వేదవాక్కు

వాక్కు అంటే బ్రహ్మ. వాగ్దేవి సరస్వతి. వాగీశ్వరి అనికూడా అంటారు. వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, సర్వేశ్వరి, జయిని, కాళిని అని మొత్తం ఎనిమిది నామాలతో విలసిల్లుతుంది. పరబ్రహ్మ....

Published : 09 Jan 2022 00:39 IST

వాక్కు అంటే బ్రహ్మ. వాగ్దేవి సరస్వతి. వాగీశ్వరి అనికూడా అంటారు. వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, సర్వేశ్వరి, జయిని, కాళిని అని మొత్తం ఎనిమిది నామాలతో విలసిల్లుతుంది.

పరబ్రహ్మ తత్వ విచారంలో పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని వాక్కు నాలుగు విధాలన్నారు. మానవుడు అక్షరసముదాయం నుంచి అనంత సాహిత్యాన్ని సృష్టించుకుంటున్నాడు. ‘అంబా’ అని అరిచే ఆవుదూడ కొంతకాలానికి ఆ అమ్మనే గుర్తించలేనట్లుగా మానవుడు సృష్టికి మూలం అయినదాన్ని తెలుసుకోలేక పోతున్నాడు. పరా, పశ్య, మధ్యమ, వైఖరీ శబ్దాలకు పరబ్రహ్మతత్వ విచారంలో పండితులు పలు వివరణలు ఇచ్చారు. విత్తు మొలకెత్తడానికి ముందు స్థితి ‘పరా’. విత్తనం భూమిలో పడి, ఉబ్బి, మొలకెత్తడానికి సిద్ధంగా ఉన్న స్థితి లాంటిది ఇది. విత్తులోనుంచి మొలక బయటకు వచ్చే స్థితి. మొక్క పెరిగి వృక్షం కావడం ‘మధ్యమ’ స్థితి. పూత పూయడం, కాయలు కాయడం వైఖరి స్థితి. అన్వయానికి అనుకూలమైన పదాల కూర్పు వల్ల వాక్యాలు ఏర్పడుతున్నాయి.

కవుల వాక్కులు చమత్కారానికి నెలవులు. గణపతిని వ్యతిరేకిం చేవారిని  గురించి ఒక ఆధునిక కవి ఒకే వాక్యంలో ఇలా పేర్కొన్నాడు. ‘పార్వతీబాయి ముద్దులబ్బాయి చేయి ఇడుము లందించి కలుములందించు గాక’ (కష్టాలను పోగొట్టి సంపదలను ఇవ్వాలి/ కష్టాలను ఇచ్చి సంపదలను పోగొట్టాలి) చమ త్కారంగా ఉండే ఇలాంటి కవితలెన్నో ప్రచారంలో ఉన్నాయి. వాల్మీకి, కాళిదాసాది కవుల వాక్కులకు గొప్ప శక్తి ఉన్నట్లు గాథలు ఉన్నాయి.

వేదవాక్కుకు ఉన్న ప్రామాణికత ఎప్పుడూ నిరూపితం అవుతూనే ఉంటుంది. ఆమధ్య శ్రీరామ జన్మ భూమి విషయంలో ఇది తేటతెల్లం అయింది. ఉన్నత న్యాయస్థానంలో వాదప్రతివాదాలు తీవ్రంగా జరిగాయి. ‘శ్రీరాముడు అయోధ్యలోనే జన్మించాడని ఏ ప్రామాణిక గ్రంథంలోనైనా ఆధారం ఉన్నదా?’ అని న్యాయాధిపతి సూటిగా ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. ఏ గ్రంథం పేరు చెప్పినా అది ప్రామాణికం కాదనే అవకాశం ఉంటుంది. ప్రముఖ న్యాయవాది పరాశరన్‌ రామజన్మభూమి ట్రస్ట్‌ పక్షాన వాదిస్తూ ఉన్నారు. ఆయన ఏం చెప్పగలరు? ‘ఉన్నది! ఆధారం ఉన్నది!’ అని ఒక గొంతు పలికింది. అందరూ అటువైపు చూశారు. ‘రుగ్వేదంలో ఉన్నది!’ అని ఆ వ్యక్తి సంహిత సహితంగా పూర్తి వివరాలు చెప్పారు. న్యాయాధిపతి వెంటనే రుగ్వేద ప్రతిని తెప్పించి, ఆ వ్యక్తి చెప్పిన పుటలో ఉన్న విషయం చదివారు. సరయూనదీ తీరంలో రాముడి జన్మభూమి ఉన్నదని అక్కడున్నది. వేదవాక్కుకు తిరుగులేదు! ఇంతకీ... ఆ వేదవాక్కు విషయం చెప్పిన వ్యక్తి అంధుడు. పేరు రామభద్రాచార్య. పద్మ విభూషణ్‌ గౌరవాన్ని పొందారు. ఆయన పేరుతో ఒక విశ్వవిద్యాలయమే నడుస్తున్నది! చిన్నప్పటి నుంచి తండ్రి వేదాలు పఠిస్తూ ఉండగా విని మొత్తం కంఠస్థం చేసుకున్న రామభద్రాచార్యకు ఇది చిన్న విషయమే కావచ్చు గాని, దేశచరిత్రలో గుర్తుంచుకోదగిన పెద్ద అంశంగా మిగిలింది!

మానవ జీవితం సంఘర్షణ మయం.ఆత్మబల సంపన్నులకు విజయం తథ్యం. వీరి ఆయుధం సత్యవాక్కు. ఈశ్వరుడు మానవుడిని దీనుడిగానో, హీనుడిగానో సృష్టించలేదు. మహోన్నతమైన మాటలాడే శక్తిని సైతం ప్రసాదించాడు. వాక్కు గొప్ప సంపద. అది సంస్కారయుతంగా ఉండాలి. ఈ సంపదను సద్వినియోగపరచుకున్న వారే ధన్యాత్ములు.

- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని