Updated : 22 Jan 2022 05:04 IST

నాదబ్రహ్మ

రాముడి కోవెల లేని ఊరు, త్యాగరాజ కీర్తన పాడని గానసభ మనం ఎక్కడా చూడమన్నది పెద్దల మాట. త్యాగరాజ స్వామి జననం సంగీత లోకానికి నూతన శకారంభం. సాక్షాత్తు నారదుడి వద్దనుంచి ‘స్వరార్ణవం’, ‘నారదీయం’ అనే సంగీత గ్రంథాలను వరంగా పొందిన ధన్యుడు త్యాగరాజు. నారదుడి గురించి భక్తి పారవశ్యంతో కానడ రాగంలో ‘శ్రీ నారద సరసీ రుహ భృంగ శుభాంగ’ అని కీర్తించాడు త్యాగయ్య.

రామ తారకమంత్రాన్ని తిరువయ్యూరులోని పంచనదీశ్వరాలయంలో తొంభై ఆరు కోట్లు పునశ్చరణ చేసి రామ సాక్షాత్కారాన్ని పొందిన పారవశ్యంతో అఠాణా రాగంలోని ‘బాలకనకమయ చేల సుజన పరిపాల, విధృత శరజాల, నవ్య మాలికాభరణ ...’ మొదలైన ఎన్నో విశేషణాలతో రాముడి దివ్య మంగళ రూపాన్ని కీర్తించాడు త్యాగయ్య. అలతి అలతి పదాలతో ఆ రామయ్యను త్యాగయ్య ఆర్తితో దర్శించిన కీర్తనలు ఎన్నో. మధ్యమావతి రాగంలో ‘అలకలల్లలాడగ గని ఆరాణ్ముని ఎటు పొంగెనో’ అనే కృతిలో కూడా అటువంటి రామ దర్శనం వర్ణితమే.

భక్త శిరోమణి అయిన త్యాగరాజు భుక్తి కోసం రాజాశ్రయాన్ని కోరలేదు. శిష్యులను వెంటబెట్టుకొని రామ సంకీర్తనలు గానం చేస్తూ ఊంఛవృత్తితో సంపాదించినదాన్నే మహా ప్రసాదంగా, ‘దధి నవనీత క్షీరములు రుచో, దాశరథీ ధ్యాన సుధారసము రుచో నిజముగా తెలుపు మనసా, నిధి చాల సుఖమా రాముడి సన్నిధి సేవ సుఖమా’ అని ప్రశ్నించాడు.

పొట్టకూటికి పనికిరాని తమ్ముడి విద్యకు నిరసనగా అన్న జేపేశయ్య త్యాగయ్య పూజించే రామ పంచాయతన విగ్రహాలను కావేరిలో పడవేస్తే రాముడే స్వయంగా కలలో కనిపించి తన జాడ త్యాగయ్యకు చెప్పాడట. పట్టరాని ఆనందంతో బిలహరి రాగంలో ‘కనుగొంటిని శ్రీరాముని నేడు’, ‘రారా మా ఇంటిదాకా’ అసావేరి రాగంలో కీర్తన, ‘ఎట్లా దొరికితివో’ అనే వసంత రాగం కీర్తన గానం చేస్తూ దేవతా విగ్రహాలను పల్లకిలో ఊరేగిస్తూ ఇంటికి తీసుకొని వచ్చాడట. త్యాగయ్య కీర్తనలు భక్తి ఆధ్యాత్మిక ప్రబోధాలు. ‘తెరతీయగరాదాలోని మత్సరమను’ అనే కీర్తన గానంతో తిరుపతి వేంకటేశ్వరుణ్ని దర్శించుకున్నాడు త్యాగయ్య.

డెబ్బై రెండు మేళకర్త రాగాల లోనూ కీర్తనలను రచించాడు త్యాగయ్య. బహు దారి, చెంచు కాంభోజి, దీపకం, కోకిలధ్వని వంటి అపూర్వ రాగాలలో కృతులను రచించాడు. అర్థగాంభీర్యం, రస స్ఫురణ కలిగిన ఘనరాగ పంచరత్న కీర్తనలెన్నో రచించాడు. నారద పంచరత్నాలు, కోవూరు పంచరత్నాలు, శ్రీరంగపట్నం పంచరత్నాలు మొదలైనవీ త్యాగయ్య సంగీత రచనలే.

ఎంతో జటిలమైన కీర్తనలనే కాక అందరూ సులభంగా పాడుకునే విధంగా ఉత్సవ సంప్రదాయ కీర్తనలూ రచించాడు త్యాగయ్య. వేదాంత ధోరణిలో రచించిన ‘శాంతమూ లేక సౌఖ్యము లేదు’ అనే సామ రాగంలోని కీర్తన, నీతి బోధకంగా ‘మనసు నిల్ప శక్తి లేకపోతే’ అనే ఆభోగి రాగ కీర్తన, పశ్చాత్తాపాత్మక ప్రార్థనకు ‘ఎటుల బ్రోతువో మనసా’ వంటి సాహిత్య భావాలను బట్టి కృతులను రచించాడు త్యాగయ్య. ప్రహ్లాద భక్తి విజయము, నౌకా చరిత్ర, సీతారామ విజయం, అనే సంగీత నాటకాలను రచించాడు త్యాగయ్య.
మహా వాగ్గేయకారుడిగా, పరమ భక్తాగ్రేసరుడిగా సంగీతమంతా ఒకే వేదాంతమని చాటిన త్యాగరాజస్వామి భారతీయులకు అవతారపురుషుడు. ఆయన ఆరాధన భగవదారాధనే.

- గంటి ఉషాబాల

Read latest Editorial News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని