నిశ్చల నదీప్రవాహం

నదులు నేలతల్లి కంఠసీమను అలంకరించే మణిహారాలు. కంఠహారాలు తిన్నగా ఉండవు. ఒంపుల సొంపులు వాటి ప్రత్యేకత. జీవనదులు సైతం అలా ఉన్నప్పుడే వాటి అస్తిత్వం శోభిల్లుతుంది. అడ్డు వచ్చే రాళ్లను రప్పలను దాటుకుంటూ వెళ్ళవలసిన నది నిశ్చల ప్రవాహం కోరుకోదు.

Published : 20 Jan 2022 00:31 IST

నదులు నేలతల్లి కంఠసీమను అలంకరించే మణిహారాలు. కంఠహారాలు తిన్నగా ఉండవు. ఒంపుల సొంపులు వాటి ప్రత్యేకత. జీవనదులు సైతం అలా ఉన్నప్పుడే వాటి అస్తిత్వం శోభిల్లుతుంది. అడ్డు వచ్చే రాళ్లను రప్పలను దాటుకుంటూ వెళ్ళవలసిన నది నిశ్చల ప్రవాహం కోరుకోదు. కానీ మనిషి నిశ్చల నదీప్రవాహంలా తన జీవితం సాగాలని కోరుకుంటాడు.అత్యాశ కదూ? కాదంటారు విమర్శకులు. నదీప్రయాణంలో ఎదురయ్యే కొండలు, జలపాతాల్లా ఆధ్యాత్మిక ప్రయాణంలోనూ ఒడుదొడుకులు ఎదురవుతాయి. నావకు సరంగు దర్శకత్వం తోడ్పడితే, సాధకుడికి సద్గురువు దార్శనికత దారి చూపుతుంది.
అసంఖ్యాక జీవులు ప్రకృతి బడిలో పాఠాలు నేర్చుకుంటాయి. జీవికను తదనుగుణంగా మలచుకుంటాయి. మానవుడు ప్రకృతికి చేరువగా జీవించవలసి ఉన్నా వైజ్ఞానికంగా ఆలోచించగల మేధ కారణంగా అసహజమైన కర్మలు చేస్తాడు. అపరిపక్వ కర్మలే అతడి కష్టసుఖాలకు కారణమవుతాయి. జంతువులు వాటి ప్రకృతికి భిన్నంగా కర్మలు చేయవు. తప్పులు చేయవు.
నిశ్చల నదీప్రవాహంలో పడవ ప్రయాణం లాంటి బతుకును మనిషి కోరుకుంటాడు. మరే ప్రాణీ అలా కోరుకోదు. అందుకేనేమో మానవ జీవితం ఒడుదొడుకులు, సుఖసంతోషాల మేలు కలయికగా సాగుతుంది.
మానవ జన్మ ఉదాత్తమైనది. మనిషి మస్తిష్కంలో సమస్త ప్రపంచమూ ఇమిడి ఉంది. సప్తస ముద్రాలు, అంతరిక్షం, వైవిధ్యభరిత ప్రకృతి, పరమ పావనమూర్తి భగవంతుడు అందులో కొలువై ఉన్నారు. పాహిమాం అంటూ ఆర్తిగా పిలిస్తే దైవం భక్తుడి అంతఃకరణలో కనిపిస్తాడు. ప్రాణ రూపంలో శివుడు అలరారగా దేహం నుంచి ఆయన నిష్క్రమించిన మరుక్షణం అదొక చెత్త మూట అవుతుంది. ‘నారాయణ! హరినారాయణ!’ అని కీర్తించి ఉత్తమ గతులు పొందాలని ప్రబోధిస్తారు పండితులు. మానవ దేహధారణ జననమరణ చక్రం నుంచి బయటపడే నిమిత్తం దైవం అనుగ్రహించిన మహదవకాశంగా భావించాలంటారు మహాత్ములు.
సనాతన ధర్మంలో పరమాత్మ బహురూపధారణ కొందరిలో ఏ దేవతను ఆరాధించాలనే సందిగ్ధతకు దారి తీయవచ్చు. ఓ వ్యక్తి ప్రవర్తన... సన్నివేశం ఒకటే అయినా, భిన్న సందర్భాల్లో వేర్వేరుగా ఉండవచ్చు. అందుకు అతడి మనఃస్థితిలోని అస్థిరతే కారణం. సత్యం మారదు. స్థిరంగానే ఉంటుంది. లోకాలనేలే పరమాత్మ అనేక రూపాల కారణంగా సంశయానికి లోనుకాకుండా నచ్చిన స్వరూపాన్ని పూజించవచ్చునంటారు పండితులు.ఏ రూపంలో కొలిచినా అన్ని ప్రార్థనలు, పూజలు ఆయనకే చెందుతాయి. తన నుంచే అనేక దేవతల మంగళ కరమైన దీవెనలు భక్తులకు అందుతాయంటాడు శ్రీకృష్ణ భగవానుడు.
జీవితంలో మనిషిని అనుభవాల రూపంలో పలకరించే కఠోర పరిస్థితులను అతడు అంగీకరించాలంటారు మనోవైజ్ఞానికులు. అలా చేయగల సాధనమే ఆధ్యాత్మికం అన్న సత్యాన్ని మరవకూడదు.అదే సాధనలో కీలకాంశం. తప్పని పరిస్థితిని అంగీకరించినప్పుడు మార్పు చేయలేని ఆ అంశాన్ని మనసు జీర్ణించుకొని స్థైర్యాన్ని పొందుతుంది. రూపసహిత దేవతారాధన కానీ రూపరహిత ప్రార్థన కానీ సాధకుడి జీవితం సాఫీగా సాగేలా చేయగలదన్నది విజ్ఞాన శాస్త్రం అంగీకరించిన సత్యం. ఆ సత్యాన్ని గుర్తిస్తే తన జీవితం ఒడుదొడుకులు లేకుండా ఆనందమయ తీరాలకు చేరుకోగలదని సాధకుడు గ్రహిస్తాడు.

- గోపాలుని రఘుపతిరావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు