అహం నాస్తి

మనిషికి ఊహ తెలిశాక ‘నేను’ అనేది ఎప్పుడు అవగాహనకు వస్తుందో, అప్పటి నుంచి హృదయంలో స్వార్థం మొలకెత్తుతుంది. తన కోసం మాత్రమే జీవించడం మొదలుపెడతాడు. ఒకవేళ ఎప్పుడైనా లౌకిక జీవితం మీద విరక్తి భావన కలిగి ..

Published : 19 Jan 2022 00:19 IST

నిషికి ఊహ తెలిశాక ‘నేను’ అనేది ఎప్పుడు అవగాహనకు వస్తుందో, అప్పటి నుంచి హృదయంలో స్వార్థం మొలకెత్తుతుంది. తన కోసం మాత్రమే జీవించడం మొదలుపెడతాడు. ఒకవేళ ఎప్పుడైనా లౌకిక జీవితం మీద విరక్తి భావన కలిగి ఆధ్యాత్మికంగా అడుగులు వేస్తున్నా ‘అహం బ్రహ్మాస్మి’ అంటూ తనను తాను బ్రహ్మగా (విపరీతార్థం) చూపించుకునే ప్రయత్నం చేస్తాడు. తనకు మాత్రమే మోక్షం దక్కాలని తాపత్రయపడతాడు. కొంతమంది మాత్రం తమ జీవితాన్ని వెలుగు దివ్వెగా భావిస్తారు. నలుగురికీ ముక్తి మార్గం చూపడానికే తమ జన్మ అని తలపోస్తారు. వారి మాటలు, చేతలు ఆ ఉద్దేశాన్నే బహిర్గతం చేస్తుంటాయి. తమ కోసం తామేదీ కోరుకోరు. ఆచరించరు. పాలనుంచి నీళ్లను వేరు చేసే హంసలా వారు మన మనసు నుంచి చెడును తొలగించి స్వచ్ఛతను ప్రసాదిస్తారు. అందులో దైవ లక్షణాలు అసంకల్పితంగానే చోటు చేసుకుంటాయి. మంచి బావిలోని ఊట ఎప్పుడూ అమృతతుల్యమే కదా!

జైన గురువులను తీర్థంకరులు అంటారు. సందిగ్ధావస్థలోని మానవ జాతికి, సంసార చక్రభ్రమణంలో జనన మరణాలు పునరావృతం కాకుండా విడివడే దారిని చూపిస్తారని వారికి ఆ పేరు. మోక్ష మార్గానికి జైనులు చెప్పిన ఆచరణీయ త్రి రత్నాలు- సరైన విశ్వాసం, సరైన జ్ఞానం, సరైన నడవడిక. బుద్ధుడు సర్వం త్యజించి మానవుల ప్రవర్తనకు అనుగుణంగా అష్టాంగ మార్గం నిర్దేశించాడు. సరైన ఆదర్శం, సరైన సంకల్పం, సరైన మాట, సరైన చేత, సరైన జీవనం, సరైన కృషి, సరైన స్మృతి, సరైన సాక్షాత్కార మార్గాలవి.

ఒక్కొక్క నీటి బొట్టుతోనే కుండ నిండుతుంది. బుద్ధిమంతుడు కొద్ది కొద్దిగా మంచిని మనసులో పోగు చేసుకుంటూ చివరికి మంచితో నిండిపోతాడంటాడు బుద్ధుడు. గురుగోవింద్‌ సింగ్‌ సిక్కుల గురువుల్లో పదోవారు. ఆయన ఆది గ్రంథ్‌(గురు గ్రంథ్‌ సాహిబ్‌)ను తన వారసురాలిగా ప్రకటించారు. మానవులను గురువులుగా ప్రకటించే విధానానికి స్వస్తి పలికి, ఉత్తమ గ్రంథమైన ‘ఆది గ్రంథ్‌’ను గురువుగా చాటారు. గురుగ్రంథ్‌ సాహిబ్‌లోని ముఖ్య వాణులు- ప్రపంచంలోని మానవులంతా సమానమే, అందరికీ ఒక్కడే భగవంతుడు, ఎప్పుడూ సత్యాన్నే పలుకుతూ సచ్ఛీలుడిగా జీవించాలి, దేవుడి ఆజ్ఞపై జీవించాలి. మానవత్వం, దయ, జాలి, ప్రేమల్ని ఆచరించాలి; జీవించి ఉండగానే పరమాత్మను చేరే మార్గ తత్వం గ్రహించాలి, గురుబోధనల ద్వారా దైనందిన జీవితంలోని సమస్యల నుంచి బయటపడాలి.

ఆది గ్రంథ్‌లో కథలు లేవు. జీవనమార్గాన్ని సూచించే సూక్తులు, విశాల తత్వంతో జీవించే మార్గాలూ ఉన్నాయి!

ఆనంద శబ్దంతో అంతమయ్యే సన్యాసాశ్రమ నామం ఒకానొక నిర్దిష్ట మార్గంలో, స్థితిలో, ఒక దివ్య విశిష్టత ద్వారా మోక్షం సాధించాలన్న ఆశయాన్ని సూచిస్తుంది. ఆత్మ ధరించిన శరీరానికే అన్ని వికారాలూ. ఆత్మ ఎప్పుడూ స్వచ్ఛమైనదే. రుషులు, స్వాములు, సన్యాసులు, సంఘ సంస్కర్తలందరూ మానవజాతి ఉద్ధరణ కోసమే జన్మించిన మహానుభావులు. వారు సూచించిన వివిధ మార్గాల్లో పద్ధతులతో ప్రక్షాళితమైన శరీరాన్ని ఆత్మతో సంలీనం చేయడమే మోక్షపథంలో తొలిమెట్టు. ‘అహం బ్రహ్మాస్మి’ నుంచి ‘అహం నాస్తి’ వైపు సాగించే పయనమది.

- ప్రతాప వెంకట సుబ్బారాయుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని