సతతం సంతుష్ట మానసం

ప్రతి క్షణం జీవితం సంతృప్తిగా, సంతోషంగా గడపాలనే కోరిక అందరికీ సహజం. అది అసాధ్యమని తెలుసు. నిత్య జీవితంలో ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, ఆటుపోట్లు ఉంటాయి. వీటితోపాటు సంతోషం, ఆనందం... ఇవన్నీ ప్రవహించే నదీ తరంగాలు. కదిలే మేఘాలు. వీటన్నింటి మధ్యా మనిషికి అనుక్షణం సంతృప్తి సాధ్యమేనా? అవును! అంటారు పెద్దలు.

Published : 21 Jan 2022 00:41 IST

ప్రతి క్షణం జీవితం సంతృప్తిగా, సంతోషంగా గడపాలనే కోరిక అందరికీ సహజం. అది అసాధ్యమని తెలుసు. నిత్య జీవితంలో ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, ఆటుపోట్లు ఉంటాయి. వీటితోపాటు సంతోషం, ఆనందం... ఇవన్నీ ప్రవహించే నదీ తరంగాలు. కదిలే మేఘాలు. వీటన్నింటి మధ్యా మనిషికి అనుక్షణం సంతృప్తి సాధ్యమేనా? అవును! అంటారు పెద్దలు.
మనిషికి కోరికలు అపారం. ధనం, సంపద, బంధుప్రీతి, అధికారం... ఇవన్నీ జీవితంలో పరుగెత్తించే ఆకర్షణలు. కోరికలను అదుపు చేసి, ఇంద్రియ నిగ్రహం సాధించి, ఇక చాలు అనే స్థాయికి చేరడం అత్యున్నత మోక్ష స్థితి. మోహక్షయమే మోక్షం.
మనసే బంధాలకు మూలం. ప్రేరేపించే సాధనాలు ఇంద్రియాలు. ఇవి బుద్ధిని అణచివేసి వివేకాన్ని, విచక్షణను దూరం చేసి, చేయరాని పనులు చేయించి, అశాంతి కలిగిస్తాయి. శాంతి, సంతృప్తి, సమన్వయం లోపించి, మనిషి కుంగిపోతాడు. మనసును అదుపు చేయడం తాపసులకే సాధ్యంకాలేదు. ఆలోచనా తరంగాలు ఉద్ధృతంగా ప్రవహించే జలాల వంటివి. చేతులు చాపి, నీటి ప్రవాహాన్ని ఆపాలనుకోవడం అవివేకం. నిరంతర ఆలోచనా స్రవంతికి అడ్డుకట్ట వేసి మనోనిగ్రహం సాధించడం అసాధ్యమా? నిరంతర సాధనతోటే జీవన లక్ష్యాన్ని చేరాలంటే- పరిశీలనా దృష్టి, పరిశోధనా వివేకం, దృఢ దీక్ష, నిరంతర ప్రయత్నం కొనసాగాలి.
నిండు సభలో తన కుమారుడు రాముణ్ని యువరాజుగా ప్రకటించాడు దశరథుడు. ఆ మరునాడే పట్టాభిషేక ముహూర్తంగా నిర్ణయించారు. అన్ని ఏర్పాట్లూ ఘనంగా జరిగాయి. కొద్ది గంటల్లో రాజరికం అందుతుందనే ఆనందం ఆవిరిగా మారి, పద్నాలుగు సంవత్సరాల వనవాసం సంప్రాప్తించింది. విషమ పరిస్థితిలోనూ రాముడి దరహాసం చెదరలేదు. పట్టాభిషేకానికి ఎంతటి సంతుష్ట మానసంతో ఉన్నాడో అదే సమన్వయం, సమచిత్తం వనవాసానికీ చూపించాడు. ఇదే రామాయణం బోధించే స్థితప్రజ్ఞ.
ఓటమిని ముందుగా అంగీకరించాలి. మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా వ్యతిరేక పరిస్థితులను సానుకూలంగా మార్చుకోవాలి. తనలోని బలహీనతలు, పరాజయ కారణాలు తెలుసుకుని సరిదిద్దుకొని, విజయపథం వైపు ముందుకు సాగాలి.
రాజసూయ యాగంతో బలం పుంజుకొని, విజయం సాధించిన పాండవులు మాయాజూదంలో సర్వం కోల్పోయి, అవమానాలు భరించి, అరణ్యవాసం చేశారు. ఏ పరిస్థితి తమను పరాజితులను గావించిందో దానినే అనుకూలంగా మలచుకున్నారు. శ్రీకృష్ణ సహకారం, దేవతల వరాలు, సమయస్ఫూర్తి, నిరంతర  సంతుష్ట మానసం చివరకు విజయాన్ని సాధించాయి. ఇదీ భారత కథ సందేశం.
మైనాన్ని నేర్పరితనంతో ఏ ఆకారంలోకైనా మార్చుకోవచ్చు. మనసు కూడా మైనం వంటిదే. ఏ పాత్రలో పోసినా జలం అదే ఆకృతి దాలుస్తుంది. అది మన మనసుకు సైతం సహజ గుణం కావాలి.
లంకలో హనుమ రాత్రి సమయంలో ఎన్నెన్నో వైభోగాలు, స్వర్ణ మందిరాలు, అపార ధనరాశులు, అలంకార శోభితులైన సౌందర్యవతులను చూశాడు. ఎన్ని ఆకర్షణలు కనిపించినా, మనసు చెదరలేదు. సంతుష్ట మానసంతో శ్రీరామ నామాన్ని స్మరిస్తూనే సీత జాడనే కాంక్షించాడు. నిర్మలమైన మానసిక స్థితే మేలిమి ఆధ్యాత్మిక మార్గం.
ఆత్మసాక్షిగా నిలిచిన అంతర్యామిని మనసునిండా ఉంచితేనే మనలో నిరంతరం సమచిత్తం, సానుకూల దృక్పథం, సంతుష్ట మానసం సాధ్యం.

- రావులపాటి వెంకట రామారావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని