి. వాటిలో మన ప్రయత్నం, ప్రమేయం ఉండవు. గీతలో చెప్పినట్లు ప్రయత్నమే మన వంతు. ఫలితం దైవేచ్ఛగా లభిస్తుంది. మనం అలా అనుకోం. మనం ఆశించిన ఫలితాలు వస్తాయని, వచ్చి తీరాలనే దృక్పథంతో ఉంటాం. రాకపోతే నిరాశ, నిస్పృహలకు లోనవుతాం. కొందరు బలహీన మనస్కులు ఆత్మహత్య ఆలోచనలూ చేస్తారు. మహాభారతంలో దుర్యోధనుడంతటి దురహంకారికి అలాంటి దుస్థితి దాపురించింది. కానీ, మంచి మాటలతో తేరుకుంటాడు. మనిషికి బలహీన క్షణాల్లో బలమైన నైతిక స్థైర్యం కల్పించగలవారు ఉండాలి. అప్పుడే తెప్పరిల్లి, ధైర్యం అనే తెప్పతో కష్టాల కాలువను దాటగలుగుతాడు. ఆత్మహత్యతో దేహం నశిస్తుందే తప్ప సమస్యలు సమసిపోవు. అవన్నీ తమవారికి చుట్టుకుంటాయి. కాబట్టి, దేహనాశనం కోరుకోకూడదు. కోరుకోవాల్సింది మోహనాశనం.  అప్పులపాలయినవాళ్లు ఇళ్లు అమ్ముకుపోతారు. అంతకాలమూ ఇంటి మీద పెంచుకున్న మమకారం విస్మరించక తప్పదు. అలాగే, దేహం పట్ల కూడా మమకారాన్ని త్యజించాల్సిన పరిస్థితులు వస్తాయి. ముఖ్యంగా వార్ధక్యంలో అడుగడుగునా అశక్తత వెక్కిరిస్తుంటుంది. ఇక మమకారానికి తావెక్కడిది? జన్మతో దేహమే కాదు, మనిషికి జ్ఞానధనమూ ఇచ్చి పంపుతాడు భగవంతుడు. దాన్ని సద్వినియోగం చేసుకుంటే జన్మ ధన్యమవుతుంది. లేక పోతే వ్యర్థమవుతుంది. ఒక్క సత్యాన్ని మనిషి జీవనయాన ప్రారంభంలోనే గుర్తుంచుకోవాలి. దేహం ఒక గేహం మాత్రమే. ఇక్కడ నిర్మితమై ఇక్కడే నశించిపోతుంది. ఆరాధించాల్సింది అంతర్యామినే. మరి దేన్నీ కాదు!

- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని