అమలిన వ్యక్తిత్వాలు

వ్యక్తిత్వ వికాసం- ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుత అధ్యయనాంశాల్లో ఒకటి. దానికోసం ప్రత్యేక గ్రంథాలు, అధ్యయనాలు, అధ్యాపకులు అవసరమే. కానీ త్రికాలజ్ఞులైన మన ఋషులు, జ్ఞానులు భావితరాలకోసం ఎన్నో గ్రంథాలు రాసి పెట్టారు.

Published : 17 Jan 2022 01:08 IST

వ్యక్తిత్వ వికాసం- ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుత అధ్యయనాంశాల్లో ఒకటి. దానికోసం ప్రత్యేక గ్రంథాలు, అధ్యయనాలు, అధ్యాపకులు అవసరమే. కానీ త్రికాలజ్ఞులైన మన ఋషులు, జ్ఞానులు భావితరాలకోసం ఎన్నో గ్రంథాలు రాసి పెట్టారు. ఎన్నెన్నో ఉత్కృష్ట వ్యక్తిత్వాలను మన కళ్లముందు నిలబెట్టారు. పురాణాలు, చరిత్ర, జీవిత చరిత్రలు... వాటన్నింటికీ ఆధారం- నాటి వ్యక్తులు జీవించి చూపించిన విధానం, విజ్ఞానం, అనుసరించిన వ్యక్తిత్వ వికాసమే.

ఒక రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, హరిశ్చంద్రుడు, శిబి చక్రవర్తి, గాంధీ, సీత, కుంతి, ద్రౌపది, రామకృష్ణులు, వివేకానందుడు... ఎందరో! వాళ్లు పాఠాలు చెప్పలేదు. పుస్తకాలు రాయలేదు. వారి జీవితమే ఒక ఆదర్శం, ఒక శాస్త్రం, ఒక నిఘంటువు. వారు ఆదర్శం కోసమో, ప్రాచుర్యం కోసమో అలా జీవించలేదు కాబట్టే మనకు ఆదర్శం అయ్యారు. ఆచరణీయులయ్యారు. రాముడు, కృష్ణుడు... మానవులే. కాకపోతే మానవ శ్రేష్ఠులు. వారి జీవితమే ఒక వ్యక్తిత్వ వికాసం.

మానవుడు ఎలా జీవించాలో పరిపూర్ణంగా జీవించి చూపినవాడు రాముడు. ఇది అమాయక లోకం కాబట్టి నిజాయతీతో కూడిన సహజమైన ఆచరణ మనకు విడ్డూరంగా, ఉత్తమోత్తమంగా ఉంది. నిజానికి ప్రతి మనిషీ ఆచరించాల్సిన విధానం అది. విధి అది. అది ఆచరించాడు కాబట్టే రాముడు ఆదర్శప్రాయుడయ్యాడు. అపురూప మానవుడయ్యాడు. సాక్షాత్‌ రామచంద్రుడయ్యాడు. మిత్రుడిగా, పుత్రుడిగా, సోదరుడిగా, శిష్యుడిగా, రాజుగా, భక్తుడిగా జీవితంలోని ప్రతి పాత్రను, ఆ పాత్ర తాలూకు ప్రతి దశనూ పరిపూర్ణంగా, అత్యంత సహజంగా పోషించిన పురుషశ్రేష్ఠుడాయన. అందుకే ఒక రాజకుమారుడు, ఒక మామూలు మానవుడు... దేవుడయ్యాడు!

శ్రీకృష్ణుడు... పరిపూర్ణ అవతారం. సహజావతారం. బాలుడిగా ఆ చిలిపి పనులు, ఆ అల్లరి, పాలు- వెన్నల దొంగతనాలు, గోపికల వస్త్రాపహరణం, గోవర్ధనగిరినెత్తడం వంటివి సహజ బాల్యావస్థకు నిదర్శనం. బృందావనంలో రాసలీల, ఆ తరవాత రుక్మిణీ కల్యాణం, కంస మర్దనం, యౌవనావస్థకు నిలువుటద్దాలు. ప్రౌఢ వయసులో శత్రు సంహారాలు, ఆపన్నుల రక్షణ, ధర్మ రక్షణ, గీతావిష్కరణ... మనం ఏ అంశాన్ని, ఏ దశలోని కృష్ణుణ్ని తీసుకున్నా మనకు దిశా సూచకంగానే, దిశా నిర్దేశంగానే ఉంటుంది. ఆదర్శప్రాయంగానే ఉంటుంది.

ఇక సత్యపాలనకు సత్యహరిశ్చంద్రుడు, దేశభక్తికి మహాత్మాగాంధీ, భగత్‌సింగ్‌, రాణీ రుద్రమ, లక్ష్మీబాయి, అల్లూరి తదితరులు... ఆధ్యాత్మిక అనుసరణకు, ధర్మోద్ధరణకు రామకృష్ణులు, వివేకానందులు మనకు కాగడా ఎత్తి చూపిస్తున్న ఆదర్శప్రాయులు. ఎలాంటి పరిస్థితుల్లోనూ, ఏం కోల్పోవలసి వచ్చినా ఆత్మవిశ్వాసంతో, ఆత్మ గౌరవంతో ఎలా జీవితాన్ని నిభాయించాలో చెప్పకనే చెప్పిన సీత, కుంతి, ద్రౌపది, శారదా మాత- ప్రాతఃస్మరణీయులు.

అద్భుత గ్రంథరాజం భగవద్గీత. ‘గీతే లేకపోయివుంటే ప్రపంచ వాఙ్మయం పరిపూర్ణం అయ్యేదే కాదు. పరిపుష్టం అయ్యేదే కాదు’ అంటూ ప్రపంచ మేధావులు, జ్ఞానులు వేనోళ్ల శ్లాఘించారు. అదీ వ్యకిత్వ వికాస సౌరభం, వైభవం! ఇంతకంటే మనకు మరో వ్యక్తిత్వ వికాస శిక్షణ అవసరమా?

- చక్కిలం విజయలక్ష్మి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని