ఆ దివ్య చరణాలు

ఒక కొడుకు తండ్రిని అడిగాడు- ‘నాన్నా, దేవుడు ఎంత పెద్దగా ఉంటాడు?’ అని. తండ్రి ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని చూపించి ‘అదిగో... అది ఎంత పెద్దది’ అని ఎదురు ప్రశ్నించాడు. ‘చాలా చిన్నది. నేను

Published : 14 Jan 2022 00:21 IST

ఒక కొడుకు తండ్రిని అడిగాడు- ‘నాన్నా, దేవుడు ఎంత పెద్దగా ఉంటాడు?’ అని. తండ్రి ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని చూపించి ‘అదిగో... అది ఎంత పెద్దది’ అని ఎదురు ప్రశ్నించాడు. ‘చాలా చిన్నది. నేను జాగ్రత్తగా చూస్తే గానీ కనబడనంత’ అన్నాడు. ఆ తరవాత ఒకసారి తండ్రి విమానాశ్రయానికి కొడుకును తీసుకెళ్ళి, అప్పుడే నేలపై వాలుతున్న విమానాన్ని చూపించి ‘ఇది ఎంత పెద్దదంటావు’ అన్నాడు. ‘చాలా పెద్దది’ అని చెప్పాడు కొడుకు. ‘దేవుడూ అలాగే. మనమెంత దూరంలో ఉన్నామన్న దానిపై ఆయన పరిమాణం ఆధారపడి ఉంటుంది. మనం ఎంత దగ్గరగా ఉంటే ఆయన మన జీవితంలో అంత గొప్పగా ఉంటాడు!’

సముద్రంలో ఉప్పునీరు ఆవిరై అదే వర్షమై, పైనుంచి స్వచ్ఛమైన తాగునీరై కిందికి వస్తుంది. కాలువలు, కలుషితమైన సరస్సులు, మురికి గుంటలు... ఎక్కడి నుంచైనా, ఏ రూపంలో ఉన్నా ఆ నీటి స్థితి, గతి ఎలా ఉన్నా ఆవిరై పైకి చేరి, వర్షరూపంలో కిందకు జారితే- స్వచ్ఛత సంతరించుకుంటుంది. అలాగే... మనిషి ఎలాంటివాడైనా దైవశక్తితో ఐక్యమైతే ఆత్మశుద్ధి జరుగుతుంది. ప్రార్థనలు పైకి వెళ్ళినప్పుడు, ఆశీస్సులు కిందకు చేరతాయి.

మనుషులతో సాధ్యపడనిది దైవశక్తితో సాధ్యమవుతుంది. మనిషి క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు, అంధకార పరిస్థితి అలముకున్నప్పుడు తోడుగా నిలిచేది ‘ఒక్కరే’. అమితంగా ప్రేమించే వ్యక్తికి నయంకాని జబ్బు చేసినా, దివాలా పరిస్థితి ఎదుర్కోవలసివచ్చినా, బంధం తెగి బాధలో ఉన్నా, పరిష్కారం దొరకని పరిస్థితి ఎదురైనా- ఆ భగవంతుడికి అప్పజెప్పేయ్‌. ఎలాగన్నది ప్రశ్న... ప్రార్థనతో... నువ్వు తప్ప నాకు గత్యంతరం లేదన్న భావంతో... నువ్వే శరణమని ప్రార్థించాలి. అంతా బానే ఉంటుందనుకోవాలి. గుండె నిండా కృతజ్ఞత నిండాలి. కళ్ల నుంచి రాలిపడే నీటి చుక్కలు, భక్తి పారవశ్యానికి గుర్తులు. మనిషి మాట్లాడలేనప్పుడు అవి దైవం దగ్గరికి ప్రయాణిస్తాయి. ప్రార్థన అనేది ఒక అద్భుతమైన మానవ సృష్టి. వ్యక్తి తనలోకి తాను చూసుకునేందుకు, తనకు అంతుపట్టని అద్భుత అతీంద్రియ శక్తుల వైపు దృష్టి నిలిపేందుకు చేసే గొప్ప ప్రయత్నం. మనిషి దైవంతో సంభాషించేందుకు ఏర్పరచుకున్న ఒక సాధనం.

ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, ప్రార్థనలనేవి మొదటి ఎంపికగా ఉండాలే తప్ప, అన్నీ నిష్ప్రయోజనమని తెలిశాక ఉపయోగించే ఆఖరి అస్త్రం కాకూడదు. ‘భగవంతుడా! అంతా నీ చేతుల్లో ఉంది. చేసేది నువ్వే... నేను కాదు’ అనే విశ్వాసం ముఖ్యం. ‘దేవుడా నాకిదివ్వు, అదివ్వు’, ‘నా శత్రువులను నాశనం చేయి’ లాంటి స్వార్థపూరితమైన ప్రార్థనలు వక్రబుద్ధితో కూడినవి. అవి ప్రార్థన ఉద్దేశాన్నే చెడగొడతాయి. ప్రార్థన మనిషిలోని ఆత్మశక్తిని బయటకు తీస్తుంది. లోలోపలే దైవంతో కలుపుతుంది. విశ్వాసం, ప్రేమ, అంకితభావం... ఎంత బలంగా ఉంటే అంత ఫలితాన్ని ఆశించవచ్చు.

నిండుసభలో దుశ్శాసనుడి దౌర్జన్యాన్ని ప్రతిఘటించిన ద్రౌపది, నిస్సహాయంగా రక్షణ కోరుకుంటూ శ్రీకృష్ణుణ్ని వేడుకున్నప్పుడు- కేవలం విశ్వాసబలంతో చేసిన ప్రార్థనే, ఆమె మొరను వినేలా చేసింది. రక్షణ లభించింది. ప్రార్థనతో అనంతమైన శక్తితో మాట్లాడే మనిషి, ధ్యానంలో ఆ శక్తి పలికే మాటల్ని వినగలుగుతాడు. ప్రార్థనలో అన్వేషణ... ధ్యానంలో అనుభూతి! ఏకాంతంలోకి వెళ్ళి, ఇంద్రియాలను మూసి ఉంచి అంతర్ముఖంగా ప్రయాణిస్తే, బాహ్య ప్రపంచంలోని సంబంధాలను విడిచిపెడితే- అప్పుడు తెలుస్తుంది... ఎప్పటికీ మనిషి ఏకాకి కాడని.

ప్రకృతిలో విశ్వాసం, విత్తనం ఒకేలాంటివి. లోపల ఏమీ ఉన్నట్లనిపించదు. అయితే దేనినైనా సృష్టించగల గొప్ప శక్తి నిక్షిప్తమై ఉంటుంది!

- మంత్రవాది మహేశ్వర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు