జనన మరణ చక్రం

విశ్వసృజనకారుడు బ్రహ్మ. ఆయన సృష్టి చాలా సుందరమైంది. సూర్యచంద్రులు, అనేక గ్రహ గోళాలు, ఎన్నో భిన్న జాతుల ప్రాణులు... అన్నీ సృష్టికర్త ముచ్చటగా తీర్చిదిద్దిన అందాలు. ఎంతో రమణీయంగా మనసు దోచుకునే సౌందర్యం కాలగతిలో అంతరించి తీరుతుంది.

Published : 23 Jan 2022 01:21 IST

విశ్వసృజనకారుడు బ్రహ్మ. ఆయన సృష్టి చాలా సుందరమైంది. సూర్యచంద్రులు, అనేక గ్రహ గోళాలు, ఎన్నో భిన్న జాతుల ప్రాణులు... అన్నీ సృష్టికర్త ముచ్చటగా తీర్చిదిద్దిన అందాలు. ఎంతో రమణీయంగా మనసు దోచుకునే సౌందర్యం కాలగతిలో అంతరించి తీరుతుంది. ప్రకృతి రమణీయతే కాదు- చరాచర ప్రాణులన్నీ జనన మరణ చక్రాన్ని అనుసరించాల్సిందే. కాలగమనం ఎప్పుడు మొదలైందో ఎవరూ అంచనా వెయ్యలేరు. ఆద్యంత రహితమైన కాలం సృష్టి రథాన్ని ముందుకు నడిపిస్తుంది. నిత్యం లక్షలాది ప్రాణులకు ఊపిరి పోస్తుంది. జీవం పోసుకున్న ప్రతి ప్రాణి జీవిత లక్ష్యంవైపుగా సాగాలి. భగవంతుడు ఏ నమ్మకంతో విశ్వవేదిక మీద స్థానమిచ్చాడో ఆ నమ్మకాన్ని నిలబెట్టాలి.

ప్రతి ప్రాణికి భూమ్మీద శాశ్వతంగా నిలిచిపోవాలని మనసులో ఉంటుంది. భౌతిక దేహంతో అది ఎప్పటికీ సాధ్యం కాదు. అసురులు మాత్రమే దాన్ని నిజం చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేస్తారు. ప్రకృతి తత్వం గుర్తెరిగిన మనిషి కాలధర్మం చెందడానికి కలతపడడు. కర్తవ్య పరాయణుడైన మానవుడు కాలానికి అధిక ప్రాముఖ్యమిస్తాడు. ధర్మాచరణాన్ని వాయిదా వెయ్యడు.

ప్రాతః, సాయంసంధ్యల్ని రోజూ గమనిస్తుంటాం. ఉదయించిన సూర్యబింబం సాయంత్రానికి అస్తమిస్తుంది. మధ్యలో ఎన్నో మేఘాలు రవిబింబాన్ని చుట్టుముడతాయి. ఆయన కాంతికి అడ్డు తగులుతుంటాయి. ఆ అవరోధం తాత్కాలికం. మానవుడు ఎదుర్కొనే కష్టాలు ఆ కోవలోకే వస్తాయి. మనిషి ఇహలోకాన్ని అతిథి గృహం లాగానే భావించాలి. శాశ్వత నివాసం పరమాత్మ సన్నిధి అన్న ఎరుక కలిగి ఉండాలి. ఈ తాత్కాలిక యాత్రలో నేను నాది అన్న భావన విడనాడాలి. అది మనసును వ్యాకులపరుస్తుంది. మనిషిని సంకుచితుణ్ని చేస్తుంది. స్వార్థం బతుకు పరమార్థంగా కలిగిన అతికొద్ది జీవుల్లో మనిషి కూడా ఉండటం మానవ జన్మకు మాయని మచ్చ. పరహిత సాధన ద్వారా ఆ కళంకాన్ని తొలగించుకోవచ్చు.

అంతరిక్ష పరిశోధనలో భాగంగా అనేక ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెడతారు శాస్త్రజ్ఞులు. అనుకున్న ప్రదేశంలో ఉపగ్రహం దిగడంతోనే సగం పరిశోధన విజయవంతమైనట్లుగా భావిస్తారు. అదేవిధంగా మాతృగర్భంలో ఊపిరి పోసుకోవడంతో మనిషి ప్రయాణం మొదలవుతుంది. అలా కొంతమేర విజయుడైన శిశువు తల్లి సహకారంతో పూర్తి రూపంతో భూమిపై అడుగుపెడతాడు. ఆయువు ఉన్నంతమేర ప్రతి వ్యక్తీ బతుకు సాగిస్తాడు. సమాజ హితానికి సహకరించడం, పొరుగువారికి తోడ్పాటునందించడంతో తన రాకకు పరమార్థాన్ని కల్పించినవాడవుతాడు.

పశుపక్షుల నుంచి మనిషిని వేరు చేసేది జన్మ సార్థకత. ఎంత దీర్ఘకాలం జీవించామన్నది ప్రధానం కాదు. సమాజంపై వేసిన చెరగని ముద్రను జీవిత పరమావధిగా విజ్ఞులు గణిస్తారు. ఉన్నతిని కోరుకునే వ్యక్తి మొదటి లక్షణం ఆటంకాలకు ఎదురు నిలవడం. ఆ గుణం అతడిని ఆదర్శప్రాయుడిగా నిలబెడుతుంది. ఈ లోకంతో శాశ్వత సంబంధాన్ని కోల్పోయినా కాలం అతడిని అమరుణ్ని చేస్తుంది. ఐన్‌స్టీన్‌, గాంధీ, మదర్‌ థెరెసా మొదలైనవారు ఉన్నత వ్యక్తిత్వంతో మహాత్ములయ్యారు. తమ జన్మ సార్థకం చేసుకున్నారు. శ్రీరాముడు, బుద్ధుడు, ఏసుక్రీస్తు వంటివారు మనుషులుగానే జన్మించారు. ధర్మపథంలో నడిచారు. భావితరాలకు దిశానిర్దేశం చేశారు. దైవాంశగా పూజలందుకుంటున్నారు.

- గోలి రామచంద్రరావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని